అంటరానితనం నిర్ములించే ఆరాధ్య దేవతగా పూజలు అందుకుంటున్న వెంగమాంబ చరిత్ర

0
1839

పతి భక్తికి ప్రతిరూపంగా వెలసిన తల్లి వెంగమాంబ. శ్రీ రేణుకాదేవి అనుగ్రహంతో ఈమె జన్మించినట్లుగా చెబుతారు. దేవతగా అవతరించిన ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, అంటరానితనం నిర్ములించే ఆరాధ్య దేవతగా పూజలను అందుకుంటుంది. మరి వెంగమాంబ దేవతగా ఎలా అవతరించింది? ఈ దేవత వెలసిన ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Goddess Vengamamba

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో, నర్రవాడ అనే గ్రామంలో శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయం ఉంది. ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా విరాజిల్లుతుంది. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ ఆలయం వెలసినట్లుగా చెబుతారు. సంతానం లేని వారు ఈ అమ్మవారి ఉత్సవం లో అమ్మావారి ముందు వరపడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

Goddess Vengamamba

ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం నర్రవాడ అనే గ్రామానికి దగ్గరలో వడ్డిపాలెం అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ పచ్చవ వెంగమనాయుడు సాయమ్మ అనే దంపతులు ఉండేవారు. ఈ దంపతులకు పూర్వ జన్మ పుణ్యఫలం కారణంగా శ్రీ రేణుకాదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల జన్మించింది. ఇలా రేణుకాదేవి అనుగ్రహంతో జన్మించిన ఈ బాలికకు వెంగమాంబ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచారు. వెంగమాంబకి చిన్నతనం నుండే దైవం అంటే ఇష్టం ఏర్పడి తన తోటి స్నేహితులకు ఆధ్యాత్మికతను బోధిస్తూ ఉండేది. ఇలా ఆమెకి యుక్తవయసు రాగానే వేమూరు గురువయ్యతో వివాహం జరిగింది.

Goddess Vengamamba

ఈవిధంగా గురువయ్యతో వివాహం అయినా వెంగమాంబ అత్తగారి ఇంట్లో అందరి బాగోగులు చూసుకుంటూ ఆదర్శ గృహిణిగా జీవనం సాగిస్తుండేది. ఇలా కొంతకాలం తరువాత ఈ గ్రామంలో వర్షాలు పడక ప్రజలు తీవ్ర నీటి కొరతతో బాధపడుతుండేవారు. ఇక నీరు లేని చుట్టుప్రక్కల గ్రామం వారు కూడా నర్రవాడ అయినా ఈ గ్రామంలో ఉన్న ఒక బావి దగ్గరికి నీటి కోసం వస్తుండేవారు. ఇక ఆ కాలంలో దళితులను అంతరానివారిగా చూసి ఎవరు కూడా దగ్గరికి రానిచ్చేవారు కాదు. అయితే ఆ దళితులకు నేరుగా వెళ్లి బావి నీటిని తాగడానికి అనుమతి లేకపోవడంతో దారిన వెళ్లే వారు ఎవరో ఒకరు నీరు పోస్తారనే ఆశతో వారు అక్కడే ఎదురుచూస్తూ ఉన్నారు.

Goddess Vengamamba

ఇలా ఒక రోజు వెంగమాంబ కూడా నీటి కోసం బావి దగ్గరకి వచ్చి అక్కడ నీటికి కోసం ఎదురుచూస్తున్న ఆ దళితులను చూసి జాలిపడి, ఈ కరువు నుండి తమ అందరిని కాపాడంటూ దైవాన్ని ప్రార్ధించగా అప్పుడు ఆ గ్రామంలో కొండపోతగా వర్షం కురిసింది. అప్పుడు అందరు కూడా ఎంతో సంతోషపడి వెంగమాంబకు ఒక పసుపచ్చని చీరని కానుకగా ఇచ్చారు. ఇది ఇలా ఉంటె, ఒక రోజు గురువయ్య పశువులను తోలుకొని అడవులకి వెళ్లగా, వెంగమాంబ కూడా తన స్నేహితులతో కలసి అడవిలోకి రాగ అక్కడ కొందరు దొంగలు వారి పైన దాడిచేయగా వారు కేకలు వేయడంతో గురువయ్య అక్కడికి వచ్చి దొంగలపైనా ఎదురుదాడి చేస్తుండగా ఒక దొంగ వెనుక నుండి వచ్చి గురువయ్యని ఈటె తో పొడిచి పారిపోయారు.

Goddess Vengamamba

ఇలా తీవ్ర గాయంతో పడిపోయిన గురువయ్య సృహ ని కోల్పోయాడు. అతడికి ఎన్ని విధాలా వైద్యం చేసినప్పటికీ సృహ లోకి రాలేదు. ఇలా మూడు రోజులు గడిచిన తరువాత ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. తన భర్త బతికే అవకాశం లేదు కనుక అతడి కంటే నేనే ముందు సుమంగళిగా మరణించాలని భావించి ఇంట్లో వారి అనుమతి తీసుకోగా, ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటుచేసుకుని తన బంధువులు, స్నేహితురాళ్ళు అందరు కూడా దుఃఖిస్తుండగా, నేను అగ్నికి ఆహుతి అయినతరువాత ఇక్కడే దేవతగా వెలుస్తాను అని చెప్పగా, ఈ విషయం తెలిసిన అంధుడైన తన బావ పరుగున వచ్చి ఆమెని పట్టుకోవాలని ప్రయత్నించగా ఆమె చీరచెంగు చేతికి దొరికింది. అప్పుడు వెంగమాంబ నీవు కూడా మరణాంతరం ఇక్కడ దేవతల పూజలను అందుకుంటావని చెప్పి, దళితులు ఇచ్చిన పసుపుచీరను కట్టుకొని, త్రిశూలాన్ని ధరించి, అగ్నిగుండం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణాలు చేసి అగ్నిప్రవేశం చేస్తుంది. ఇలా వెంగమాంబ అగ్ని ప్రవేశం చేసిన కొద్దిసేపటికే ఆమె భర్త గురువయ్య మరణించగా, అతడిని కూడా ఆ అగ్నిగుండంలోనే దహనం చేసారు.

Goddess Vengamamba

ఇలా అగ్నికి ఆహుతైన వెంగమాంబ ఆ రోజు రాత్రి అంధుడైన అతడికి కలలో కనిపించి తాను ఆహుతైన అగ్నిగుండాన్ని ఒకసారి వెతకమని చెప్పింది. ఆ మరుసటి రోజు అతడు గ్రామస్థుల సహాయంతో వెళ్లి చూడగా, ఆ అగ్నిగుండంలో మంగళ సూత్రం, అంధుడు పట్టుకున్న చీరకొంగు కాలిపోకుండా ఉండటం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆలా ఆమెమీద భక్తితో అక్కడే ఒక ఆలయాన్ని ఆమెకు నిర్మించారు.

Goddess Vengamamba

ఈవిధంగా వెలసిన ఇక్కడి వెంగమాంబ ఆలయంలో ప్రతి సంవత్సరం జేష్ఠ మాసంలో పౌర్ణమి తరువాత ఆదివారం నుండి గురువారం వరకు శ్రీ వెంగమాంబ పేరంటాలు పేరిట ఉత్సవాలు జరుగుతాయి. మొదటగా ఆదివారం రోజున అమ్మవారి పుట్టినిల్లు అయినా వడ్డిపాలెం లో ఉత్సవం మొదలుకాగా, సోమవారం రోజున పుట్టినిల్లు నుండి అమ్మవారి రథోత్సవం బయలుదేరుతుంది, మంగళవారం నాడు ప్రత్యేక వాహనంపైన గ్రామవీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉండగా ఆ సమయంలో భక్తులు అమ్మవారికి కానుకలను సమర్పిస్తారు. బుధవారం నాడు కల్యాణోత్సవం జరుగుతుంది, గురువారం నాడు బండ్ల పొంగళ్ళు, ఎడ్ల బండి లాగుడు పందాలు జరుగుతాయి. ఇలా ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు కొన్ని లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు.

SHARE