భక్తుడు నాటిన మర్రిచెట్టులో వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం గురించి తెలుసా ?

0
2927

తిరుమల నుండి వచ్చిన ఆ శ్రీనివాసుడు ఇక్కడ ఉన్న మర్రిచెట్టు పైన వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. మరి ఆ వేంకటేశ్వరస్వామి మర్రి చెట్టుపైన ఎందుకు వెలిసాడు? ఈ మర్రి చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడి స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord SriVenkateswara

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి కి కొంత దూరంలో ఉన్న మల్లాది గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామివారు మర్రిచెట్టులో వెలిశాడని ఎంతో మహిమగల వాడని చెబుతారు.

Lord SriVenkateswara

ఇక స్థల పురాణానికి వస్తే, కృష్ణాజిల్లాలో గల జగ్గయ్యపేటకు సమీపంలో గల తిరుమల గిరిలో భరద్వాజుల కోరిక మేరకు పుట్టరూపంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారు వెలిశారు. అయితే మల్లాది గ్రామస్థులు స్వామివారిని దర్శించుకోవడానికి కృష్ణానదిని దాటుతూ కష్టాలు పడుతుండేవారు. మల్లాది గ్రామానికి దక్షిణ భాగంలో పూర్వం ఒక భక్తుడు మర్రి చెట్టు నాటాడు. ఈ మర్రిచెట్టు 1977 వ సంవత్సరంలో వచ్చిన తుఫాను కు నిలువునా కూలిపోయింది. అధికారులు ఆ చెట్టుకి పాటపెట్టి విక్రయించారు. ఆ చెట్టుని కోసేందుకు వాటాదారుడు గొడ్డలితో, రంపాలతో సిద్దమయ్యాడు. కానీ గొడ్డలికి, రంపాలకి అది లొంగలేదు.

Lord SriVenkateswara

ఆ తరువాత 1978 వ సంవత్సరం జనవరి 22 వ తేదీన ఒక గ్రామస్థుడు వచ్చి ఆ విరిగిన కొమ్మమీద కూర్చున్నాడు. అతనికి దూరంలో వరిచేలో ఏదో తెల్లగా పొడవాటి చీర ఎగురుతున్నట్లు ఒక గొర్రెల గుంపు చేను మేనుస్తునట్లు గా కనిపిస్తే అటువైపుగా పరిగెత్తాడు. ఆ తెల్లటి ఆకారం అతడిని ముందు ముందుకు తీసుకుపోయింది. కొంతదూరం వెళ్లిన తరువాత అతడికి ఆ ఆకారం కనిపించలేదు.

Lord SriVenkateswara

అప్పుడు అలా ఎందుకు జరిగిందో అని ఆశ్చర్యంతో తిరిగి చెట్టు దగ్గరికి రాసాగాడు. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. విరిగిపడిపోయిన చెట్టు తిరిగి నెమ్మదిగా లేవటం మొదలయింది. ఆ చెట్టు తిరిగి పూర్వ స్థానంలో నిలబడే వరకు అతను నడుస్తూనే ఉన్నాడు. అతడు చుసిన విచిత్రాన్ని ఊరందరికీ చెప్పాడు. అప్పుడు అందరు ఆశ్చర్యపోయారు.

Lord SriVenkateswara

ఆ సమయంలో మరొక విచిత్రం జరిగింది, అదే ఊరిలో కొంతమంది పిల్లలకి, గణాచారులకు ఒంటిమీద శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వచ్చి, నేను శ్రీనివాసుడను తిరుమల కొండ నుండి ఈ చెట్టు యందు ఉండుటకు వచ్చియున్నాను. నేనే ఈ చెట్టుని పడేసాను, నేనే తిరిగి యధాస్థానంలో ఉంచాను అని స్వామివారు చెప్పారట. అప్పుడు గ్రామస్తులంతా కూడా ఆ చెట్టుని దర్శించుకున్నారు.

ఇక అప్పటినుండి ప్రతి సంవత్సరం జనవరి 22 వ తేదీన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మహోత్సవం, తిరునాళ్ల జరుపుచున్నారు. ఈ ఆలయంలో నిత్యం జరిగే పూజలతో పాటు, పండుగ పర్వదినాలలో విశేష పూజలు, ఉత్సవాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి.