Home Unknown facts ముస్లింలు కూడా దర్శించుకునే రామాలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

ముస్లింలు కూడా దర్శించుకునే రామాలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0

దక్షిణ భారతదేశంలో ప్రాచీన శిల్పకళా సంపదను ఎలుగెత్తి చాటిచెప్పే సుప్రసిద్ధ దేవాలయాల్లో ఒంటిమిట్ట రామాలయం ఒకటి. ఒంటిమిట్ట కోదండరాముడు పిలిస్తే పలికే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు. ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా పిలిస్తారు. మత సామరస్యాని, ప్రశాంత వాతావరణానికి ఆలవాలం ఇక్కడి కోదండరాముడు. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది.

Vontimitta kodandarama swamy templeఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్టించాడని ప్రతీతి. పురాణాల ప్రకారం రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకున్నాడని తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఇక్కడ ప్రజల విశ్వాసం.

ఇంకొక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు) ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు.

అలాగే ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ చూడవచ్చు. అందుకే దీనికి ఏకశిలా నగరం అన్ని పేరొచ్చింది. అయితే ఎక్కడైనా రామాలయం అంటే సీతారామ లక్ష్మణులతో పాటు ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. కానీ ఒంటిమిట్ట ఆలయంలో మాత్రం హనుమంతుడి విగ్రహం ఉండదు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాముల వారు ఉన్న ఆలయం ఇదొక్కటే.

ఈ దేవాలయం లో శ్రీరామ తీర్థం ఉంది. రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఓరోజున సీతాదేవికి దాహం వేసిండట. అప్పుడు రాములవారు ఆ మహాసాధ్వి దాహాన్ని తీర్చడానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళ గంగను పైకి తెప్పించాడట. ఆది తాగి సీతాదేవి తృప్తి చెందినదిగా ఇతిహాసాల్లో చెప్పబడింది. అదే రామ తీర్థంగా నేడు పిలువబడుతున్నది.

ఒంటిమిట్ట రామాలయంలో మరో ముఖ్యమైన ఆకర్షణ ఇమాంబేగ్ బావి. ఇమాంబేగ్ అనే వ్యక్తి 1640 సంవత్సరంలో కడపను పరిపాలించిన అబ్దుల్ నభీకాన్ ప్రతినిథి. ఆయన ఒకసారి ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా? అని ప్రశ్నించాడట. దానికి, చిత్తశుద్ధితో పిలిస్తే కచ్చితంగా పలుకుతాడని వారు సమాధానమివ్వగా, ఆయన మూడు సార్లు రాముని పిలిచాడట. అందుకు ప్రతిగా మూడు సార్లు ‘ఓ’ అని సమాధానం వచ్చిందట. ఆయన చాలా ఆశ్చర్యచకితుడై ఆరోజు నుండి స్వామి భక్తుడిగా మారిపోయాడట.

ఆ తరువాత స్వామివారి కైంకర్యాలు కోసం అక్కడ ఒక బావిని తవ్వించడం జరిగింది. ఆయనపేరు మీదుగానే ఈ బావిని ఇమాంబేగ్ బావిగా వ్యవహరించడం జరుగుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించికుని, ఎందరో ముస్లింలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకోవడం, ఇక్కడి విశేషం. పుట్టపర్తికి వచ్చే ఎంతో మంది విదేశీయులు కూడా ఈ ఆలయ సందర్శన కోసం ఇక్కడికి విచ్చేస్తుంటారు. ఆలయ శిల్ప సంపద చూసి ముచ్చటపడిపోతుంటారు.

ప్రతి యేటా శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ప్రశాంత వాతావరణానికి నెలవైన ఈ ఆలయంలో పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాల వెలుగులు ఎంతో శోభనిస్తున్నాయి. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను, తలంబ్రాలను సమర్పించి, ప్రత్యేక కార్యక్రమాలనూ నిర్వహిస్తారు.

 

Exit mobile version