Home Unknown facts అరుదుగా కనిపించే కస్తూరీ మృగాల ఆవాసం ఎక్కడో తెలుసా ?

అరుదుగా కనిపించే కస్తూరీ మృగాల ఆవాసం ఎక్కడో తెలుసా ?

0
కస్తూరి మృగం ఒకరకమైన జింక. సైబీరియా నుంచి హిమాలయాల వరకు ఉన్న పర్వత ప్రాంతాలలో కస్తూరిమృగాలు నివసిస్తుంటాయి. భారతదేశంలో  ప్రత్యేకించి అస్సాం రాష్ట్రాలలోని పైన్ అడవులలో కస్తూరి మృగాలు కనిపిస్తాయి. సుగంధభరితమైన కస్తూరిని విడుదల చేయడం వీటి ప్రత్యేకత. అందువల్లనే వీటిని కస్తూరి మృగం అంటారు. హిమాలయాల్లో 8,000 అడుగుల ఎత్తున ఉండే చొరరాని పైన్ అడవులు కస్తూరి మృగాల ఆవాసాలు.
Unknown Facts About musk beasts
ఇవి లేడి జాతికి చెందినవి. లేళ్లకు తల మీద మెలికలు తిరిగిన కొమ్ములు ఉన్నా, అదే జాతికి చెందిన కస్తూరి మృగాలకు కొమ్ములు ఉండవు. ఆకారంలో కూడా ఇవి కొంచెం చిన్నవిగా వుంటాయి. అడవి పంది లాగా, ఇవి వాటి జీవితమంతా పెరుగుతూనే ఉంటాయి. మగ కస్తూరి మృగాలకు నోటి వైపులా పొడవైన కోరలు ఉంటాయి. వీటికి పెద్ద చెవులు ఉంటాయి. తోక చాలా చిన్నదిగా ఉండీ లేనట్టు ఉంటుంది. శరీరం ముందు భాగం కంటే వెనుక భాగం కొంచెం ఎత్తుగా ఉంటుంది.
ముందు కాళ్లు నిటారుగా, వెనుక కాళ్లు కొంచెం వంగి ఉంటాయి. ఇవి కలప లైకెన్లు, కొమ్మలు, ఆకులు, చెట్ల బెరడు, గడ్డి, నాచు మరియు పుట్టగొడుగులను కూడా తింటాయి. కస్తూరి జింకలు ఒంటరిగా ఉండడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయ. చాలా అరుదుగా సమూహాల్లో కనిపిస్తాయి. అంతేకాదు కస్తూరి జింకలు  చాలా పిరికివని చెబుతారు. అవి బయటి జంతువులు గానీ మనుషులు గాని కనిపిస్తే చాలా వేగంగా పరిగెడతాయి.
కస్తూరి మృగాలు ఉత్పత్తిచేసే కస్తూరి ఒక సుగంధద్రవ్యం. మగ కస్తూరి మృగాల పొట్ట అడుగున నాభి దగ్గర ఉండే సంచుల వంటి అరలలో కస్తూరి ఉత్పత్తి అవుతుంది. ఆడ కస్తూరి మృగాలను ఆకర్షించడం కోసం మగ కస్తూరి మృగం నుంచి వెలువడే ఈ పరిమళ ద్రవ్యం యొక్క సువాసన తోడ్పడుతుంది. మగ కస్తూరి మృగం వృషణాలనుంచి తయారయ్యే ఈ ద్రవ్యాన్ని ఆ మృగం దాదాపు రెండు అంగుళాల వ్యాసం కలిగిన ఒక సంచిలో నిల్వచేసుకుంటుంది. తాజాగా ఉత్పత్తి అయినపుడు కస్తూరి కొంచెం పలచగా, ద్రవంలాగ ఉంటుంది. కొంతకాలానికి అది బిగుసుకుని గట్టిగా తయారవుతుంది.
కస్తూరిలో ఉండే అమ్మోనియా, ఓలీన్, కొలెస్టరిన్ వంటి గాఢమైన వాసన కలిగిన ద్రవ్యాల కారణంగా కస్తూరికి అంత చక్కని పరిమళం వచ్చింది. అయితే ఆ కస్తూరి  పరిమళం తన నాభి నుండి వస్తుందని కస్తూరి జింకలకు తెలియదట. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది.  ఆ అన్వేషణలో అలా అడవి అంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడి ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.
మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా ఇలాగే వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్ని వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంత రంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా తిరిగినా చివరకు మనిషి ఆధ్యా త్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.

Exit mobile version