వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఎదురవుతున్న సమస్య జుట్టు రాలడం. కొంతమంది దీన్నుంచి బయటపడటానికి చేయని ప్రయత్నమంటూ ఉండదు. హెయిర్ ప్యాక్స్, హెన్నా ప్యాక్స్, ఆయిల్ థెరపీ, షాంపూ, కండిషనర్ అంటూ రకరకాల ఉత్పత్తులు ఉపయోగిస్తూ ఉంటారు. అయినా ఫలితం కనిపించలేదని బాధపడిపోయేవారు చాలా మందే ఉంటారు.
ఈ సమస్య డెలివరీ తరువాత మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో జుట్టు వేగంగా పెరుగుతుంది. అలాగే.. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అంతే వేగంగా రాలిపోతుంది. దీనికి కారణం ఏంటంటే గర్భధారణ సమయంలో వారి శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకల అనాజెన్ దశ కాలాన్ని పెంచుతుంది. ప్రసవం జరిగిన తర్వాత ఈస్ట్రోజెన్ సాధారణ స్థాయికి రావడం వల్ల అవన్నీ మూడో దశకు చేరుకుని రాలిపోతాయి.
మన జీవన విధానం, వాతావరణంలో వచ్చిన మార్పులు మన జుట్టు పెరుగుదలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి మనం పాటించాల్సిన ముఖ్యమైన సూత్రం సంతులిత ఆహారం తీసుకోవడంతో పాటు తగినంత నీరు తాగాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు పాటించినా.. జుట్టు రాలడం ఆగకపోతే.. వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.