Home Unknown facts ఊర్మిళ దేవి చేసిన త్యాగం ఏంటో తెలుసా ?

ఊర్మిళ దేవి చేసిన త్యాగం ఏంటో తెలుసా ?

0

రాముడి భార్య సీతమ్మ గురించి అందరికీ తెలుసు. ఆమె పడ్డ కష్టాలు ఆమె జీవితం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే రాముడు తమ్ముడు లక్ష్మణుడు భార్య అయిన ఊర్మిళ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఊర్మిళ స్వయానా సీతమ్మ తల్లి చిన్నాన కుమార్తె.సీతమ్మ రాముడి కోసం ఎలా త్యాగాలు చేసిందో ఊర్మిళ కూడా లక్ష్మణుడి కోసం అలాగే త్యాగాలు చేసింది. సీతమ్మవారు రాముడి వెంట వనవాసం వెళ్లారు. వారి వెంట లక్ష్మణుడు కూడా వెళ్లాడు. తాను కూడా వస్తానని భర్తను అడిగింది ఊర్మిళ. నువ్వేమీ మాతో పాటు రావొద్దు అక్కడి కష్టాలు నువ్వు తట్టుకోలేవు అంటాడు ఊర్మిళతో లక్ష్మణుడు.

ఊర్మిళ దేవిఅడవికి వెళ్లిన తరువాత అరణ్యంలో సీతారాములకు రక్షణగా ఉన్న లక్ష్మణుడికి నిద్ర వస్తుండడంతో తన బాధ్యతకు ఎలాంటి ఆటంకం కలగకుండా, తనకు 14 సంవత్సరాల పాటు నిద్ర రాకుండా విడిచిపెట్టమని ఆ నిద్ర దేవతను వేడుకుంటాడు.అయితే నిద్ర ప్రకృతి ధర్మమని తనకు రావాల్సిన నిద్ర మరెవరికైనా పంచాలని కోరడంతో,తన 14 సంవత్సరాల పాటు నిద్రను తన భార్య ఊర్మిళాదేవికి ప్రసాదించమని లక్ష్మణుడు నిద్రాదేవతను కోరుతాడు.

తండ్రి చనిపోయిన విషయం చెప్పి రాముణ్ణి ఒప్పించి తిరిగి అయోధ్యకు తీసుకెలదామని భరతుడు తన ముగ్గురు తల్లులు మరియు పరివారంతో సహా వస్తాడు. మాటలలో మాటగా ఎవరో త్యాగం అనే మాటను అన్నారు. లక్ష్మణుడికి త్యాగం పేరు చెప్పగానే ఊర్మిళ గుర్తొచ్చింది. తన మాటని జవదాటకుండా అంతఃపురానికే అంకితమయ్యింది. ఒకరకంగా ఊర్మిళని వదిలి రావడం భర్తగా తను చేసింది తప్పే కాని అన్నగారి మీద ప్రేమ, భక్తి ఈనాటివి కాదు. అభిమానాలు, ప్రేమలు న్యాయ ధర్మాల తర్కానికి అందవు. తను అన్నగారిననుసరించి త్యాగం చేసాననుకుంటున్నారు వీళ్ళందరూ !

తన త్యాగం వెనుక మరొక మూర్తి త్యాగం కూడా వుంది. ఊర్మిళే కనక తనని అడవులకు వెళ్ళ వద్దని నిర్భందిస్తే ? ఒకరకంగా తనకు పరీక్షే తను వద్దనగానే మరోమాట మాట్లాడకుండా మౌనంగా అంగీకరించింది. ఒకసారి ఊర్మిళ మీద ప్రేమ అభిమానం పొంగుకొచ్చాయి లక్ష్మణుడికి. రాజ పరివారమంతా బయల్దేరివచ్చినా ఊర్మిళ మాత్రం రాలేదు ఎందుకు రాలేదు ? భర్తని చూడాలని అనిపించలేదా ? ఏదో కారణం ఉండే ఉంటుంది.

తల్లి సుమిత్ర నడిగితే తెలుస్తుంది. లక్ష్మణుడు గుడారం లోపలకి ప్రవేశించగానే చెలికత్తెలు పక్కకు తప్పుకున్నారు. తల్లి సుమిత్రకి, పెదతల్లి కౌసల్యకి ప్రణామాలు చేసి, ఈ అడవిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారేమో చూసి రమ్మని అన్నగారి ఆజ్ఞ అని విన్నవించాడు. కొంతసేపు కుశల ప్రశ్నల అనంతరం సుమిత్రని అడిగాడు లక్ష్మణుడు.

”తల్లీ – అయోధ్యలో అందరూ కుశలమేనా ? ఊర్మిళ ఎలా వుంది ? మీరందరూ అడవికి ఆయత్తమవుతుంటే తనూ వస్తానని అనలేదా ? మీతో పాటు ఊర్మిళ ఎందుకు రాలేదు ? ”

” నాయనా లక్ష్మణా – మేమందరమూ భరతునితో బయల్దేరుతున్నామన్న విషయం స్వయంగా నేనే వెళ్ళి చెప్పాను. తనని కూడా రమ్మనమని చెప్పాను…కానీ.. ” మధ్యలో ఆగిపోయింది సుమిత్ర.

కానీ…

“తనే రానని నిష్కర్షగా చెప్పింది. ఎంత బ్రతిమాలినా రానంది. ”

“అదేమిటమ్మా – నువ్వు బ్రతిమాలినా రానని అందా ఊర్మిళ – పోనీ ఎందుకు రానందో కారణమైనా విన్నవించిందా నాకు….”

“కారణం…” తటపటాయిస్తూ ఆగిపోయింది సుమిత్ర.

“సందేహం వద్దు – చెప్పమ్మా ! నేనేమి కోపగించుకోను…”

నీకు ప్రతిబంధకం కాకూడదని…” సుమిత్ర మధ్యలో ఆగిపోయింది. ఒక్కసారి లక్ష్మణుడికి మనుసుని ఛెళ్ళుమని కొట్టినట్లనిపించింది. బయల్దేరేముందు తనకి, ఊర్మిళకి జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. ఇంకేమీ మారు మాట్లాడకుండా మౌనంగా లక్ష్మణుడు బయటకు వచ్చేశాడు. ఊర్మిళ అభిమానవతి. అంతేకాదు భర్త కర్తవ్యపాలనకోసం అంతఃపురానికే అంకితమయ్యిన మహాసాధ్వి. బాధలు, సంతోషాలు పంచుకోవడానికి వదిన గారు సీతకి, అన్నగారు రాముడున్నారు.

మరి ఊర్మిళకెవరున్నారు? పక్కన ఉండాల్సిన తను…. లక్ష్మణుడు వడి వడిగా అడుగులువేసుకుంటూ తమ కుటీరం వైపు వెళ్ళాడు. వెన్నెల రాత్రిలో కుటీరం ముందు వదినగారు పుష్ప రేకలతో వేసిన ముగ్గు చూసాడు. గబుక్కున త్రొక్కబోయి పక్కకు జరిగాడు. పసిడి వెన్నెల్లో గీతల్లా వేసిన ముగ్గులో ఆ పుష్పాలు మరింతగా మెరుస్తున్నాయి. ఆ పుష్పాల్లో ఊర్మిళే కనిపించింది లక్ష్మణుడికి. కనిపించే పెద్ద గీత – సీత దాని వెనుక మరుగైన చిన్నగీత – ఊర్మిళ.

 

Exit mobile version