హిందూ సాంప్రాయంలో ఎన్ని దేవతలు ఉన్న వినాయకుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రతి శుభకార్యం విజ్ఞేషుడి పూజ తోనే ప్రారంభిస్తారు. ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయి ఏ పేరుతో పిలిచినా భక్తితో పిలిస్తే కరుణిస్తాడు. అయితే వినాయకుడి నామాల్లో ఒక ప్రత్యేకత ఉన్న పేరు ఏకదంతుడు.విఘ్న వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసుకుందాం.
తన తండ్రి మరణానికి ప్రతీకారంగా కార్తవీర్యుని వధించిన అనంతరం పరుశురాముడు తన గురువు అయిన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదని నివారించాడు. “పరమేశ్వరుడిని దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవెవ్వడివి” అంటూ పరుశురాముడు ధిక్కరించాడు.
మాటా మాటా పెరిగి అదికాస్తా యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరుశురామున్ని పైకిఎత్తి కింద పడేసాడు. పరశురామునికి కళ్ళు బైర్లుకమ్మాయి. ఆగ్రహించిన పరుశురాముడు తన చేతిలోని గండ్ర గొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు ఉన్న పళంగా లోపలి నుంచి బయటికి వచ్చారు.
రక్తం కారుతున్న బాల గణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముడిని మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైనా గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకొని “ఏకదంతుడి”గా పేరు పొందాడు.