మహిళలకు మెన్‌స్ట్రువల్ సైకిల్ గురించి, తమ శరీరంలో చోటుచేసుకునే మార్పుల గురించి పూర్తి అవగాహన ఉండాలి. ఇంతకు ముందుతో పోలిస్తే, పీరియడ్స్ గురించి, పరిశుభ్రత గురించి అవగాహన పెరిగింది. కానీ రుతుచక్రానికి సంబంధించిన కొన్ని అంశాలపై మరిన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది.
రుతుచక్రం, రక్తస్రావం, పీరియడ్స్‌తో కలిగే శారీరక, మానసిక సమస్యలపై వాస్తవాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా పీరియడ్స్ పై ఆరు రకాల అపోహలను ఎక్కువ మంది నమ్ముతున్నారని సర్వేల్లో తెలిసింది. వీటికి సంబంధించిన వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మెన్‌స్ట్రువల్ సైకిల్ సగటు గడువు 28 రోజులుగా ఉంటుంది. కానీ అందరు మహిళల్లో పీరియడ్స్ కచ్చితంగా 28 రోజులకు వస్తాయని అనుకోకూడదు. 21 రోజుల నుంచి 35 రోజుల వరకు ఎప్పుడైనా పీరియడ్స్ రావచ్చు. అందువల్ల సగటు మెన్‌స్ట్రువల్ సైకిల్ గడువును 28 రోజులుగా చెబుతారు. ఇంతకంటే తక్కువ లేదా గడువు ఉండే రుతుచక్రం అనారోగ్యాలకు కారణమని భావించాల్సిన అవసరం లేదు.
శరీరం ఈస్ట్రోజన్, ఇతర హార్మోన్లను విడుదల చేయడానికి, వీటిని నిల్వ చేసుకోవడానికి కొంత మొత్తంలో కొవ్వు అవసరం. ఈ హార్లోన్ల వల్లనే పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తాయి. అందువల్ల ఉన్నట్టుండి బరువు తగ్గడం లేదా బరువు పెరగడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పే అవకాశం ఉంది. శరీరంలో కొవ్వు శాతం ఎక్కువగా ఉండే మహిళల్లో రుతుచక్రం క్రమం తప్పే అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. వీరిలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి కావడమే ఇందుకు కారణం.
గర్భనిరోధక మాత్రలు పీరియడ్స్‌ను క్రమబద్దీకరించడానికి సహాయపడతాయని కొన్ని సర్వేల్లో తేలింది. వీటివల్ల రుతుచక్రానికి సంబంధించిన సమస్యలు దూరమవుతాయి. కానీ మహిళల ఆరోగ్యాన్ని బట్టి, ఇతర సమస్యలు లేవని నిర్ధారించుకున్న తరువాతే వీటిని వాడాల్సి ఉంటుంది.
సాధారణంగా అండోత్సర్గమైన 14 రోజుల తరువాత పీరియడ్స్ వస్తాయి. పీరియడ్స్ రావడం పూర్తిగా అండం అభివృద్ధి కావడం పైనే ఆధారపడి ఉంటుంది. కానీ మెన్‌స్ట్రువల్ సైకిల్ మొదటి భాగం ఏడు నుంచి 20రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ 14వ రోజున అండోత్సర్గం అయితే, అంతకు 14 రోజుల తరువాత.. అంటే 28వ రోజున పీరియడ్స్ వస్తాయి. కానీ 10వ రోజునే అండోత్సర్గం అయితే, 24వ రోజునే పీరియడ్స్ వస్తాయి.
మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో అసాధారణ రక్తస్రావం క్యాన్సర్, పాలిప్స్, మెనోపాజ్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతంగా చెప్పవచ్చు. ఈ సమస్యను ఎదుర్కొనేవారు వెంటనే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, అధిక రక్తస్రావానికి గల కారణాలను తెలుసుకోవాలి.
ఒత్తిడి వల్ల కూడా రుతుచక్రం క్రమం తప్పే అవకాశం ఉంది. శారీరక, మానసిక ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీని వల్ల ఆలస్యంగా లేదా త్వరగా పీరియడ్స్ రావచ్చు.