Home Unknown facts ఏ దేవతను ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది

ఏ దేవతను ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది

0

దైవ పూజ చేసేటప్పుడు ఎవరి స్థోమతకు తగినట్టు వారు పూలు, పండ్లు, కొబ్బరికాయలు ఆ భగవంతుడికి సమర్పించుకుంటారు. మరి ఎలాంటి వస్తువులు సమర్పిస్తే ఆ దేవుడు ప్రసన్నం అవుతాడో మీకు తెలుసా? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భగవంతుడి పూజపరిశుద్ధమైన మనస్సుతో, భక్తి పూర్వకంగా ఎవరైతే నాకు ఒక ఆకును గాని, పుష్పమును గాని, పండును గాని, కొద్దిపాటి జలమును గాని సమర్పిస్తారో అట్టివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ్భగవానుడు ‘గీత’లో చెప్పాడు. అంటే నిజమైన భక్తి నిశ్చలమైన, పరిశుద్ధమైన మనస్సుతోనే సంప్రాప్తిస్తుంది. ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన, నిష్కపటమైన మనస్సుతో పూజించి తరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతుంది.

భగవదారాధనలో పుష్పాల పాత్ర అమోఘమైనది. సాక్షాత్తు శ్రీకృష్ణ్భగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చడం ఇందుకు నిదర్శనం. అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరి అయిన వస్తువులుగా మారాయి. అస్సలు ఈ పూజా విధానంలో ఎలాంటి పుష్పాలు వాడాలి? ఏ దేవతను ఏ పుష్పాలతో పూజిస్తే సత్ఫలితాలు వస్తాయోనన్న సందేహాలు చాల మందికి కలుగుతూ ఉంటుంది.

అయితే దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా అది శుచి అయి, శుభ్రతతో కూడుకున్నదై ఉండాలని పెద్దలు చెబుతారు. పురిటివారు, మైలవారు, బహిష్టులయిన స్ర్తిలు పుష్పాలను తాకరాదు. అలాంటి పుష్పాలు పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది.

శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలట. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పూజ సమయంలో కంఠాన గంధాన్ని, చెవిలో పుష్పాన్ని ధరించాలట.

జుట్టులో తులసి దళాన్ని ధరించరాదట. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగనే్నరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు. సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలట.

విష్ణ్భుగవానుని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలట. అలాగే ‘శ్రీచక్రాన్ని’. తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూల, జాజి, మల్లె, ఎర్రగనే్నరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి.

మహాశివుని మారేడు దళాలతో పూజించడంవల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. అలాగే పవళ మల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోర్కెలు, మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట. ‘మంగిషం’ పుష్పాలతో పూజ ఓర్పును, శాంతిని, సహనాన్నిస్తుంది. విరుచి పుష్పాలు మనసుకు ప్రశాంతతను, ‘ఎరుక’ పుష్పాలు ఆత్మస్థయిర్యాన్ని, అరళి పుష్పాలు సత్యసందతను పెంపొందిస్తాయట.

అలాగే తెల్ల తామరలతో దైవాన్ని అర్చిస్తే భక్తి పెరుగుతుంది. తులసి దళాలు ఆధ్యాత్మిక వికాసాన్ని, గన్నేరు, జీవంతి పుష్పాలు ముక్తికి, మల్లెపుష్పాలు, నిష్కల్మషబుద్ధిని, సంపెంగ పుష్పాలు అభివృద్ధిని, నాగలింగ పుష్పాలతో పూజిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని శాస్తవ్రచనం. అలాగే ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం. ఈ పుష్పాలతో పూజవల్ల శ్రీమహాలక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది.

అలాగే తామర, శంఖ పుష్పాలతో చేసే పూజవల్ల అష్టైశ్వర్యాలు, మారేడు దళాలతో చేసే పూజవల్ల జ్ఞానాభివృద్ధి కలిగి ముక్తికలుగుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. అయితే భగవంతునికి సమర్పించే ఏ పుష్పమైననూ భక్తితో, పరిపూర్ణమైన విశ్వాసంతో సమర్పించాలి తప్ప విశ్వాసం, భక్తిలేకుండా పుష్పాలు సమర్పించడంవల్ల ప్రయోజనం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.

భగవంతునిపై నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఉంచి, నిష్కల్మషంగా, ఫలాపేక్ష లేకుండా ఆరాధిస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అలాంటి సందర్భాలలోనే అహింస, ఇంద్రియ నిగ్రహం, భూత దాయ, క్షమాగుణం, శాంతిత్వం, తపస్సు, ధ్యానం, సత్యం అనే పుష్పాలను భగవంతునికి భక్తులు స్వయంగా సమర్పించగలిగే శక్తి ఏర్పడుతుంది. అలాంటి స్థితి ఏర్పడిననాడు ప్రతి ఒక్కరూ, ప్రతి అణువులో భగవంతుని చూడగలుగుతారు

Exit mobile version