Home Unknown facts నరసింహస్వామి లక్ష్మీదేవిని పెనవేసుకొని దర్శనమిచ్చే అద్భుత ఆలయం గురించి తెలుసా?

నరసింహస్వామి లక్ష్మీదేవిని పెనవేసుకొని దర్శనమిచ్చే అద్భుత ఆలయం గురించి తెలుసా?

0

నరసింహస్వామి అమ్మవారిని పెనవేసుకొని ఒక శిలా రూపంలో స్వయంభువుగా వెలసి దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే అవ్వడం విశేషం. ఈ ఆలయంలో స్వామివారిని పెంచలయ్యగా, అమ్మవారిని చెంచు లక్ష్మీగా కొలుస్తుంటారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఇక్కడి విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, రావూరు మండలం లో నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా 80 కీ.మీ. దూరంలో, రావూరు నుంచి 30 కీ.మీ. దూరంలో గోనుపల్లి గ్రామానికి 7 కీ.మీ. దూరంలో పెంచలకోన అను క్షేత్రంలో పెనుశిలా లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇచట శ్రీ స్వామివారు లోకకల్యాణార్థం పెంచలకోన క్షేత్రంలో పెనుశిలారూపంలో స్వయంబుగా వెలసినట్లు స్థలపురాణం చెబుతుంది. ఈ కొండ శిఖరములనుండి జాలువారు నీటి ధార స్వచ్చంగా ప్రవహించి దిగువన కండలేరు జలాశయంలో కలుస్తున్నది.

ఈ నరసింహస్వామి చెంచువనితనైనా లక్ష్మీదేవిని పెనవేసుకొని అవతరించినందున ఈ ప్రాంతానికి పెనుశిలా క్షేత్రమని పేరు వచ్చినట్లుగా స్థానికులు చెబుతారు. ఆ పేరు రూపతరం చెంది పెంచలకోనగా మారిపోయింది అని చెబుతారు. పూర్వము కన్యమహర్షి తపస్సు చేసిన పవిత్ర స్థలం కూడా ఇదే అని తెలియుచున్నది. ఈ క్షేత్రంలో కణ్వమహర్షి తపస్సు చేయడం వల్ల్ల ఈ నదికి కణ్వనది అని పేరు. ఇదే క్రమేణా కండ్లేరు, కండలేరుగా మారింది

పెంచలకోన క్షేత్రంలోని స్వామిని పలుపేర్లతోపిలుస్తారు, పెంచలస్వామి, పెనుశిల స్వామి, నరసింహస్వామి, లక్ష్మీనరసింహస్వామి, చత్రవటనరసింహుడు, కొండి కాసులవాడు ఇలా పలుపేర్లతో స్వామిని పిలుస్తారు. తిరుమల నుంచి శ్రీశైలం వరకు ఉన్న ఒకే కొండ మధ్యభాగంలో గల పెంచలకోన క్షేత్రంలోని కొండ రెక్కలు విప్పినట్లు గరుడ ఆకారంలో ఉంటుంది. క్షేత్రంలోని గర్భగుడిని సుమారు 800 సంవత్సరాల క్రితం నిర్మించి ఉంటారని అంచనా. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయ సమీపంలో సంతానలక్ష్మి వటవృక్షం ఉంది. సంతానం లేనివారు ఈ వృక్షానికి చీరకొంగు చించి ఉయ్యాలకడితే సంతానం కలుగుతుందని నమ్మకం. కొండ మీద నుంచి కోనవరకు ఏడు నీటిగుండాలు ఉన్నాయి. ఈ గుండాల్లో స్నానమాచరిస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం.

లక్ష్మి నరసింహస్వామి వారు గ్రామానికి వచ్చిన తొలిసారి గొర్రెల కాపరికి తొలిదర్శనం ఇచ్చాడు. అందుకే ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో కోనకు బయలుదేరే స్వామివారికి గ్రామ సమీపంలోని గొల్లబోయిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రీవారు సతీసమేతంగా గొల్లబోయికి తొలిదర్శనమిచ్చి అనంతరం కోనకు చేరుకుంటారు.

పురాణానికి వస్తే, హిరణ్యకశిపుని వధానంతరం ఉగ్రరూపుడైన స్వామివారు నరసింహ అవతారరూపంలో వెలుగొండలలో సంచరిస్తుండగా చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి చెలిమితో శాంతించి ఆమెను వివాహమాడినట్లు పురాణాలు చెపుతున్నాయి. గోనుపల్లి గ్రామంలోని విగ్రహాలకే పెంచలకోనలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని పెళ్లి కొడుకుని చేసి గోనుపల్లి గిరిజనకాలనీకి తీసుకువస్తారు. స్వామి రాగానే గిరిజనులు ఇంటి అల్లుడికి, కుమార్తెకి (స్వామి, అమ్మవార్లకు) ఆతిథ్యం ఇచ్చి పూజలు నిర్వహిస్తారు. వేకువజామునే అడవికి వెళ్లి పుట్టతేనె, ఇంజేటిగడ్డలు, సారపప్పు, పెద్ద మల్లెపూలు, బందారి ఆకులతో బాషికం, ఎల్లగడ్డలు తెస్తారు. ఇళ్ల ముందు చలువ పందిళ్లు వేసి అల్లుడికి ఆహ్వానం పలుకుతారు. తండేడుతో తాళిబొట్టు, స్వామివారికి కట్నంగా ఇచ్చే ఆరినార మొలతాడును అందజేసి సాంగ్యం చెల్లిస్తారు. స్వామికి టెంకాయ, కర్పూరం, వడపప్పు, చీర, రవికలు సమర్పిస్తారు.

శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కాబట్టి స్వామివారి దర్శనానికి ఆ రోజు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, స్వామి వారిని దర్శించి, పూజించి తరిస్తారు.

Exit mobile version