Home Unknown facts శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు రుద్రాభిషేకం చేసిన ప్రదేశం

శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు రుద్రాభిషేకం చేసిన ప్రదేశం

0

ఇక్కడ తనని నమ్మిన భక్తులను విషసర్పాల బారినుండి కాపాడే దేవునిగా నాగేశ్వరుడు వెలిశాడని ప్రతీతి. అసలైన జ్యోతిర్లింగం ఇక్కడే ఉందని భక్తులు చెబుతుంటారు. మరి శివుడు కొలువై ఉన్న ఈ నాగేశ్వర్ జ్యోతిర్లింగం ఎక్కడ ఉంది? దీని సంబంధించిన పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Nageshwar Jyothirlingam

గుజరాత్ రాష్ట్రంలో, ద్వారకా నగరానికి గోమతి మధ్యలో ద్వారకకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం భక్తులకి దర్శనం ఇస్తుంది. అయితే శివుని ప్రసన్నం చేసుకోవడానికి కృష్ణుడు ఇక్కడ రుద్రాభిషేకం చేసేవాడని భక్తుల నమ్మకం.

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం దారుకావనం ప్రాంతంలో దారుకుడు, దారుక అనే రాక్షస దంపతులు ఉండేవారు. దారుక అమ్మవారిని ప్రార్ధించి, వరాలు పొందింది. ఆ వరప్రభావం చేత దారుకావనాన్ని తాను కోరుకున్న చోటుకి తీసుకువెళ్ల గలిగేది. అయితే ఆమె ఈ చర్య వల్ల ఆ వనంలో తపస్సులు, యజ్ఞయాగాదులు చేసుకుంటున్న మునులు బ్రాహ్మణులు బాగా ఇబ్బందిపడేవారు. ఆమె ఆగడాలు భరించలేని మునులు బ్రాహ్మణులు ఔర్వముని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు.

అప్పుడు ఆ ముని భూమిమీద బ్రాహ్మణులని బాధ పెట్టే వారు నాశనమవుతారని శాపమిచ్చాడు. ఆ శాపం నుండి తప్పించుకోవడం కోసం దారుకుడు తన నగరాన్ని సముద్రంలో నిర్మించుకున్నాడు. సముద్రంలో ఓడలమీద ప్రయాణించే వారిని దోచుకుంటుండేవాడు. తననే పూజించమని వారిని బలవంతం చేసేవాడు. ఆ క్రమంలో సుప్రియుడు అనే శివభక్తుణ్ణి కూడా పట్టి బంధించాడు. వారు ఉన్న కారాగారానికి నాగులను, రాక్షసులను కాపలాగా ఉంచాడు.

అయితే కారాగారంలో ఉన్నప్పటికీ, సుప్రియుడు శివపూజలు మానలేదు. అది సహించలేని దారుకుడు సుప్రియుని చంపబోయాడు. అప్పుడు సుప్రియుడు పూజిస్తున్న పార్థివ లింగం నుండి శివుడు ప్రత్యక్షమై అతనికి ఒక దివ్యాయుధాన్ని ప్రసాదించాడు. ఆ ఆయుధంతో దారుకుడిని, ఇతర రాక్షసులను సుప్రియుడు సంహరించాడు. సుప్రియుడు, ఇతర భక్తుల కోరికపై శివుడు అక్కడే నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిసాడు. పార్వతీదేవి నాగేశ్వరిగా వెలిసిందని స్థల పురాణం.

ఇక ఆలయ విషయానికి వస్తే, పురాతన కాలం నుండి ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తున్నా, చాళుక్యుల కాలంలో ఈ ఆలయం అభివృద్ధి చెందింది. అయితే ఔరంగజేబు కాలంలో ఈ ఆలయం విధ్వంసానికి గురైంది. ఆ తరువాత మళ్ళీ పునర్నిర్మాణం చెందింది. బౌద్ధుల వాస్తు శిల్పకళ ఈ ఆలయం నిర్మాణంలో కనిపిస్తుంది. దారుక వనానికి కామ్యకవనం, ద్వైతవనం అనే పేర్లు కూడా ఉన్నాయి. ముందుగా భక్తులు నాగేశ్వర పుష్కరిణిలో స్నానం చేసి, ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆలయం వెలుపల 85 అడుగుల ఎత్తైన శివుని విగ్రహం ఉంటుంది. శివుడు చతుర్భుజాలలో ఢమరుకం, త్రిశూలం, తులసిమాల, అభయహస్తంతో భక్తులను కరుణిస్తుంటాడు. ఆలయగోపురంపైన సూర్యచంద్ర కేతనం ఎగురుతూ, శివదర్శనానికి వచ్చే వారిని ఆహ్వానిస్తూ ఉంటుంది.

ఇంకా ఈ ఆలయంలో నంది తూర్పు ముఖంగా చూస్తుండగా, శివుడు దక్షిణముఖంగా ఉంటాడు. ఆలయంలోనే పార్వతీదేవి నాగేశ్వరిగా, గంగాదేవి గంగా మాతగా కొలువై ఉన్నారు. వారి దర్శనం సకల పుణ్యప్రదం.

ఈ ఆలయంలో భక్తులు జంట నాగులను సమర్పించుకుంటారు. అలా చేస్తే వారికి విషసర్పాల వలన హాని ఉండదని భక్తుల విశ్వాసం.

Exit mobile version