శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదొవ అవతారం శ్రీ కృష్ణావతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినపుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవడంతో శ్రీమహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడనీ పురాణాలు చెబుతున్నాయి. అయితే శ్రీకృష్ణుడు కొన్ని సందర్భాల్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. మరి శ్రీకృష్ణుడు ఎన్ని సార్లు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు? ఎప్పుడు ప్రదర్శించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీకృష్ణుడు తన బాల్యంలో ఒకసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇక విషయంలోకి వెళితే, శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఆడుతుండగా బలరాముడు వచ్చి శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని యశోదతో చెబుతాడు. అప్పుడు యశోద శ్రీకృష్ణుడిని మన్ను తిన్నావా అని కోపంగా అడుగగా నేను తినలేదు చెప్పి తన నోటిని తెరిచి యశోదకు చూపించగా అప్పుడు ఆ అమ్మకి కృష్ణుడి నోటిలో విశ్వం అంత కనిపిస్తుంది. ఇదియే శ్రీకృష్ణుడి మొట్ట మొదటి విశ్వరూప ప్రదర్శన.
శ్రీకృష్ణుడు పెరిగి పెద్దవాడైన తరువాత కౌరవులకు, పాండవులకు మధ్య పొందు కుదర్చడం కోసం రాయబారిగా ఒకసారి హస్తినా నగరానికి వెళ్లగా కృష్ణుడు చెప్పిన మాటలు ఏ మాత్రం ఎక్కని కౌరవులు ఆయన్ని బంధించాలని చూసినప్పుడు అది ముందే గ్రహించిన శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఇది శ్రీకృష్ణుడి యొక్క రెండవ విశ్వరూపం.
కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన రోజు అర్జునుడు నేను యుద్ధం చేయలేను అంటూ దుఃక్కించగా అప్పుడు శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసి అర్జునుడికి దివ్యదృష్టిని ప్రసాదించి విశ్వరూపం చూపుతాడు. గీతలో పదకొండవ అధ్యాయంలో ఈ విశ్వరూప వర్ణన ఎంతో అద్భుతంగా ఉంది.
కురుక్షేత్రం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకా నగరానికి వెళుతుండగా మధ్యలో ఉదంకముని ఆశ్రమం రాగ అక్కడికి వెళ్తాడు. ఆ ముని యుద్ధం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నీవు సమర్థుడవై కూడా యుద్ధం నివారించలేకపోయావు, ఈ పాపానికి ఫలితంగా నీకు శాపం ఇస్తానని ముని అనడంతో, అప్పుడు కృష్ణుడు తన సకల దేవతా స్వరూప విశిష్టతను వివరించి చెప్పగా, అప్పుడు ఉదంకుడు నేను నీ దయకు నేను అర్హుడను అయితే నాకు నీ విశ్వరూపాన్ని చూపమని ప్రార్ధించాడు. ఇక శ్రీకృష్ణుడు అతనికి తన విశ్వరూపాన్ని చూపుతాడు.
ఇవే కాకుండా దేవకీ పుత్రుడై కారాగారంలో పుట్టినప్పుడు కూడా తల్లితండ్రులకి తన యొక్క మహావిష్ణు స్వరూపం ప్రదర్శిస్తాడు. ఇంకా బ్రహ్మ – శ్రీకృష్ణుడు గోకులంలో పెరిగే సమయంలో లేగలను, గోపబాలురను గుహలో దాచి వేయగా అప్పుడు శ్రీకృష్ణుడు తానే లేగలుగా, గోప బాలురుగా రూపధారణ చేసి పరిమిత స్థాయిలో విశ్వరూపాన్ని చూపి బ్రహ్మకి గుణపాఠం నేర్పుతాడు. అంతేకాకుండా కంసుని ఆహ్వానం మేరకు అక్రూరునితో మధురా నగరానికి పోతు యమునానదిలో స్నానం చేస్తున్న అక్రూరునికి కూడా నదినీటిలో తన విశ్వ రూపాన్ని చూపుతాడు.
ఈవిధంగా ఆ శ్రీకృష్ణ భగవానుడు పలు పర్యాయాలు విశ్వరూపం చూపినట్లుగా భారత భాగవతాది గ్రంథాలు తెలుపుతున్నాయి.