మనకు వ్యసనం అంటే మద్యపానం, ధూమపానం అనే గుర్తుకు వస్తాయి. కానీ ఇటీవల కాలంలో అంతకన్నా ప్రమాదకరమైన వ్యసనం ఒకటి వెలుగులోకి వచ్చింది. దాన్ని మనం గుర్తించట్లేదు కానీ అది తెలియకుండానే మనల్ని బానిసలుగా చేసుకుంటోంది. అదే స్క్రీన్ ఎడిక్షన్ అంటే మొబైల్, ట్యాబ్, టీవీ స్క్రీన్లకు బానిసలుగా మారిపోవడం. నెలల వయసు పిల్లలు కూడా ఇప్పుడీ టెక్నాలజీ యుగంలో మొబైల్‌కు బాగా అలవాటు పడిపోతున్నారు. చిన్నపుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చెప్పే కథలను ఇప్పుడా స్క్రీన్స్ చెబుతున్నాయి. ఆరుబయట ఆడుకునే ఆటలనూ స్క్రీన్స్‌పైనే ఆడేస్తున్నారు.

- నెలల వయసు పిల్లలు ఈజీగా మొబైల్‌ను ఆపరేట్ చేస్తుంటే అది చూసి వాళ్ల పేరెంట్స్ మురిసిపోతుంటారు. కానీ క్రమంగా అది మొబైల్ ఎడిక్షన్‌కు దారి తీస్తోందన్న చేదు నిజాన్ని వాళ్లు గ్రహించలేకపోతున్నారు. ఇది ఎంత వరకూ వెళ్లిదంటే.. స్క్రీన్‌కు తమను దూరం చేయడాన్ని తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు హత్యలు చేయడానికీ వెనుకాడటం లేదు. ఈ మధ్య తరుచూ మీడియాలో ఇలాంటి వార్తలను చదువుతూనే ఉన్నాం. డ్రగ్స్, ఆల్కహాల్‌ను మించి డిజిటల్ ఎడిక్షన్ ఆందోళనకు గురి చేస్తోంది.

- ఉదయం లేవగానే మొబైల్ చూడడం దగ్గర మొదలైన దినచర్య ఆఫీస్ లో గంటల తరబడి స్క్రీన్ నే చూడడం, మళ్ళీ ఇంటికి రాగానే రాత్రి పడుకునే వరకు మొబైల్ చూస్తూనే ఉండడం అసలు కళ్ళకు విశ్రాంతి లేకుండా చేస్తోంది. సెల్‌ఫోన్ లైట్లు చాలా చిన్నవి, వాటిని కళ్ళతో చూసినప్పుడు అవి హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఇది నిద్ర, మేల్కొనే దినచర్యకు భంగం కలిగిస్తుంది. సరళంగా చెప్పాలంటే ఇది నిద్ర వ్యవధిని గణనీయంగా తగ్గిస్తుంది. రాత్రి మంచి నిద్ర లేకపోవడం వల్ల పగటిపూట ఏకాగ్రత సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా నిర్విరామంగా బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ లైట్ వెలుగుతూనే ఉండటం కారణంగా బ్యాటరీ జీవితకాలం కూడా త్వరగా అయిపోతుంది. రాత్రి నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను చూడటం మీకు అలవాటు ఉంటే, మీరు సెట్టింగులను మార్చవచ్చు.

- గూగుల్ క్రోమ్ లో డార్క్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టవచ్చు. డార్క్ మోడ్ ను ఉపయోగించడం వల్ల మీ కంటిపై మొబైల్ ఫోన్ నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి పడకుండా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి సింపుల్ బటన్ లేదా చెక్ బాక్స్ వంటివి ఏమీ లేవు. మొబైల్, కంప్యూటర్లో ఉండే తెలుపు లేదా లేత రంగులను నల్ల రంగు లేదా ముదురు రంగులోకి మార్చడాన్నే డార్క్ మోడ్ అని పిలుస్తారు. దాంతో అక్షరాలు ఈజీగా కనిపిస్తాయి. కొన్నింటిలో దీన్ని పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. మరికొన్నింటిలో ఆటోమాటిక్ గా మారిపోతుంది.

- డార్క్ మోడ్ తో మీ కళ్ళపై ఎక్కువ భారం పడదనే భావం మీకు కలగొచ్చు. కానీ దీనికి తలనొప్పి, పొడి కళ్ళు వంటి లక్షణాలను నివారించే శక్తి మాత్రం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఎలక్ట్రానిక్ పరికరం స్క్రీన్ నుంచి వచ్చే నీలి కాంతి స్థాయిలను తగ్గిస్తుంది. అది చేసే హానిని మాత్రం కాదు.
- దృష్టిని రక్షించడానికి ఇది సాయం చేయకపోవచ్చు. కానీ ఈ మోడ్ లో ఫోన్ వాడితే త్వరగా నిద్ర పోవచ్చు. రాత్రిపూట నీలిరంగు కాంతిని ప్రసరించే పరికరాలను ఉపయోగిస్తే.. మీలో అప్రమత్తత పెరుగుతుంది, దీంతో నిద్రపోవడం కష్టమవుతుంది. డార్క్ మోడ్ నీలి కాంతిని తగ్గిస్తుంది. దాంతో నిద్ర పడుతుంది. అలాగే ఇది ఎలక్ట్రానిక్ వస్తువుల బ్యాటరీ లైఫ్ ను పెంచుతుంది.
