బద్రినాధ్ లో వర్ణ విచక్షణ లేదు. అర్దరాత్రి వేళ, ఆలయ ప్రాంగణానికి వెళితే అమరగానం మనకు వినిపిస్తుంది. ఈ ఆలయంలో 6 నెలలు మానవులు, 6 నెలలు దేవతలు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అక్టోబరు నెల నుండి ఆరు మాసాలు, నరసంచారము ఉండదు. బ్రాహ్మణ ముదుసలి – నర నారాయణులు మాత్రమే ఉంటారు. బ్రాహ్మణ ముదుసలి మూడు వందల అరవై రోజులు ఉంటారట. తిరిగి ఆలయము తెరుచే సమయంలో, జ్యోతి దర్శనార్దం భక్తులు తండోపతండాలుగా వస్తారు. పాండవుల స్వర్గధామము చేరినపుడు, బద్రి నాధుని సేవించి తరించారు. ఆనాడు మానవుడు జీవించి ఉండగా వైకుంఠ ప్రాప్తికి నోచుకోలేదు. మరి ఈనాడు, మానవుడు జీవించి ఉండగానే వైకుంఠము వెళ్ళి తిరిగి భూలోకానికి వస్తున్నారు. కలియుగములో భక్తులకు ఆపూర్వ అవకాశము ఇది.
బద్రిలో ఉన్నంతసేపు ఆకలిదప్పులు ఉండవు. అంతకన్నా మానవునికి కావలసినదేమున్నది. బద్రిలో నారద, గరుడ ప్రహ్లాద, నృసింహ, ఉద్దవ శిలలు, ఈ శిలల నుండి ఏనుగు తొండము లావున సెగలు, పొగలు, గ్రక్కేటి వేడినీరు ప్రవహిస్తున్నది. దీనినే అగ్ని తీర్ధమంటారు. స్నానము చెసిన వెంటనే, శరీరము మువ్వలా తయారై అమరత్వము సిద్ధించినట్లు అనిపిస్తుంది.
అగ్ని తీర్ధము దగ్గరలో ఆలయము ఉన్నది. దీనికి ముఫై రెండు మెట్లు ఉంటాయి. ఆలయ ప్రాంగణములో, మొదట ద్వారము పంచలోహములతో, రెండవ ద్వారము వెండితో, మూడవ ద్వారము బంగారముతో చేయబడినవి. యివి దాటితె గర్భాలయము చేరుకోవచ్చు.
ఆదినారయణ స్వామి నిర్యాణస్ధితిలో పద్మాసనుడై భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటాడు. కుడి ప్రక్క నరనారాయణులు, ఎడమ ప్రక్కన గణపతి, ఉద్దవుడు, గరుడుడు, మహాలక్ష్మీ ఉంటారు. పాదాల దగ్గర తుంబుర నారదులు గానము చేస్తూ కనిపిస్తారు. స్వామిని పరిశీలనగా చూడాలి. లేకపోతే కనిపించడు. తొమ్మిది అంగులాల స్వర్ణకీరీటము కనిపిస్తుంది. కొందరు దీనినే స్వామి అనుకుంటారు. భక్తి శ్రద్ధలతో స్వామిని దర్శించి తరించాలంటే ఏకాగ్రత ఉండాలి.
భద్రిని ‘విశాలపురం’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశము రేగువనముతో నిండి ఉన్నందున బదరీ అని పేరు వచ్చింది “బదరీ విశాల్ కి జై” అని భక్తులు అంటూ ఉంటారు. బదరీ వృక్షం అంటే రేగు చెట్టు.