ఒక రాజు తను యుద్ధంలో గెలిస్తే ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పి యుధం లో విజయం సాధించిన తరువాత ఇచ్చిన మాట ప్రకారం శివుడికి అధ్బుతమైన శివాలయాన్ని నిర్మించాడు. ఇలా పురాతనకాలంలో నిర్మించబడిన ఈ ప్రాచీన ఆలయంలో శివలింగం ఎక్కడ లేని విధంగా భక్తులకి దర్శనం ఇస్తుంది. మరి ప్రత్యేకమైన ఈ శివలింగం ఉన్న ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ప్రాచీన ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఢిల్లీలోని చాందిని చౌక్ వద్ద దిగంబర్ జైన్ లాల్ ఆలయానికి సమీపంలో గౌరీశంకర్ అనే ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన శివాలయంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన శైవ క్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా పేరుగాంచింది. శివుడు శివలింగరూపంలో దర్శనం ఇచ్చే ఈ ఆలయంలోని శివలింగం వెండితో చేయబడిన సర్పంతో చుట్టబడి ఉంటుంది. ఇది విశ్వస్తూపం లేదా విశ్వకేంద్రంగా పరిగణించబడుతుంది.
ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, ఒక గొప్ప శివభక్తుడైన మరాఠా సైనికుడు అపా గంగాధర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. అయితే ఒక యుద్ధం అతను బాగా గాయపడినప్పుడు శివుడిని ప్రార్ధించి, తీవ్రమైన గాయాల నుండి బయటపడి విజయం సాధించి బ్రతికి వస్తే ఆలయాన్ని నిర్మిస్తానని వాగ్దానం చేసినట్లు స్థల పురాణం. ఇలా వెలసిన ఈ ఆలయ పిరమిడ్ ఆకారపు పైకప్పు దిగువ భాగం పైన అయన పేరు చెక్కబడి ఉంది. ఆ తరువాత 1959 లో ఈ ఆలయాన్ని పునరుద్ధరించిన సేథ్ జైపూర పేరు కూడా ఆ ఆలయ కిటికీలపైనా చెక్కబడింది.
ఈ ఆలయంలోనూ గర్భగుడిలో శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి విగ్రహాలు భక్తులకి కనువిందు చేస్తాయి. ఆలయంలోని శివలింగం ముందు శివుడు, పార్వతుల జాతి రాళ్లతో అలంకరించిన విగ్రహాలు కనిపిస్తాయి.
ఇలా వెండి సర్పం చుట్టబడి ఉన్న శివలింగాన్ని దర్శించుకోవడానికి అనేక ప్రాంతాల నుండి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి ఆ అధ్బుత శివలింగాన్ని దర్శించుకొని తరిస్తారు.