శివుడి వాహనంలా మారే అదృష్టం నందికి ఎలా వచ్చిందో తెలుసా ?

శివుని పేరు వింటే పార్వతి, గంగ, నాగేంద్రుడు గుర్తుకొస్తారు. అలాగే మరోపేరు కూడా ప్రముఖంగా గుర్తుకొస్తుంది. అదే నంది. నంది శివుని వాహనం. శివుడు ఎటు వెళ్లినా నందిని తీసుకువెళ్తాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. శివాలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా నంది దర్శనమిస్తుంది. శివుడి వాహనమైన నంది రెండు కొమ్ముల మధ్య నుంచి లింగాన్ని చూస్తారు. మరికొందరు నంది చెవిలో తమ కోరికలను చెప్పుకుంటారు. అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ,శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది. అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే.

Nandeeswaruduఅపార జ్ఞాన సంపన్నుడైన శిలాదుడనే ఋషికి సంతానం లేకపోవడంతో వెలితిగా ఉండేది. సంతాన భాగ్యం కోసం తపస్సు చేసి, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు సంతాన వరాన్ని ప్రసాదించాడు. శివుడి వరం పొందిన శిలాదుడు యజ్ఞం చేస్తుండగా హోమ గుండంలో నుంచి బాలుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ బాలుడికి నంది అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నాడు. నంది అంటే సంతోషాన్ని కలిగించేవాడు అని అర్ధం. ఆ బాలుడి మేధస్సు కూడా అసాధారణంగా ఉండేది. చిన్నతనంలోనే వేదాలన్నీ అవపోసన పట్టేశాడు నంది.

Nandeeswaruduఒక రోజు శిలాదుడు ఆశ్రమానికి మిత్ర వరధులనే దేవతలు వచ్చారు. ఆశ్రమంలో నందిని చూసి అతడు తమకు చేసిన అతిథి సత్కారాలకు మురిసిపోయారు. వారు వెళుతూ నందిని ‘దీర్ఘాయుష్మాన్ భవ’ అని ఆశీర్వదించబోయి ఒక్కసారి ఆగారు. నంది వంక దీక్షగా చూస్తుండగా వారి చూపుల్లోని ఆంతర్యాన్ని శిలాదుడు గ్రహించాడు. నంది ఆయుష్షు త్వరలోనే తీరిపోతుందని వారి ద్వారా తెలియడంతో ఆందోళన చెందాడు. అయితే, దీనికి పరిష్కార మార్గం శివుడే సూచిస్తాడని నంది తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యారు. శివుడ్ని చూసిన నందికి నోటి నుంచి మాట రాలేదు.

Nandeeswaruduశివుడి పాదాల చెంత ఎంత బాగుందో కదా అనుకుని, తన ఆయుష్షు గురించి మరిచిపోయి చిరకాలం నీ చెంతే ఉండే భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని కోరుకున్నాడు. నంది భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు వృషభ రూపంలో తన వాహనంగా ఉండమని అనుగ్రహించాడు. నాటి నుంచి శివుడి ద్వారపాలకుడిగా కైలాసానికి రక్షకుడిగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. క్షీరసాగర మథనంలో హలాహలం జనించిగా లోకాలను కాపాడేందుకు శివుడు దానిని తన కంఠంలో దాచుకున్నాడు. ఆ సమయంలో కొద్దిపాటి విషం ఒలికి కిందపడటంతో శివుడి చెంతనే ఉన్న నంది ఏ మాత్రం సంకోచించకుండా దానిని తాగేశాడు. దేవతలే ఆ విషానికి భయపడి పారిపోతుంటే నంది శివుని మీద నమ్మకంతో సంతోషంగా స్వీకరించాడు. అందుకే శివుడికి సేవకుడిగానే కాదు ముఖ్య భక్తుడిగా కూడా పూజలందుకుంటున్నాడు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,630,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR