పార్వతీదేవి మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి ఎందుకు పూజలు చేసింది ?

0
2317

శివుడు ఆగ్రహానికి గురై ఒక సందర్భంలో పార్వతీదేవిని శపించగా భూలోకానికి వచ్చిన పార్వతీదేవి ఒక మామిడి చెట్టు కింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిన ప్రదేశంలోనే ఈ ఆలయం ఉన్నదని పురాణం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఇక్కడ శివలింగానికి నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shivudu parvathi

తమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లా, శివకంచిలో శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఉంది. శివకంచిలోని ప్రధాన ఆలయాల్లో శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం ఒకటి. ఈ దేవాలయములో ఉండే ప్రధాన దైవం శివుడు. ఇక్కడ భక్తులు స్వామిని ఏకామ్రనాధుడు, ఏకాంబరుడు అని పిలుస్తుంటారు. ఏకామేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామి అని అర్థం. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి. ఇంకా ఈ ఆలయ ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ 1008 శివలింగాలు, వెయ్యి స్థంబాల కళామంటపం ఉన్నాయి. ఇంకా పంచభూతలింగాల్లో ఒకటి ఈ కంచి ఏకాంబేశ్వరాలయం.

shivudu parvathi

ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, ఒకప్పుడు శివపార్వతులు కైలాసంలో పాచికలాడుకుంటూ ఉండగా ఆ ఆటలో శివుడు ఓడిపోతే పార్వతీదేవి ఎగతాళి చేసిందంటా. అందుకు కోపానికి గురైన శివుడు కురూపివికమ్మని పార్వతిని శపించాడంటా. అప్పుడు తప్పు తెలుసుకొని పార్వతి శివుణ్ణి ప్రార్ధించగా, శివుడు శాపనివారణ మార్గాన్ని చెప్పాడు.

shivudu parvathi

ఆ ప్రకారం, పార్వతిదేవి ఈ భూలోకంలో ఒకే ఒక పండు మాత్రమే కాచే ఒక మామిడి చెట్టు క్రింద కూర్చొని మట్టితో లింగాన్ని చేసి పూజించడం ప్రారభించిందంటా. శివుడు పార్వతిని పరీక్షించాలని తన జటాజూటంలో నుంచి గంగను అమితవేగంతో పారేటట్లు జారవిడిచాడంటా. ఆ ప్రవాహానికి పార్వతి తాను రోజు పూజిస్తున్న శివలింగాన్ని గట్టిగ కౌగిలించుకొని నిర్భయంగా ఉండిపోయిందంటా. అప్పుడు శివుడు సంతృప్తి చెంది శాపాన్ని విరమించి అంత్యంత సుందర రూపం అనుగ్రహించాడంటా. ఆ తరువాత పార్వతీదేవి కోరిక మేరకు శివుడు ఈ మామిడి చెట్టు కిందనే ఉండిపోయాడు అందుకే ఆయనకు ఏకామ్రనాథుడు అనే పేరు వచ్చినది. ఇలా ఇక్కడ నూతన సౌందర్యంతో వెలసిన ఈ పార్వతి దేవికి కన్నులు ఆకర్షణీయంగా ఉండటంతో ఈమెకి కామాక్షి అని పేరు వచ్చినది.

shivudu parvathi

అంతేకాకుండా పార్వతిదేవి తయారుచేసిన ఆ శివలింగాన్ని మహాలింగంగా భావించి పూజిస్తారు. ఈ శివలింగానికి నూనెతో మాత్రమే అభిషేకం చేస్తారు. మిగిలిన అభిషేకాలు పక్కన ఉండే రాతి శివలింగానికి చేస్తారు. అమ్మవారు తపస్సు చేసిన ఆ మామిడి వృక్షం యొక్క కాండాన్ని ప్రస్తుతం అద్దాల పెట్టాలో ఉంచి దేవాలయములో భద్రపరిచారు.

shivudu parvathi

ఇంత గొప్ప స్థలపురాణం ఉన్నదీ కనుకే శివకంచి లోని అన్ని ఆలయాల్లో ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు.