Home Unknown facts దేశం మొత్తంలో గ్రహణం రోజు తెరిచి ఉంచే ఏకైక ఆలయం

దేశం మొత్తంలో గ్రహణం రోజు తెరిచి ఉంచే ఏకైక ఆలయం

0

మనం దైవంగా ప్రార్దించే సూర్యచంద్ర భగవానులను రాహుకేతువులు మింగడం అనేది లోకం అంతటికి మంచిది కాదని భావించి గ్రహణం ఉన్నంతసేపు ఆలయాన్ని మూసివేస్తారు. ఎందుకంటే ఆ సమయంలో పూజలు చేస్తే శక్తి క్షిణిస్తుందని భావించి ఆలయాన్ని మూసివేస్తారు. గ్రహణం పూర్తయినతరువాత ఆలయాన్ని శుభ్ర చేసి మళ్ళీ యధావిధిగా పూజలు నిర్వహిస్తారు. ఇది ఇలా ఉంటె ఈ ఒక్క దేవాలయంలో మాత్రం గ్రహణం రోజు కూడా ఆలయాన్ని తెరిచే ఉంచుతారు అంటా. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకు తెరిచే ఉంచుతారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Grahanamఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో శ్రీకాళహస్తి పట్టణం ఉంది. ఈ నగరం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఈ ఆలయాన్ని క్రీ.శ. 12 వ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు అనే రాజు కట్టించాడని చరిత్ర చెబుతుంది. స్థల పురాణం ప్రకారం పరమేశ్వరుడు ఇక్కడ స్వయంభువుగా అవతరించాడని చెబుతుంది. ఈ ఆలయం దేశంలోని అతి పెద్ద ఆలయాలలో ఒకటిగా చెబుతారు. ఆలయంలోపల అమ్మవారి సన్నిధి కి సమీపంలో ఒక ప్రదేశం నుండి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలు సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది.

శ్రీకాళహస్తిని దక్షిణ కాశి అని కూడా అంటారు. ఇది దక్షిణ భారతదేశంలోనే ప్రాచీనమైన మరియు పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవక్షేత్రం. ఇక్కడ రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనం. ఇంకా మరోదీపం ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది.

ఈ క్షేత్రంలోని శివలింగం ఇక్కడ వర్తులాకారంవలె గాక చతురస్రముగా ఉంటుంది. స్థలపురాణం ప్రకారం ఈ ప్రదేశం బ్రహ్మకి జ్ఙానమును ప్రసాదించిన ప్రదేశం అని చెబుతారు. ఈ పవిత్ర స్థలంలో పరమేశ్వరుడిని అత్యంత భక్తితో శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు ఈ మూడు ప్రాణులు పూజించి ముక్తి పొందినవి. అందువలనే ఈ స్థలమునకు శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినది.

ఇలా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలిగిపోయి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది.

అంతేగాకుండా ముక్కంటికి గ్రహణకాలంలోనే గ్రహణ కాలాభిషేకాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ కాళహస్తిలో ఒక్క శనీశ్వరుని తప్ప నవగ్రహాలను ప్రతిష్టించకూడదు. అందుకు బదులుగా ఈ క్షేత్రంలో రాహుకేతు గ్రహాలు నెలకొని ఉన్నాయి. రాహుకేతు దోషాలను నివారించే దివ్యశైవక్షేత్రం కాళహస్తి కాబట్టి, సూర్య, చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవని పండితులు చెప్తున్నారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడని వారంటున్నారు.

కాశీక్షేత్రం వలే ఇక్కడ చనిపోయే వారికీ పరమశివుడు ఓం కార మంత్రమును, తారకమంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకం. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోషనివృత్తి కోసం రాహు, కేతు పూజలు నిర్వహిస్తారు.

 

Exit mobile version