చిరంజీవులు అంటే ఎప్పటికీ చావు లేనివారు అని అర్థం. పురాణాల ప్రకారం ఏడుగురు చిరంజీవులు ఉన్నారు.
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః ।
కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥
సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత ॥
సప్త చిరంజీవి శ్లోకాన్ని పుట్టినరోజు నాడు చదవాలని పండితులు చెప్తున్నారు. పుట్టిన రోజునాడు ఆవు పాలు, బెల్లము, నల్లనువ్వులు కలిపిన మిశ్రమాన్ని నివేదన చేసి ఈ క్రింది శ్లోకం చదివి తీర్ధంగా మూడు సార్లు తీసుకోవడం ద్వారా అపమృత్యు దోషం తొలుగుతుంది. మరి ఆ సప్త చిరంజీవులు ఎవరు తెలుసుకుందాం.
1. అశ్వద్దామ:-
ద్రోణాచార్యుని కుమారుడు,మహాభారత యుద్ధం అనంతరం కృష్ణుడి శాపం వల్ల ఇతడు చిరంజీవిగా ఉండిపోతాడు.
2. బలి:-
ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు,ఇంద్రుని జయించినవాడు,వామనమూర్తి కి మూడడుగుల భూమిని దానం చేసి,అతని చే పాతాళమునకు తొక్కబడిన వాడు. కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గధాధారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు. ఇతడు చిరంజీవి.
3. వ్యాసుడు :-
సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వయపాయనముని అని పిలవబదేవాడు. అష్టదశాపురాణాలను, బ్రహ్మసూత్రములను,భారత భాగవతములను రచించాడు. వేదాలను విడబరచిన వానిని వ్యాసుడు అని పేర్కొంటారు.
4. హనుమంతుడు:-
కేసరి భార్య అగు అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞ ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో వున్న శివుని శక్తిని ఆమెకు ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టినాడు. సూర్యుని శిష్యుడు, శ్రీ రామ భక్తుడు. పరమేశ్వరుని అవతారముగా కొలవబడిన హనుమంతుడు కూడా చిరంజీవుడు. రామ భాక్తాగ్రేస్వరుడైన ఆంజనేయుడు చిరంజీవిగా తన భక్తులకు సకల శుభాలను కలిగిస్తాడు.
5. విభీషణుడు:-
కైకసికి విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. రావణుని అనంతరం లంకాధిపతి అయిన ఇతడు చిరంజీవుడు.
6. కృపుడు:-
శరద్వంతుని కుమారుడు. శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు. సప్తరుషులలో స్థానము పొందిన కృపుడు చిరంజీవి.
7. పరశు రాముడు:-
ఇతడు రేణుకా జమదగ్నుల కుమారుడు. తండ్రి ఆజ్ఞను మన్నించి తల్లిని కూడా సంహరించాడు. ఇతనిని మెచ్చుకొన్న తండ్రి వరం కోరుకొమ్మనగా తల్లిని బ్రతికించమన్నాడు. జమదగ్నికి తాత బృగు మహర్షి, ఆ మహర్షి ఉపదేశంతో హిమాలయమునకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేసాడు. శివుని ఉత్తర్వుతో తీర్ధ యాత్రలు చేశాడు, శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు.
అయితే ఈ సప్త చిరంజీవులు కలియుగాంతం వరకు జీవించే ఉండటానికి విశిష్ట కారణం ఉంది. కలియుగ అంతంలో శ్రీమహా విష్ణువు కల్కి అవతారంలో వస్తారని కలిని అంతం చేయటానికి విష్ణుమూర్తికి సహాయపడేందుకు వారు చిరంజీవులుగా ఉంటారు అని పురాణాల్లో చెప్పబడింది.