చేసే ప్రతి పనిలో లక్ష్మీ కటాక్షం ఉండాలని అనుకుంటాం. శ్రీలక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో రకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటారు. కానీ మనం చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల అమ్మవారి అనుగ్రనికి దూరం అవుతాం. ఏ పనులు చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది, ఎటువంటి పొరపాట్లు చేస్తే లక్ష్మీ కటాక్షానికి దూరం అవుతామో తెలుసుకుందాం.
సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి. వెనక గది తలుపులను తీశాకే ఇంటి సింహద్వార తలుపులు తెరవాలి. మంగళ, శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి.
ఇంటికొచ్చే ముత్తైదువులకు పసుపు, కుంకుమ, తాగేందుకు నీరు ఇవ్వడం మరిచిపోకూడదు. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ జన్మల్లో చేసిన పాపాలు హరింపబడతాయి. సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్య నారాయణ స్వామిని తులసితో అర్చించి.. పాలతో చేసిన పాయసం, కలకండ, పండ్లతో నైవేద్యం చేయాలి. ఈ పూజ అయిన తర్వాతే రాత్రి భోజనం తీసుకోవాలి.
వజ్రం, వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవారికే లభిస్తాయి. ముఖ్యంగా వెండి సామాన్లు, వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు. ఇంట్లో వున్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు.
అయితే అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు.
బయటికి వెళ్లి కాళ్లను శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీదేవి ఉండదని పురోహితులు అంటున్నారు.