Home Unknown facts స్వయంభువుగా వెలసిన తలుపులమ్మ అమ్మవారి ఆలయ రహస్యం

స్వయంభువుగా వెలసిన తలుపులమ్మ అమ్మవారి ఆలయ రహస్యం

0

ఇక్కడ అమ్మవారు స్వయంభువుగా వెలిశారు. కొండ కోనల మధ్య ప్రకృతి అందాల నడుమ ఒక గుహలో ఈ అమ్మవారు వెలిశారు. మరి ఇక్కడ వెలసిన అమ్మవారు ఎవరు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1 Talupalamma Talliఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పుగోదావరి జిల్లా, తుని మండలం లోవ గ్రామంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. లోవ – ధారకొండలు మధ్యలో ఉన్న గుహలో 200 అడుగుల ఎత్తున తలుపులమ్మ అమ్మవారు ఆ ప్రాంతంలో వెలిశారు. ఈ తల్లి తన వద్దకు వచ్చే భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. భక్తుల తలుపులను నెరవేర్చు తల్లిగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు జగత్ ప్రసిద్ధి చెందారు.

ఇక ఆలయ స్థలపురాణానికి వస్తే, కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్ధించగా, కొండపైన పాతాళ గంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండ గుహలో కొలువుదీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండపై నుండి నిరంతరాయంగా పాతాళగంగ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఈ కొండ ధారకొండ గా ప్రసిద్ధి చెందింది. దీనికి ఆనుకొని ఉన్నదే తీగకొండ. ఇది దట్టంగా తీగలు అలుముకొని ఉన్న చెట్లతో నిండుగా ఉంటుంది. ఈ రెండు కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో విరాజిల్లే చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి. ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభువుగా వెలసినదని స్థానికులు చెప్తారు. ఈ ఆలయాన్ని ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శిస్తూ ఉంటారు.

Exit mobile version