Home Unknown facts 20 అడుగుల ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి దర్శనమిచ్చే ఆలయం

20 అడుగుల ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి దర్శనమిచ్చే ఆలయం

0

ఉండవల్లి అంటే తెలుగువారందరికీ వెంటనే గుర్తొచ్చేవి అక్కడున్న గుహాలయాలు. అద్భుత రాతి శిల్ప కళలు. ఉండవల్లి గుహాలయం ఒక పర్వత సముదాయం. పర్వత ముందు భాగమునుండి లోపలికి వెళుతుంటే మధ్యలో స్థంబాలు.. వాటిపై చెక్కిన అందమైన శిల్పాలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఇవి క్రీ.శ. 4, 5 వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు భావిస్తున్నారు.

Undavalli Cavesఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. పర్వత గుహలలో పెద్దదైన రెండో గుహాలయంలో అనంతపద్మనాభస్వామి వారి ప్రతిమ కనిపిస్తుంది. ఇది దాదాపు 20 అడుగులపైనే ఏకరాతితో చెక్కబడింది. ప్రతిమ పొడవుగా శేషపానుపుతో కూడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ దర్శనమిస్తాయి. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి.

ఇతర ఆలయాలు త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవతలకు ఉద్దేశించినవి. ఇవి గుప్తుల కాలంనాటి నిర్మాణ శైలికి చెందినవిగా చరిత్రకారులు చెబుతున్నారు. ఈ నాలుగు అంతస్తుల గుహల్లో.. మొదటి అంతస్తులో ఋషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది. ఇందులో ఎలాంటి విగ్రహాలు లేవు.

ఈ గుహల నిర్మాణ శైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూరా పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి ఉంది.

ఉండవల్లి గుహాలయాలకు గుంటూరు, విజయవాడ నగరాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గుంటూరుకు 30 కిలోమీటర్లు, విజయవాడకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

Exit mobile version