ఉదయగిరి కోట గురించి ఆసక్తికర రహస్యాలు

కోటలు చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ కోటలను పరిశీలంచడం వల్ల ఆయా కాలంనాటి రాజుల నుంచి సాధారణ ప్రజల జీవన విధానాలు వరకు మనకు అవగతమవుతాయి. అందుకోసమే వేల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కోటల పై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి కోటలు మన తెలుగు రాష్ట్రాల్లో లో కూడా ఎన్నో ఉన్నాయి. అందులో ఇటీవలే వార్తల్లో వినిపించే కోట ఉదయగిరి కోట.

Udayagiri kotaఉదయగిరి కోట నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉంది. ఉదయగిరి కోటది దాదాపు వెయ్యేళ్ల చరిత్ర. పల్లవుల నుంచి విజయనగర రాజుల వరకూ ఈ కోటను పరిపాలించారు. ముస్లీం పాలకుల్లో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఈ కోటను పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఇప్పటికీ ఈ కోటలో ఉంది. అటు పై ఈ కోట ఆంగ్లేయుల వశమైంది. ఆ సమయంలో డైకన్ దొర కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ కోటలోని రాజ్ మహల్ లో అద్దాలమేడతో పాటు ఇంకా అనేక భవనాలను నిర్మించాడు. నెల్లూరు పట్టణానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోట వీకెండ్ లో పర్యాటకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

Udayagiri kotaచరిత్రలో ఉదయగిరి పట్టణం యొక్క తొలి ప్రస్తావన 14వ శతాబ్దంలో కనిపిస్తుంది. ఒడిషా గజపతుల సేనాని అయిన లాంగుల గజపతి ఉదయగిరిని రాజధానిగా చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలను పరిపాలించాడు. 1512లో ఉదయగిరి కృష్ణదేవరాయల పాలనలోకి వచ్చింది. కోట చాలా దిశలనుండి శత్రు దుర్భేద్యమైనది. దీన్నీ తూర్పు వైపున ఉన్న అడవి బాట ద్వారా లేదా పశ్చిమం వైపున ఉన్న కాలిబాట ద్వారానే ముట్టడించే అవకాశమున్నది. సంవత్సరకాలం పాటు జరిగిన కోట దిగ్భంధనం ఫలితంగా ప్రతాపరుద్ర గజపతి ఉదయగిరి కోటను కోల్పోయాడు.

Udayagiri kotaగజపతుల పాలనలోనూ ఆ తర్వాత విజయనగర పాలనలోనూ కోటను విస్తరించారు. మొత్తం పట్టణాన్ని మరియు దానిని ఆనుకుని ఉన్న వెయ్యి అడుగుల ఎత్తున్న కొండ చుట్టూ పటిష్ఠమైన గోడకట్టించారు. కోటలో మొత్తం నిర్మాణాలలో 8 కొండపైన, 5 దిగువన ఉన్నాయి. కోటలో అనేక ఆలయాలు, తోటలు కూడా ఉండేవి.

Udayagiri kotaఈ రాజ్యమెప్పుడు భోగభాగ్యములతో తులతూగుతూ ఉండేది. పండితులు, కవులు, గాయకులు పలువురు ఈరాజ్యానికి వన్నె తెచ్చారు. ఇప్పుడు పూర్వవైభవమంతాపోయింది. పూర్వవైభవాన్ని స్మరింపజేసే ఉదయగిరికొండ, ఉదయగిరిదుర్గము మాత్రమే ఉన్నాయి. కలివి కర్రతో చక్కని ఈకడి శిల్పులు తయారుచేస్తున్నారు. ఇప్పటికీ చేతికర్రలు, పాంకోళ్ళు, కవ్వాలు, గరిటెలు-అన్నీ కర్రవే తయారు చేస్తున్నారు.

Udayagiri kotaవిజయనగర సామ్రాజ్యము స్థాపించినప్పటినుంచీ అనగా 14వశతాబ్దము మొదటిభాగంనుంచీ ఉదయగిరి రాజప్రతినిధి ఉండే స్థలముగా ఏర్పాటైనది. ఉదయగిరి రాజ్యములో నేటి నెల్లూరు కడప జిల్లాలు ఉన్నాయి. ఉదయగిరి రాజ్యానికి ములికనాడు అని పేరు. అనాటి కవులూ, వారు వ్రాసిన కావ్యాలూ చాలా ఉన్నాయి. సమిరకుమారవిజయము రచించిన పుష్పగిరి తిమ్మన్న ఆత్మకూరు తాలూకావాడు అని తెలుస్తుంది. విక్రమార్క చరిత్రము వ్రాసిన వెన్నలకంటిసిద్ధనకు జక్కన కవి అని బిరుదు ఇచ్చెను. ఈ సిద్ధనమంత్రి ఉదయగిరి రాజ్యములో మత్రిగా ఉండేవాడు.

ఉదయగిరి రాజ్యము సంగీతవిద్యలో కూడా పేరు తెచ్చుకుంది. అచ్యుతరాయ,రామరాయల కాలములలో ఉదయగిరి రాజ్యముకు రాజప్రతినిధగా రామామాత్యుడు ఉన్నాడు. ఇతడు సర్వమేళకళానిధి అనే ప్రసిద్ధ సంగీత గ్రంథమును రచించాడు. దాన్ని రామరాయలకు అంకితం చేసాడు. ఇతనికి “వాగ్గేయకార తోడరుమల్లు” అను బిరుదు ఉంది. అక్బరు కాలమున ఆర్థికమంత్రిగా పని చేసిన తోడరుమల్లు చూపిన ప్రతిభవంటి ప్రతిభను ఇతడు మంత్రిగా ఉండి చూపుటచేత, సర్వకళానిధి రచించుటవల్ల ఈబిరుదు ఇతనికి ఇచ్చారంట.

Udayagiri kotaఉదయగిరి గ్రామానికి కొండాయపాలెం అని పేరుకూడ ఉంది. ఉదయగిరి కొండమీద ఒక ఆలయం ఉంది. దానికి వల్లభరాయ దేవాలయమని పేరు. వల్లభరాయడను మంత్రి దానిని నిర్మించటం వలన ఆ పేరు వచ్చిందని చెబుతుంటారు. దేవాలయము పక్కన చక్కని కోనేరు ఉంది. ఈ వల్లభరాయుడు శ్రీకృష్ణ దేవరాయల వారి ప్రతినిధి. ఆ వల్లభరాయడు ఉదయగిరిసీమలోని మోపూరు గ్రామంలో వెలసిన భైరవస్వామి భక్తుడని శ్రీవేటూరి ప్రభాకరశాస్త్రి గారు వ్రాసారు. ఇటువంటి గొప్ప చరిత్ర ఉన్న ఉదయగిరి కోటలో నిధి నిక్షేపాలున్నాయని కొన్ని ముఠాలు తవ్వకాలు జరిపి చరిత్రకు అద్దం పట్టె చారిత్రక కట్టడాలు కూల్చేస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR