లక్ష్మీదేవి అంశగా జన్మించిన పద్మావతి తను వివాహం వేంకటేశ్వరస్వామి తప్ప ఎవరిని చేసుకోను అని ఆ స్వామికోసం తపస్సు చేసి ఈ పవిత్ర ప్రదేశంలోనే వివాహం చేసుకుందని స్థల పురాణం. మరి ఆలయం ఎక్కడ ఉంది ? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నారాయణవనంలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరాలయం ఉన్నది. అతి ప్రాచీనమైన ఈ ఆలయం అరుణానది తీరంలో ఉంది. ఈ ఆలయం నందు గర్భగుడిలో కల్యాణ వేంకటేశ్వరుడు పక్కనే మరొక చిన్న గుడిలో పద్మావతి అమ్మవారు దర్శనం ఇస్తారు. పద్మావతి అమ్మవారి ముందు పెద్ద తిరుగలి రాయి కలదు. ఆ తిరుగలితో ఆమె పెండ్లి రోజున బియ్యము విసిరినారని చెబుతారు. ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఆకాశరాజు పాలించేవాడు. ఈ ఆలయం ఆయనే కట్టించారని స్థల పురాణం చెబుతుంది. శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర రూపంతో వేంకటాద్రి మీద వెలిసాడు. ఇక లక్ష్మీదేవి పద్మావతి రూపంతో ఆకాశరాజు దంపతులకి పుత్రికగా జన్మించింది. ఆ తరువాత యుక్త వయసుకి వచ్చిన పద్మావతీదేవి వేంకటేశ్వరుని తప్ప ఎవరిని వివాహం చేసుకోనని తనకు ఆ స్వామితోనే వివాహం జరిపించమని తన తండ్రిని కోరింది. అప్పడు కుమార్తె కోరికను మన్నించిన ఆకాశరాజు శ్రీ వెంకటేశ్వర, పద్మావతిల కళ్యాణం ఈ ప్రదేశంలోనే అతి వైభవంగా జరిపించాడని ఆ కల్యాణానికి ముక్కోటి దేవతలు, యక్షులు, కిన్నెరలు, గంధర్వులు వచ్చి తిలకించారని ప్రసిద్ధి. ఈ ఆలయ చరిత్ర ప్రకారం క్రీ.శ. 1544 లో అచ్యుత దేవరాయల ఆంతరంగికుడైన పెనుగొండ వీరప్పన్న ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం విశాలమైన ఆవరణ కలిగి ఉన్నది. ఆలయం చుట్టూ కూడా ఉన్నతమైన ప్రాకారము కలదు. ఈ ప్రాకారం తూర్పు దిశలో 96 అడుగుల ఎత్తు గల 7 అంతస్తులు కలిగిన గోపురంతో శిల్పకళా సౌదర్యంతో విరాజిల్లుతుంది.ఈ అలియానికి కొంత దూరంలో ఉన్న పుష్కరిణిలో కార్తీక శుద్ధ దశమి నుండి అయిదు రోజులు స్వామివారి తెపోత్సవం, జ్యేష్ఠ శుద్ధ దశమి నుండి పదిరోజులు బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుపుదురు. ఈ సమయాల్లో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి దర్శనం చేసుకుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.