వ్యాసుడు వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వాడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు. నేటి ఆధ్యాత్మిక గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ వ్యాసుని ఎంగిలే అంటే ఆయన రాసినవే అని అర్థం. వ్యాస భగవానుడని, బాదరాయణుడని ప్రసిద్ధి చెందిన వ్యాస మహర్షి జన్మదినం ఆషాఢ శుద్ధ పౌర్ణమి.
దాశరాజు కుమార్తె, మత్స్య కన్య సత్యవతి. సౌందర్య రాశి అయిన ఆమె దగ్గర భరించరాని చేపల వాసన వల్ల ఎవరూ ఇష్టపడేవారు కాదు. దీంతో తీవ్ర వేదనకు గురైన ఆమె అరణ్యంలో సంచరిస్తూ ఒక రోజు పరాశుర మహర్షి ఆశ్రమానికి చేరుకుంది. ఆమె అందాన్ని చూసి మోహపరవశుడైన పరాశురుడు తన కోరిక తీర్చమన్నాడు. అయితే తాపసులకు ఇది తగదని సత్యవతి వారించినా నిగ్రహించుకోలేపోయాడు. అంతేకాదు శరీరం అతిలోక పరిమళభరితమయ్యేలా, కన్యత్వాన్ని కూడా చెడిపోకుండా వరం ప్రసాదించాడు. అలా వారి సంగమ ఫలితంగా సత్యవతి గర్భంలో జన్మించిన వాడే కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వ్యాసుడు. పన్నెండేళ్ల పాటు ఆమె దగ్గర పెరిగిన వేద వ్యాసుడు తపస్సు చేసుకోడానికి బయలుదేరాడు. వెళ్లే ముందు కృష్ణజినదండ, కమండలం ధరించి “అమ్మా నా అవసరం వచ్చినప్పుడు నన్ను తలచుకుంటే తప్పకుండా ఆక్షణమే నీ దగ్గరకు వచ్చి పని పూర్తి చేస్తానని తెలిపాడు. లోక కల్యాణం కోసం తపోవనంలో ఘోర తపస్సు చేసి బ్రహ్మ నుంచి వరాలు పొందాడు.
అష్టాదశ పురాణాలను, బ్రహ్మ సూత్రాలను రాసి భారతీయ సాహిత్యంలో హిమాలయాలంత ఎత్తుకు ఎదిగాడు .వేదాలను విభజన చేసి అందుబాటులోకి తెచ్చిన మహోన్నతుడు. యమునా నదీ తీరంలో జన్మించిన వ్యాసుడు మహాభారతం లాంటి అద్భుత కావ్యాన్ని అందించాడు. అందులో ముఖ్య పాత్ర దారి విష్ణుమూర్తి అవతారమే వ్యాసభగవానుడు. సత్యవతి కుమారుడు సేతి, మాది నదుల సంగమ స్థానంలో జన్మించాడని కూడా అంటారు .ఈ ప్రదేశానికి ఆయన పేరే పెట్టారు. ప్రస్తుతం నేపాల్‌లో తనాహు జిల్లాలోని తనౌళి పట్నంలో వ్యాసుడు జన్మించాడని కొందరు అంటారు.
సత్యవతీ శంతనుల వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చేత తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.
భారత రచనకు తన సహాయకారుడిగా గణపతిని పెట్టుకొన్నాడు. తన ఘంటానికి ఆపకుండా పని చెబితినే రాస్తానని షరతుపెట్టి రాశాడు గణపతి. భారతానికి జయ కావ్యమనే పేరుంది. ఇందులో విష్ణు సహస్రనామం, భగవద్గీత కూడా ఉన్నాయి. వ్యాసుడు చివరి రచనే మహా భారతం. భారతాన్ని ఉగ్ర సేన సౌతి మౌఖికంగా వ్యాపింప జేశాడు. నైమిశారణ్యం లో శౌనికాది మహర్షుల సమక్షంలో దీన్ని వినిపించాడు. బౌద్ధ వాఙ్ఞయంలోనూ వ్యాసుడి ప్రస్తావన ఉంది. పాళీ భాషలో దీన్ని‘కన్హ దిపాయన’అన్నారు. సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథసాహెబ్‌లోనూ వ్యాసుడు బ్రహ్మ దేవుడి కుమారుడని పేర్కొన్నారు. వ్యాసభగవానుని గురు గోవిందసింగ్ వేద నిధి అన్నాడు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలోనూ వ్యాసుని విషయం తమాషాగా ఉంటుంది.
రేగుచెట్ల వనంలో జన్మించాడు కాబట్టి బాదరాయణుడు అయ్యాడనేది ఓ కథనం. ఈయనే బ్రహ్మ సూత్రాలు రాసి వేద వేదాంత విశేషాలను అందులో నిక్షిప్తం చేశాడు. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులను ప్రస్తాన త్రయం అంటారు .ఈ మూడింటికీ కర్త వ్యాసుడే. పతంజలి యోగ శాస్త్రానికి ఆధారం వ్యాసమహర్షి చెప్పిన సూత్రాలే. అంతటి విశిష్ట వ్యక్తి భగవాన్ వేద వ్యాస మహర్షి . ఆయన పెట్టిన అక్షరభిక్ష అన్నపూర్ణగా ఇప్పటికి వెలిగిపోతుంది.