Home Unknown facts Where Are The Graha Sambanditha Kshetralu In Telugu states?

Where Are The Graha Sambanditha Kshetralu In Telugu states?

0

గ్రహాలు మొత్తం తొమ్మిది. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహ‌స్పతి, శుక్రుడు, శని, రాహువు మరియు కేతువు. అయితే కుజ దోషం, శుక్ర గ్రహ దోషం, రాహు దోషం ఇలా ఇలా సర్వగ్రహరిష్టాలు తొలగి పోవడానికి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరి గ్రహ దోష పూజలు చేసుకొని గ్రహదోషాలు పోగొట్టే ఆ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి? ఆ క్షేత్రానికి సంబంధించిన విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవాలయం

Graha Sambanditha Kshetralu in Telugu states

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా లో శ్రీకాళహస్తి పట్టణం ఉంది. ఈ నగరం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఈ ఆలయాన్ని గ్రహణం రోజు కూడా తెరిచే ఉంచుతారు. ఇక్కడ రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగం అనడానికి ఈ దీపం ఒక నిదర్శనం. ఇంకా మరోదీపం ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది. ఇలా ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ కాళహస్తీశ్వరుని గ్రహణానంతరం దర్శనం చేసుకునే వారికి దారిద్య్రం, దోషాలు తొలిగిపోయి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం అందుకే దేశంలోని ఆలయాలన్నీ గ్రహణం రోజున మూతపడినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది.

అంతేగాకుండా ముక్కంటికి గ్రహణకాలంలోనే గ్రహణ కాలాభిషేకాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ కాళహస్తిలో ఒక్క శనీశ్వరుని తప్ప నవగ్రహాలను ప్రతిష్టించకూడదు. అందుకు బదులుగా ఈ క్షేత్రంలో రాహుకేతు గ్రహాలు నెలకొని ఉన్నాయి. రాహుకేతు దోషాలను నివారించే దివ్యశైవక్షేత్రం కాళహస్తి కాబట్టి, సూర్య, చంద్రగ్రహణ దోషాలు ముక్కంటిని ఏమాత్రం అంటవని పండితులు చెప్తున్నారు. దీంతో శ్రీకాళహస్తీశ్వరుడు గ్రహణాతీతుడుగా పిలువబడుతున్నాడని వారంటున్నారు. రాహు కేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోషనివృత్తి కోసం రాహు, కేతు పూజలు నిర్వహిస్తారు.

శ్రీ సూర్యనారాయణ స్వామి – శ్రీకాకుళం జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకుళం జిల్లాకి రెండు కిలోమీటర్ల దూరంలో అరసవిల్లి అనే గ్రామం లో అతి పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి పుణ్యక్షేత్రం ఉంది. ఈ ఆలయంలో ఉషా పద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ఆలయాన్ని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతుంది. ఇంద్రుడు ఇక్కడ శ్రీ సూర్యభగవానుడిని ప్రతిష్టించి, ఆరాధించి, ఆరోగ్యవంతుడై తిరిగి తన లోకానికి చేరుకున్నాడని ప్రతీతి. అందుకే నవగ్రహాధిపతి ఆయన ఈ స్వామివారిని దర్శిస్తే సర్వగ్రహరిష్టాలు తొలగి శాంతి లభిస్తుందని, చర్మవ్యాధి నిరోధికుడని చర్మ వ్యాధులు అన్ని తొలగిపోతాయని పురాణాలూ చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి 9,10,11 తేదీలలో, అక్టోబర్ 1,2,3 తేదీలలో ఉదయం 6 గంటల నుండి 20 నిమిషాలపాటు ఐదు ద్వారాల నుండి సూర్య కిరణాలు స్వామివారి పాదాలపైనా పడతాయి. ఈ సమయంలో ఆరోగ్యం కోరుకునే వారు, గ్రహబాధలు ఉన్నవారు స్వామిని దర్శిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి.

భ్రమరాంబ మల్లికార్జున కామాక్షి దేవాలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు 12 కీ.మీ. దూరంలో, పెన్నానది తీరాన జొన్నవాడ శ్రీ మల్లికార్జునస్వామి కామాక్షి దేవస్థానం ఉంది. 1150 లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. అనేక బాధలు నివారించగలిగిన శక్తిగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడి అమ్మవారు పేరు గాంచింది. కంచికామకోటి పీఠాధిపతులు ఈ అమ్మవారిని దర్శించి అయన మంత్రపూత జలంతో ఆమెను అభిషేకించాడని అప్పటినుండి ఈ మహిమాన్వితురాలు మరింత మహిమ కనబరుస్తూ, భక్తుల అరదలందుకొనుచున్నది అని తెలియుచున్నది. ఈ తల్లిని ఆరాదించేందుకు సాధారణ భక్తులే కాకా, గ్రహ పీడితులు, పిశాచ పీడితులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులు, సంతానం లేనివాళ్లు, మానసిక రోగులు ఎందరో వచ్చి అమ్మవారిని దర్శించి తమ బాధలను నుంచి విముక్తి పొంది, సత్ఫాలితాలు పొందరాని చెబుతుంటారు.

శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖపట్నం నడిబొడ్డున వన్ టౌన్ లోని బురుజు పేట యందు వెలసిన ఒక గ్రామదేవత శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు. ఈ ఆలయం ప్రతి రోజు ఎంతో మంది భక్తులతో రద్దీగా ఉంటుంది. చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల నుండి కూడా కుటుంబసమేతంగా వచ్చి భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించి పూజించి తరిస్తారు. ఈ ఆలయంలో కుల మత, స్త్రీ, పురుష వివక్షత లేకుండా భక్తులెవరైనా మూలవిరాట్టును స్మృశించి పూజలను చేసుకొనే సంప్రదాయం ఇచట ఉంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని ప్రతి సంవత్సరం చైత్రశుద్ద పాడ్యమి నాడు వెండి ఆభరణములతో అలంకరించి పూజిస్తారు. ఈ అమ్మవారికి గురువారం రోజున కానుకలు సమర్పించి, తమ మనసులోని కోర్కెలు తెలియచేస్తే అవి తప్పక నెరవేరుతయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామం నందు కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం కలదు. ఇక్కడ బ్రహ్మ శివుడు ఇద్దరు ఒకేమూర్తిగా భక్తులకి దర్శనం ఇస్తారు. బ్రహ్మదేవుడు కమలగర్భుడు కనుక ఒక కమలంలో ఓ సృష్టికర్త నాలుగు ముఖాలు ఉండి పైన శివలింగాకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ప్రతిష్టించారు. అయితే దీనికి కూడా ఒక కథ చెబుతారు. ఆగమాల ప్రకారం శివాలయానికి ఎదురుగా, విష్ణుమూర్తి గుడికి వెనుకబాగంలోను, అమ్మవారి ఆలయానికి పక్కభాగంలోను ఈ నిర్మాణము ఉండకూడదు. మరి బ్రహ్మ ఆలయం గురించి ఏ ఆగమంలోను లేదు. దాంతో ఏ దోషం అంటకుండా ఇలా కోనేటి నడి మధ్యలో నిర్మించారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు అర్హతలేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించబడటం ఈ ఆలయం ప్రత్యేకత.

శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమగోదావరి జిల్లా భీమవరమునకు 2 కి.మీ. దూరంలో గౌతమి నది తీరాన గునిపూడి గ్రామం లో శ్రీ సోమేశ్వరాలయం ఉన్నదీ. ఈ ఆలయం పంచారామాలలో ఒకటిగా భక్తులచే పూజలందు కొనుచున్నది. ఇక్కడి శివలింగం చంద్రునిచే ప్రతిష్టించబడినందున దీన్ని సోమేశ్వర లింగం అని అంటారు. చంద్రుని చేత ప్రతిష్టించబడుట వలన ఈ శివలింగం పైన పదహారు కళలు కనిపించును. శ్వేతవర్ణంలో ఉండే ఈ శివలింగం క్రమ క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమవర్ణముకు మారిపోతుంది. మళ్ళి తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాతదంగా శ్వేతవర్ణంలోకి కనిపిస్తుంది. ఈ ఆలయం తేత్రాయుగం నాటిదని, దీనిని దేవతులు నిర్మించారని చెబుతారు. ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రార్ధించిన వారికీ సర్వ వ్యాధులు తొలుగునని, పంచ మహాపాతకములు హరించును.

శ్రీ పెనుశిల లక్ష్మి నరసింహస్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా, రావూరు మండలం లో నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా 80 కీ.మీ. దూరంలో, రావూరు నుంచి 30 కీ.మీ. దూరంలో గోనుపల్లి గ్రామానికి 7 కీ.మీ. దూరంలో పెంచలకోన అను క్షేత్రంలో పెనుశిలా లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఇచట శ్రీ స్వామివారు లోకకల్యాణార్థం పెంచలకోన క్షేత్రంలో పెనుశిలారూపంలో స్వయంబుగా వెలసినట్లు స్థలపురాణం చెబుతుంది. నరసింహస్వామి అమ్మవారిని పెనవేసుకొని ఒక శిలా రూపంలో స్వయంభువుగా వెలసి దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఇదే అవ్వడం విశేషం. ఎంతో మహిమగల ఈ ఆలయాన్ని సందర్శిస్తే గ్రహపీడలు పోతాయని చెబుతారు.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడే ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. దీనికి మోపిని పురమని సర్పక్షేత్రమని పేరు. కాలక్రమేణా అది మోపిదేవిగా నామాంతరం చెందింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన ఈ ఆలయంలో స్వామివారి పానపట్టం వద్ద ఉన్న ఒక కన్నం లో నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోని స్వామివారికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని, మ్రొక్కిన మ్రొక్కులు నెరవేర్చే మహత్యం కలదని భక్తుల విశ్వాసం.

శ్రీ వేంకటేశ్వరస్వామి – ద్వారకా తిరుమల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, పచ్చిమగోదావరి జిల్లాలోని, ఏలూరు నుండి 42 కి.మీ. దూరంలో ద్వారకా తిరుమల అను గ్రామం ఉంది. ఈ గ్రామంలోని అనంతాచలం అనే కొండపైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి ఉత్తర వాహినియై పంపానది ప్రవహిస్తుంది. అదే నేటి ఎర్ర కాలువ. అయితే సప్తర్షుల కోరిక మేరకు, శ్రీహరి తన సుదర్శన చక్రంతో చక్కని తీర్దాన్ని అచట సృజించాడు. దానినే సుదర్శన తీర్థం అని అంటారు.ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన స్వామివారి పాదాలు పుట్టలో ఉన్నందున నిలువెత్తు స్వామి వారిని మనం దర్శించలేము. పై భాగం మాత్రమే మనకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరగవు. ఎందుకంటే స్వామివారి విగ్రహం క్రింద చీమల పుట్ట ఉంది. ఇక ఈ స్వామివారిని దర్శించడం వలన మోక్షం సిద్ధిస్తుందని, ధర్మార్ధ కామ పురుషార్థములు సమకూరుతాయని, గ్రహ దోషాలు తొలగిపోతాయి.

శ్రీ సోమేశ్వరస్వామి – తూర్పుగోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, తూర్పు గోదావరి జిల్లా. పామర్రు మండలానికి చెందిన కోటిపల్లి గ్రామంలో శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం ఉంది. పవిత్ర గోదావరి నది తీరాన ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ సోమేశ్వరాలయం. ఈ ఆలయంలో రాజరాజేశ్వరీ సహిత శ్రీ సోమేశ్వరస్వామి వారు, అమ్మవారితో కూడిన కోటేశ్వరస్వామి వారు, శ్రీదేవి, భూదేవి సహిత జనార్దన స్వామివారు ప్రతిష్టితులై ఉన్నారు. ఇంద్రుడు తన పాపాలను తొలగించ్చుకోవడానికై ఇక్కడ కోటేశ్వర లింగాన్ని , అమ్మవారి విగ్రహాన్ని, చంద్రుడు తన పాపాల నివారణకై సోమేశ్వర లింగాన్ని రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు గౌతమ మహత్యం వెల్లడిస్తున్నది. ఆలయం సమీపంలోని నది నీటిని గౌతమ మహర్షి తీసుకొనివచ్చినట్లు ఐతిహ్యం. దీనితో ఈ నీటికి పవిత్రత ఆపాదించబడింది. కోటిపల్లిలోని గౌతమి నదిలో స్నానం చేసినవారికి పాపాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ ఆలయంలో చంద్రుడు ప్రతిష్టించిన దానిని సోమేశ్వరుడు, ఇంద్రుడు ప్రతిష్టించిన దానిని కోటీశ్వరుడు అని అంటారు. కోటి గోవులు, కోటి కన్యాదాన ఫలాలు, నూరు అశ్వమేథయాగ ఫలాలు, మూడు కోట్ల శివలింగ ప్రతిష్ట వలన వచ్చే ఫలం ఇచట గల తీర్థంలో స్నానం చేస్తే లభిస్తుందని చెబుతుంటారు.

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి – అన్నవరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలానికి చెందిన అన్నవరం గ్రామంలో పంపానది తీరమున గల రత్నగిరి కొండపైన శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం ఉంది. పూర్వం, భూలోకంలో పరస్పరం కలహాలతో జీవనం గడుపుతున్న ప్రజలను బాగుచేయమని త్రిలోక సంచారి నారద మహర్షి శ్రీమన్నారాయణుడిని కోరగా ఆ స్వామి ఇచట స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణం. అన్నవరం సత్యదేవుడిని దర్శించినా, సత్యనారాయణుడి వ్రతం ఆచరించినా సర్వపాపాలు తొలగిపోతాయనీ, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ దేవాలయాలను దర్శించి పూజలు చేయడం వలన దోషాలు తొలగిపోతాయని ప్రతీతి.

Exit mobile version