Home Health నోటిలో పుండ్లు రావడానికి కారణాలు ఏంటి? నోటి పూతను ఎలా తగ్గించుకోవాలి ?

నోటిలో పుండ్లు రావడానికి కారణాలు ఏంటి? నోటి పూతను ఎలా తగ్గించుకోవాలి ?

0

మన శరీరంలో సున్నితమైన అంతర్గత భాగాల్లో నోరు కూడా ఒకటి. ఈ నోటి లోపల గోడలకు, నాలుకకు, పెదాల లోపలి అంచులకు, చిగుళ్లపై పొక్కులు మొదలై పుండ్లుగా మారి తీవ్రంగా బాధపెట్టడం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. నోటిలో పుండ్లు వచ్చినప్పుడు నోటి లోపల సున్నితమైన చర్మం చీలి పోవడం, పుండుగా మారిపోయి ఎర్రగా అవ్వటం, కొన్నిసార్లు రక్తం వచ్చినట్లుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. నోరంతా పూస్తుంది. ఏదైనా ఆహారం నోట్లో పెట్టుకున్నామా భగ్గున మండిపోతుంది. ఇలాంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. మరి ఇలా నోటిలో పుండ్లు రావడానికి కారణాలు ఏంటి? నోటి పూతను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

causes of mouth soresనోటి పుండ్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి… ముఖ్యంగా శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, నీరు ఎక్కువగా తీసుకోకపోవడం వలన నోటిపుండ్లు వస్తాయి. ఇంకా దంతాల వ్యాధులు లేదా నోరు శుభ్రంగా లేకపోవడం, ఎక్కువగా మందులు వేసుకున్నప్పుడు, టూత్ పేస్ట్ లు తరచూ మారుస్తున్నప్పుడు, వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా నోటిలో పూతలు రావొచ్చు. వేడి పదార్థాలను ఒకేసారి నోటిలో పెట్టుకున్నప్పుడు, బాగా వేడిగా ఉన్న టీ, కాఫీ, సూపులను నోట్లోకి తీసుకున్నప్పుడు కూడా ఇలానే గాయాలు ఏర్పడవచ్చు. గట్టిగా ఉన్న బ్రష్ తో పళ్లను చాలా కఠిన విధానంలో బ్రష్ చేసినప్పుడు, టుబాకో నమలడం వల్ల నోటిలో పుండ్లు ఏర్పడతాయి.

అనారోగ్యానికి గురైనప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడడం వల్ల, హార్మోన్లలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఇవి వస్తాయి. అలాగే, విటమిన్ల లోపం ముఖ్యంగా ఫొలివైట్, రిబోఫ్లావిన్ (విటమిన్ బీ2), బీ12 లోపం ఏర్పడినప్పుడు, పేగు సంబంధిత సమస్యలు ఉన్నా ఇవి కనిపిస్తాయి.

నోటి పుండ్లు లేదా నోరు పూసినపుడు నోరు, నాలుక భాగం పగిలిపోయి ఎర్రగా మారటం, నోట్లో నీరు ఊరుతూ ఉండటం, ఆహారం తీసుకోలేకపోవడం, మంట పుట్టడం, కొన్నిసార్లు రక్తం రావడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటి వల్ల నొప్పి తప్ప ఇతరత్రా ఇబ్బంది ఏమీ ఉండదు. ఇవి ఓ వారం నుంచి రెండు వారాల పాటు తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. తరువాత తగ్గిపోతాయి. అయితే వీటిని తేలిగ్గా తీసుకోవద్దని అంటున్నారు వైద్య నిపుణులు. తరుచూ వచ్చే నోటి పూతలు ఇన్ఫెక్షన్ లేదా కేన్సర్ కి దారితీయొచ్చు. కాబట్టి కొన్ని వంటింటి చిట్కాలు వాడి వీటి నుండి తక్షణ ఉపశమనం పొందొచ్చు.

->బియ్యం కడిగిన నీటిలో కొద్దిగా కలకండ కలిపి, 30 మీ.లి రోజుకి రెండుసార్లు తాగాలి. ఇలా చేయడం వలన నోటిలో పుండ్లు త్వరగా నయం అవుతాయి.

->జాజికాయ పాలలో అరగదీసి, తీసిన గంధమును నాలుక పైన పూస్తే 4 లేక 5 రోజులలో నాలుక పూత తగ్గిపోతుంది.

->నోటి పుండ్లు లేదా నాలుకపూత సమస్యతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా తేనె తీసుకుని పుండ్లుగా ఉన్న భాగంలో రాసుకోవాలి. ఇలా చేయడం వలన నొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది. తేనెలో కాస్త ఆమ్లా పౌడర్ కలుపుకుని నోటి పూతపై రాసుకున్నా సరే మంచి ఫలితం ఉంటుంది.

->నోటిలో పుండ్లు ఉన్నప్పుడు నెయ్యి లేదా కొబ్బరి నూనెను వాటి చుట్టూ రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన నోటి పుండ్లు త్వరగా నయం అవుతాయి.

->నోటి పుండ్లు ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులు తీసుకుని బాగా నమలడం వలన తులసి ఆకుల నుండి వచ్చే రసం నోటి పుండ్లను త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకులను ఉంచుకుని ఈ నీటిని సేవించినా మంచి ఫలితం ఉంటుంది.

->ఉప్పు నీటితో పుక్కిలించడం వలన కూడా నోటిలో పుండ్లు త్వరగా నయం అవుతాయి. కానీ కాస్త మంట పుడుతుంది. ఒక స్పూన్ ఉప్పుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసుకోవాలి. ఉప్పు బాగా కరిగిన తర్వాత ఈ నీటితో పుక్కిలించుకోవడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది.

Exit mobile version