Home Unknown facts సంవత్సరంలో 11 నెలలు పాటు నీటిలోనే మునిగి వేసవిలో మాత్రం కనిపించే గ్రామం ఎక్కడ...

సంవత్సరంలో 11 నెలలు పాటు నీటిలోనే మునిగి వేసవిలో మాత్రం కనిపించే గ్రామం ఎక్కడ ఉందొ తెలుసా

0

బద్రినాధ్ వంటి ఆలయాలు ఏడాదిలో కేవలం ఆరు నెలలు మాత్రమే కనిపిస్తాయి, మిగతా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటాయని మనకు తెలిసిందే. ఆలయాన్ని మూసివేసే ముందు వెలిగించిన అఖండ దీపం తిరిగి ఆరు నెలల తరువాత తెరిచి చూస్తే అలాగే వెలుగుతూ ఉంటుందని విన్నాం, చూసాం. అలాంటి ఎన్నో వింతలూ, విడ్డురలు మనం దేశంలో ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశమే గోవాలో ఉంది.

Unknown Facts About Kurdi Village11 నెలల పాటు ఆ గ్రామం నీటిలోనే ఉండి వేసవిలో మాత్రమే పైకి తేలే ఆ ప్రదేశాన్ని చూసేందుకు పర్యాటకులు, గ్రామస్తులు పోటెత్తుతుంటారు. తేలిన సందర్భంలో దీనిని చూడటానికి రెండు కళ్లు చాలవని, అందమైన దృశ్యాన్ని చూసేందుకు ఉత్సాహం చూపుతుంటామంటుంటారు. అదే గోవాలోని కుర్ది గ్రామం. గోవాలోని పశ్చిమ కనుమల్లో కొండల మధ్యలో సలౌలిం నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరీవాహక ప్రాంతంలో కుర్ది అనే గ్రామం ఉంది.

నిజానికి ఆ గ్రామం ఒకప్పుడు మామూలుగానే ఉండేది. దాదాపు 3000లకు పైగా జనాభా నివసించే వారు. జీడిపప్పు, కొబ్బరి, జాక్ ఫ్రూట్, మామిడి చెట్లు, వరి పొలాలతో సంపన్నమైన వ్యవసాయ గ్రామంగా కుర్ది వెలుగొందింది. అన్ని మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసించేవారు. దీనికి చిహ్నంగా ఈ గ్రామంలో అనేక దేవాలయాలు, మసీదులు, చర్చి అవశేషాలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి.

1961లో పోర్చుగీసుల నుంచి గోవా విముక్తి పొందిన కొన్ని దశాబ్ధాల్లోనే ఇక్కడి పరిస్థితులు వేగంగా మార్పుచెందాయి. అప్పటి గోవా మొదటి ముఖ్యమంత్రి దయానంద్ బండోడ్కర్ కుర్ది గ్రామాన్ని సందర్శించి అక్కడి గ్రామస్తులతో సమావేశమయ్యారు. గోవాలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన మొట్ట మొదటి జలాశయం గురించి, దాని వలన మొత్తం దక్షిణ గోవాకు చేకూరే ప్రయోజనం గురించి ప్రజలకు వివరించారు. ఈ జలాశయం కారణంగా కుర్ది గ్రామం నీట మునుగుతుందని, అందువలన ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని కోరారు.

ఆనకట్ట నిర్మాణం జరిగితే వందల గ్రామాలకు తాగు నీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తమ ఊరును ఖాళీ చేసి మొత్తం 600 కుటుంబాలు సమీప గ్రామాలకు వెళ్లిపోయాయి. సారవంతమైన వ్యవసాయ భూములను, తోటలను కోల్పోయారు. ప్రభుత్వం పునరావాస ప్యాకేజీ కింద వారికి ఆర్థిక సాయంతో పాటు, మరోచోట సాగు భూములు ఇచ్చింది. 1986లో ఆ నదిపై ఆనకట్ట నిర్మించారు. దాంతో ఆ గ్రామం మొత్తం నీట మునిగింది. వందల ఎకరాల సారవంతమైన భూములు, తోటలు కనుమరుగయ్యాయి. ఇక్కడ విచిత్రమేంటంటే సంవత్సరంలో పదకొండు నెలలు పాటు ఆ గ్రామం నీటిలోనే మునిగి ఉన్నా..వేసవిలో మాత్రం తేలుతుంది.

ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టును దక్షిణ గోవాలోని చాలా ప్రాంతాల్లో వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలకు నీటిని అందించేందుకు చేపట్టారు. దీని కారణంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు సాగునీరు సమకూరుతుంది. కానీ తమ గ్రామాన్ని ఖాళీ చేసి వలస వెళ్లిన నిర్వాసితులకు మాత్రం ఈ నీరు అందకపోవడం విచారకరం. అయినప్పటికీ ప్రతి ఏటా మే నెలలో నీటి మట్టం తగ్గిన తరువాత కుర్ది గ్రామ ప్రజలు ఇక్కడికి చేరుకుని కోల్పోయిన తమ ప్రాంతంలో విందులను చేసుకుంటారు.

వేసవిలో జలాశయంలో ఉండే నీరు పూర్తిగా ఇంకిపోవడం వల్ల గ్రామం ఆనవాళ్లు శిథిలాలు బయటకు కనబడుతాయి. అది కూడా కొద్ది రోజులు మాత్రమే. ఆనకట్ట కోసం తమ గ్రామాన్ని ఇచ్చిన ఆ గ్రామంలోని ప్రజలు, ఇతర ప్రాంతాల్లో నివశించే వారు ఈ నెలరోజుల పాటు ఇక్కడికి వచ్చి, సంబురాలు చేసుకుంటారు. వారు నివశించిన ప్రాంతాన్ని చూస్తూ అక్కడ సంతోషంగా గడుపుతుంటారు. శిథిలమైన తమ ఇండ్లను, తాము తిరిగిన ప్రాంతాలను గుర్తు చేసుకుంటుంటారు.

ఒకప్పుడు వారు పూజించిన దేవాలయం, చర్చి శిథిలావస్థకు చేరుకున్నా సరే.. ఆయా మతస్థులు వాటిల్లోనే తమ దైవాలను ప్రార్థిస్తుంటారు. ఈ విషయం తెలిసి దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. వర్షాలు ప్రారంభమయ్యాయంటే క్రమేణా మునిగే కుర్ది గ్రామం ఒక దశలో ఓ దీవిలా దర్శనమిస్తుంది.ఆ సమయంలో ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్లూ సరిపోవు.

 

Exit mobile version