“ఒడ్డియాన పీఠం” అంటే ఏమిటి? 

మన హిందువులు ఎన్నో ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తారు.
హిందూమతం అనేది ఒక మర్మమైన మతం. అనేక ఆచారాలు, సాంప్రదాయాలు,విశ్వాసాలు చాలా పటిష్టంగా ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో భాగంగా మన ఇంటి ఆడబిడ్డకు వివాహం చేసిన అనంతరం తనకి ఒడిబియ్యం పోసి అత్తవారింటికి సాగనంపుతారు.
ఈ విధంగా ప్రతి సంవత్సరం తమ కూతురిని పుట్టింటికి పిలిచి తనకుఒడి బియ్యం పోసి అత్తవారింటికి సారే కట్టి పంపించడం ఆనవాయితీగా వస్తోంది. అసలు ఇలా అమ్మాయిలకు వడిబియ్యం పోయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? వడిబియ్యం పోయడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం…
పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిన ఆడపడుచును ఇలా ఏడాదికొకసారి పుట్టింటికి పిలిచి తనకు పసుపు, కుంకుమ, గాజులు తనకిష్టమైన దుస్తులను పెట్టి నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా జీవించమని ఆశీర్వదించి చేసే కార్యక్రమమే వడి బియ్యం కార్యక్రమం. ఇది మాత్రమే కాకుండా ఒడిబియ్యం పోవడానికి మరొక కారణం కూడా ఉంది.
మనిషి వెన్ను లోపల 72 వేల నాడులు ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ఈనాడులు కలిసేచోట చక్రం వుంటుంది. ఈ విధంగా మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది.
ఈ చక్రం మధ్యభాగంలో “ఒడ్డియాన పీఠం” ఉంటుంది కాబట్టి అమ్మాయిలు నడుముకు ధరించే ఆభరణాలను  వడ్డానం అని పిలుస్తారు. అదేవిధంగా అమ్మాయిలకు వడిబియ్యం పోయడం అంటే ఒడ్యాణపీఠంలో ఉన్న శక్తికి బియ్యం సమర్పించడం అని అర్థం.
ఈ పీఠంలో ఉన్న శక్తి పేరు మహాలక్ష్మి. అందుకే ఆడపిల్లలను ఆ ఇంటి మహాలక్ష్మిగా భావించి ఇంటికి పిలిచి వారికి పసుపుకుంకుమలతో ఒడి బియ్యం సమర్పిస్తారు. ఈ విధంగా మన ఇంటి మహాలక్ష్మిని పిలిచి ఒడిబియ్యం పోయడమే కాకుండా వారి వెంట అష్టైశ్వర్యాలు కూడా వెళ్తాయని భావిస్తారు.
ఇవన్నీ వారి బిడ్డ తన అత్తవారింట్లో అష్టైశ్వర్యాలతో ఉండాలని భావించే తల్లితండ్రులు చేసే సంకల్ప పూజ అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తన పుట్టిల్లు  అష్టైశ్వర్యాలతో ఉండాలని వడిబియ్యం అనంతరం ఆ వడిబియ్యంలో 5 పిడికల బియ్యం తీసుకుని తమ తల్లిదండ్రుల ఇంటిలో పెట్టి తన పుట్టింటి గడపకు పసుపు రాసి ఒడి బియ్యంతో అత్త వారి ఇంటికి బయలు దేరుతుంది. అత్తవారింటికి వెళ్ళిన ఆడపడుచు తన తల్లి పెట్టిన సారెను ముత్తయిదువులకు పంచి వారి నుంచి కూడా ఆశీర్వాదం పొందుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR