ఇతిహాస రామాయణం ‘‘హరి, హర తత్త్యాత్మకం. శ్రీరాముడు విష్ణు అంశ. హనుమంతుడు శివాంశసంభూతుడు. దీనికి సంబంధించిన కథ రామాయణంలోనే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. వారిద్దరూ ఏకాంత శయ్యమందిరం చేరారు. వారికి జన్మించబోయే పుత్రునివల్లే తారకాసంహారం జరగాలి. అందుకోసమే శోభనమందిరం వెలుపల దేవతలు కొండంత ఆశతో, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
నెలలు, మాసాలు దొర్లిపోతున్నాయి. శివ పార్వతులు శోభన మందిరం నుంచి బయటకు రాలేదు. లోపల ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధస్థితి దేవతలది. చూసి రమ్మని అగ్నిని, వాయువును లోపలకు పంపారు దేవతలు. అదే సమయంలో ‘శివతేజస్సు’ బహిర్గత మవుతోంది. లోపలకు ఎవరో వచ్చారన్న సందేహం పార్వతికి కలిగింది. వెంటనే శివునికి దూరంగా జరిగింది.
శివుడు తన తేజస్సును భూపతనం కానివ్వకుండా బంధించి దానిని అగ్నికి, వాయువుకు చెరిసగం పంచి పంపాడు. తనకు చెందవలసిన శివతేజస్సును అగ్ని, వాయువులు తన్నుకు పోతూంటే పార్వతికి దుఃఖం ఆగలేదు. దేవతలు చేసిన కార్యభంగానికి కోపగించి ‘దేవతలకు స్వభార్యల వలన సంతానం పుట్టకుండుగాక’ అని శపించింది.
అగ్నిదేవుడు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను భరించలేక గంగానది గర్భంలో ఉంచాడు. గంగ కూడా శివతేజస్సును భరించలేక ఒడ్డుకు నెట్టింది. ఆ శివతేజస్సు రెల్లు పొదల్లో పడి ఆరుముఖలతో ‘షణ్ముణుడు’ జన్మించాడు
వాయువు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను, సంతానంకోసం తపస్సు చేస్తున్న ‘అంజనాదేవి’ గర్భంలో నిక్షిప్తంచేసాడు. అంజనాదేవి గర్భం ధరించింది. నవమాసాలు నిండాయి. అంజనాదేవికి ప్రసవవేదన మొదలైంది. ఆ రోజు వైశాఖ బహుళ దశమి తిధి: పుర్వాభాద్ర నక్షత్రం.ఆ శుభ ముహూర్తంలో శివాంశతో అంజనా గర్భసంభూతుగా ‘‘ఆంజనేయుడు’’ జన్మించాడు.