50 సంవత్సరాలకి ఒకసారి శివరాత్రి రోజున దర్శనమిచ్చే అద్భుత శివలింగం

0
3876

పరమశివుడు తేత్రాయుగంలో ఇక్కడి గుహలో వెలసి కలియుగంలో పూజలందుకుంటానని శ్రీరాముడికి చెప్పి గుప్తంగా ఈ గుహలోనే ఉండిపోయాడని పురాణం. ఇలా కలియుగంలో ఒక వేటగాని కారణంగా వెలుగులోకి వచ్చిన ఈ శివలింగం దాదాపు 50 సంవత్సరాలు ఒక్క శివరాత్రి రోజు మాత్రమే దర్శన భాగ్యం లభించిందంటా. మరి శివుడు రహస్యంగా ఉన్న ఈ గుహ ఎక్కడ ఉంది? ఇక్కడ శివుడు ఎలా వెలిసాడు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gupteswar Temple Of Koraput

ఒడిశా రాష్ట్రం,కోరాపుట్ జిల్లాలో, జైపూర్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో, రామగిరి అనే కొండ సమీపంలో, శబరి నది ఒడ్డున గుప్తేశ్వర గుహ లో తేత్రాయుగం నాటి స్వయంభు శివలింగం ఉంది. ఈ ప్రాంతం అంత కూడా శివుడికి అంకితం చేయబడింది. దట్టమైన అరణ్యంలో ఉన్న ఈ గుహలో శివుడు పూర్వం గుప్తంగా కొన్ని యుగాలుగా ఉండటం వలన వీటికి గుప్తేశ్వర గుహలు అనే పేరు వచ్చిందని చెబుతారు.

Gupteswar Temple Of Koraput

ఇక పురాణానికి వస్తే, తేత్రాయుగంలో సీతారామ లక్ష్మణులూ అరణ్యవాసానికి పంచవటిక వెళుతూ ఇక్కడి అరణ్యంలో కొన్ని రోజులు నివసించారట. శ్రీరాముడు శివుడి కోసం తపస్సు చేయగా అప్పుడు శివుడు ప్రత్యక్షమై అరణ్యవాసం నిర్విఘ్నంగా తప్పకుండ నెరవేరుతుందని, నేను ఇక్కడే లింగాకారంలో వెలసి గుప్తంగా అంటే రహస్యంగా ఉండి కలియుగంలో పూజలను అందుకుంటానని చెప్పి ఇక్కడే స్వయంభువుగా వెలిశాడని పురాణం.

Gupteswar Temple Of Koraput

ఇక గుప్తేశ్వర గుహ గురించి మరొక కథ వెలుగులో ఉంది, తేత్రాయుగంలో వెలసిన శివుడూ కలియుగంలో 17 వ శతాబ్దం వరకు కూడా అలా గుప్తంగానే ఉండిపోయాడంట. ఎందుకంటే అప్పుడు ఇదంతా దట్టమైన అరణ్యం కావడంతో ఇంతదూరం లోపలికి రావడానికి ఎవరు కూడా సాహసించలేదు. ఇక 17 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని వీరవిక్రమదేవ్ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఈ రాజు సంస్థానంలో ఇక్కడి రామగిరి ప్రాంతానికి పాత్రో అనే వాడు ఒక అధికారిగా ఉండేవాడు. ఇతడికి మాంసం అంటే చాలా ఇష్టం. దాంతో ఒక గిరిజన యువకుడిని నియమించుకొని అతడు వేటకు వెళ్లి జంతువులని చంపి ఆ మాంసాన్ని అతడికి రోజు ఇస్తుండేవాడు.

Gupteswar Temple Of Koraput

ఇలా ఒక రోజు వేటకు వెళ్లగా ఆ వేటగాడికి ఒక లేడి కనిపించడంతో దాని కడుపులో బాణాన్ని వేయగా ఆ లేడి ఈ శివలింగం ఉన్న గుహలోకి వెళ్లగా దాన్ని వెంబడి వెళ్లిన ఆ వేటగాడికి అక్కడ శివలింగం, లేడి, ఒక ముని కనిపించడంతో నమస్కరించి వేటని మానేసి తిరిగి వచ్చి పాత్రో కి చెప్పగా, అతడు ఆ వేటగానితో వెళ్లి చూడగా ఆ గుహలో శివలింగం ఒక్కటే దర్శనం ఇచ్చింది. అప్పుడు వెంటనే జరిగిన విషయం రాజుకు చెప్పడంతో రాజు వచ్చి కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న ఈ లింగానికి గుప్తేశ్వరుడు అని పేరు పెట్టి అప్పటినుండి పూజలు చేయడం ప్రారంభించాడు.

Gupteswar Temple Of Koraput

ఇలా ఈ లింగాన్ని పూర్వం సంవత్సరంలో ఒక శివరాత్రి మాత్రమే దర్శించేవారు ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సరైన మార్గం అనేది ఉండకపోవడం మళ్ళీ వన్య మృగాలు అక్కడ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఎవరు సాహసించేవారు కాదంటా. కానీ ప్రస్తుతం కొంచం గుప్తేశ్వరలింగాన్ని దర్శించుకోవడానికి మార్గం ఏర్పడటంతో స్వామి దర్శనం ఎల్లప్పుడూ ఉంటుంది.

Gupteswar Temple Of Koraput

ఇక ఈ స్వామిని దర్శిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని ఒక నమ్మకం. ఇక్కడ గుహలో ఉండే శిలల నుండి అప్పుడప్పుడే చిన్న చిన్న నీటి చుక్కలు అనేవి పడుతుంటాయి. మనం వాటికింద చేయి చాచినప్పుడు సరిగ్గా అరచేతిలో నీటి బిందువులు పడితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఒక నమ్మకం.

Gupteswar Temple Of Koraput

ఇక్కడి గుహలో సీతాగుండం మనం దర్శనం చేసుకోవచ్చు. అరణ్యవాసంలో సీతాదేవి ఇక్కడే స్నానం ఆచరించిందని అందుకే ఈ నీటి కొలను ను సీతాగుండం అని అంటారని చెబుతారు. ఈ కొలను అతి ఎత్తైన కొండప్రదేశంలో ఉండగా ఇందులో నీరు ఎల్లప్పుడూ కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది.

Gupteswar Temple Of Koraput

ఇలా అద్భుతమైన ఈ గుప్తేశ్వర గుహ లోని శివలింగాన్ని దర్శించడం ఒక గొప్ప అనుభూతి అని చెబుతారు.

SHARE