మహిషాసురుని అమ్మవారు సంహరించారని మనకు తెలుసు కానీ అంతటి శక్తివంతుడు ఆడవారి చేతిలో చనిపోవడానికి కారణం తెలుసుకుందాం..పూర్వకాలంలో దనువు పుత్రులైన రంభకరంభులనే వారు సంతానంకోసం ఈశ్వరుని గురించి ఘోరతపస్సు చేశారు. కరంభుడు నీటిలోను, రంభుడు చెట్టుపైన కూర్చుని తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు. సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కొని పరమేశ్వరుడికి అర్పించడానికి సిద్ధమయ్యాడు.
అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ‘పుత్రసంతతిలేని నాకు నువ్వే మూడు జన్మల పుత్రునిగా జన్మించాలి. ఈ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు, వేదవేదాంగవిధుడు, కామరూపుడు, దీర్ఘాయుష్మంతుడు కావలి’ అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు. ఈశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు.
రాక్షస స్వభావుడైన రంభుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథునం సాగించాడు. అప్పుడు రుద్రుడు తన అంశంతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు. చూలు నిండాక మహిషాకారంతో బిడ్డ జన్మించాడు. అతడే మహిషాసురుడు. అతను మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజగజలాడిస్తూ ఏలుతున్నాడు. ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షిశిష్యుని బాధిస్తూ వుండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్దిస్తుందని శపించాడు.
అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని మార్చుకోక స్త్రీ సాధుపుంగవులని, దేవతలనీ, ఋషులను బాధిస్తూనే వచ్చాడు. అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు. ఆ దేవి మొదట ‘ఉగ్రచండి’ అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది.