Home Unknown facts కొమురవెల్లి మల్లన్న గురించి ఎవరికీ తెలియని విషయాలు

కొమురవెల్లి మల్లన్న గురించి ఎవరికీ తెలియని విషయాలు

0

నమ్మి కొలిచే భక్తులకు కొండంత అండగా ఉండే దేవుడు కొమురవెల్లి మల్లన్న.సిద్ధిపేట్ నుండి సికింద్రాబాద్ వచ్చే మార్గంలో సిద్ధిపేట నుండి 24 కిలోమీటర్ల దూరంలో చేర్యాల మండలంలో కొమురవెల్లి గ్రామంలో నెలకొని ఉంది ఈ కొమురవెల్లి మల్లన్న దేవాలయం. హైదరాబాద్ నుండి 90 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పూర్వ కాలంలో ఈ ప్రదేశంలో కుమారస్వామి కొంతకాలం తపస్సు చేశాడని, అందుకే ఈ ప్రాంతానికి కుమారవెల్లి అనే పేరువచ్చి, కాలక్రమేణా కొమరవెల్లి అయింది అని ప్రతీతి. పరమ శివుడు ఇక్కడ తన భక్తులను కాపాడటానికి వీరశైవమతారాధకులైన మాదిరాజు, మాదమ్మ అనే దంపతులకు కుమారుడై జన్మించి తన మహిమలతో భక్తులను కాపాడాడని క్షేత్ర పురాణం చెపుతుంది. తర్వాత కూడా తన భక్తుల రక్షణార్ధం ఇక్కడే కొలువుతీరాడు.

Komuravelli Mallannaభక్తులచేత ఆప్యాయంగా కొమరవెల్లి మల్లన్నగా పిలువబడే ఈ మల్లికార్జునస్వామి ఇక్కడ శివునికి సాధారణ ప్రతి రూపమైన లింగ రూపంలోకాక, గంభీర ఆకారంలో నిలువెత్తు విగ్రహంగా…. కోరమీసాలతో చూడగానే మనసు భక్తి భావంతో పొంగిపోయే విధంగా దర్శనమిస్తాడు. కొమురవెల్లి మల్లన్న స్వామి బండ సొరికల మధ్యలో వెలిసాడు. యాదవ కులానికి చెందిన గొల్ల కేతమ్మ, లింగ బలిజకులానికి చెందిన మేడలమ్మ ఇద్దరు భార్యలు స్వామికి ఇరువైపులా దర్ళనమిస్తారు. మట్టితో చేసిన ఈ విగ్రహం సుమారు 500 సంవత్సరాల క్రితం చెయ్యబడ్డది. కాలక్రమేణా భక్తుల రాక మొదలయ్యి, రాను రాను అధికం కావంటంతో దేవాలయంలో వున్న మండపములు విస్తరించారు. సత్రాలు, నూతన కట్టడాలు నిర్మించారు.

ఈ దేవుని ఎక్కువగ కురుమలు, గొల్లలు, కాపువారు పూజిస్తారు. గుడి ఎదురుగా గంగిరేణి వృక్షము ఉంది. ఈ గంగిరేణి వృక్షానికి కొన్ని వందల సంవత్సరాల వయస్సు ఉంటుంది. వచ్చిన భక్తులు స్వామి వారి దర్శన అనంతరం ఈ గంగిరేణి వృక్షానికి కోరిన కోర్కెలు తీరాలని ముడుపులు కడతారు. ఆలయానికి దాదాపు 20 మీటర్ల దూరంలో ఆలయ కోనేరు ఉంది.ఇక్కడ జాతర జనవరి నెలలో మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఉగాది వరకు ప్రతి ఆది-బుధ వారాలలో జరుగుతుంది. సంక్రాంతి పండుగకు ముందు కళ్యాణోత్సవం జరుగుతుంది. పండుగ తరువాత వచ్చే మొదటి ఆదివారం రోజున జంటనగరాల నుండి లక్షల సంఖ్యలో యాత్రికులు వచ్చి మొక్కులు చెల్లిస్తారు. యాదవ భక్తులు సందర్శించే ఈ జాతరలో బోనం, పట్నం అనే విశేషమైన మొక్కుబడులుంటాయి.

బోనం అంటే, అలంకరించిన కొత్త కుండలో నైవేద్యం (అన్నం) వండి స్వామివారికి నివేదిస్తారు. ఆ పక్కనే రంగు రంగుల ముగ్గులతో అలంకరించిన ప్రదేశంలో బోనాన్ని ఉంచి స్వామివారిని కీర్తిస్తూ ఆ నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఒక విధంగా ఇది స్వామి కళ్యాణమే. ఢమరుకం (జగ్గు) వాయిస్తూ, జానపద శైలిలో వారి సంప్రదాయబద్ధమైన పాటలు పాడుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే వారిని ఒగ్గు పూజారులుగా పిలుస్తారు. వీరు పసుపుపచ్చని బట్టలు ధరించి, చేతిలో ముగ్గుపలక, ఢమరుకం (జగ్గు) జాతర ప్రాంగణంలో కనువిందు చేస్తారు. జాతర చివరలో కామదహనం (హోళీ) పండుగకు ముందు పెద్ద పట్నం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వందల సంఖ్యలో ఒగ్గు పూజారులు, విశాలమైన ముగ్గులను వేసి వాటి మధ్యన స్వామిని ఆవాహన చేసి సామూహికంగా జగ్గులు వాయిస్తూ దేవుణ్ణి కీర్తిస్తారు.

వీర శైవ (బలిజ) పూజారులు, వీరభద్రుణ్ణి, భద్రకాళిని పూజించి, రాత్రివేళ చతురస్రంగా ఏర్పరిచిన స్థలంలో టన్నులకొద్దీ కర్రలను పేర్చి, మంత్రబద్ధంగా అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. తెల్లవారు జాములో ఆ కర్రలన్నీ చండ్రనిప్పులుగా మారుతాయి. వాటిని విశాలంగా నేర్పి, కణ కణ మండే నిప్పుల మధ్యనుండి మూడు సార్లు స్వామివారి ఉత్సవ విగ్రహాలతో దాటి వెళ్ళుతారు. వందల సంఖ్యలో భక్తులు కూడా దాటుతారు. దీనిని అగ్నిగుండాలు అని పిలుస్తారు. సుతిమాను గుండు మీద త్రిశూలం ఉంటుంది. దాని ప్రక్కనే రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది.

మల్లన్న దేవాలయానికి 15 కి.మీ దూరంలో కొండ పోచమ్మ దేవి ఆలయం కూడా ఉంది. మల్లన్న ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడికి కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు.

Exit mobile version