ఇక్కడి ఆలయంలో రెండు విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని అమ్మవారి విగ్రహానికి శిరస్సు శివలింగాకారం ఉంటె అక్షరాలకు ఆలయాన్ని కట్టి పూజిస్తున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ ఉన్న మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలో పెదపులిపాక గ్రామంలో శ్రీ విజయరాజరాజేశ్వరి ఆలయం ఉంది. పరమహంస పరివ్రాజకులు వాసుదేవానందగిరి స్వామివారి కృషితో పూర్తిగా దక్షిణాది శైలిలో నిర్మితమైన ఈ దేవాలయం భారతదేశంలోనే విలక్షణమైనది. అమరలింగేశ్వరుడికి, బెజవాడ కనకదుర్గకు మధ్యన కృష్ణానదీ తీరంలోని పెద్దపులిపాక గ్రామంలో కొలువు తీరి ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చే విజయగణపతి, సకల జీవులకు జ్ఞానాన్ని ప్రసాదించే విజయ సరస్వతీదేవి, ఐశ్వర్యాలను సమకూర్చే విజయలక్ష్మి, సకల కార్యసిద్ధిని ప్రసాదించే విజయ ఆంజనేయస్వామి మూర్తులను దర్శించుకోవడం పుణ్యదాయకం.
దేవాలయ నలుదిక్కులా నాలుగు వేదాలకు ప్రతీకగా ఎత్తయిన రాజగోపుర ద్వారాలు స్వాగతం పలుకుతాయి. ఆలయానికి వాయవ్యంగా గోశాల, ప్రాకార మండపంలో శాలాహారంలో అ నుండి క్ష వరకు గల అక్షర దేవతలు, లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాలలో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు, దశావతారాలు దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలు తంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఇక్కడి దేవి పేరు శ్రీవిజయరాజరాజేశ్వరి. అమ్మవారి శిరస్సు మీద లింగాకారం ఉంటుంది. పరమశివుడు గంగను తన శిరస్సు మీద ధరిస్తే, అమ్మవారు సాక్షాత్తు అయ్యవారిని తన శిరస్సున ధరించి కనువిందు చేస్తుంది. తల మీద ఉన్న అయ్యవారి కోసం సోమవారం, అమ్మవారి కోసం శుక్రవారం అభిషేకాలు జరిపిస్తారు.
ప్రాకార మండపంలో శాలాహారంలో అ నుండి క్ష వరకు గల అక్షర దేవతలు అక్షరభిక్ష పెడతాయి. ఎక్కడా లేని విధంగా అక్షర దేవతల్ని ఇక్కడ విగ్రహరూపంలో వాయుప్రతిష్ఠ చేశారు. ఆలయ లోపలి భాగంలో అష్టాదశ శక్తిపీఠాలలో గల దేవతా విగ్రహాలు, నవదుర్గలు, దశమహావిద్యలలో అమ్మవార్లు, దశావతారాలు పురాణజ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఈ విగ్రహాలు తంజావూరు శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ముఖ్యంగా నీలి సరస్వతి, చిన్నమస్తాదేవి వంటి విలక్షణ దేవతల రూపాలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆలయానికి వాయవ్యంగా గోశాలలో గోమాతలు పవిత్రతతో మూర్తీభవిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఎప్పుడు విజయం మన వైపే ఉంటుందని భక్తుల విశ్వాసం.