Home Unknown facts సాలగ్రామ దానం మహాదానం అని పెద్దలు అంటారు ఎందుకు ?

సాలగ్రామ దానం మహాదానం అని పెద్దలు అంటారు ఎందుకు ?

0

సాలగ్రామము విష్ణుప్రతీకమైన , విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిలా విశేషము. కలికాలంలో భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీభాగవతం చెబుతుంది. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు. భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది.

సాలగ్రామత్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు. దేవాలయాలలో పంచాయతన మూర్తులకు శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.

పంచాయతనం లో ఉండే ఐదు మూర్తులు:

ఆదిత్యం – స్ఫటికం

అంబికాం – లోహం

విష్ణుం – సాలగ్రామం

గణనాథం – ఎర్రరాయి

మహేశ్వరం – బాణం


ఈ ఐదింటికీ పూజ చేయడాన్ని పంచాయతన పూజ అంటారు. వీటిలో ఏది మధ్యలో ఉంటే ఆ పంచాయతనం అంటారు. సాలగ్రామాన్ని మధ్యలో ఉంచితే ‘ఆదివిష్ణు పంచాయతనం’ అంటారు.

గండకీనదిలో లభించే సాలగ్రామాలు అనేక రకాలుగా ఉంటాయి. అవి లక్ష్మీనారాయణుడు, లక్ష్మీజనార్ధనము, రఘునాధము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రారాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీనృసింహము. ప్రతిరోజూ సాలగ్రామము, శంఖాలను పూజించేవారికి వైకుంఠం ప్రాప్తిస్తుందని పురాణకథనం.

మరికొన్ని విశేషాలు:

సాలగ్రామాల రంగు, వాటిమీద ఉండే ముద్రలను బట్టి ఎన్నో రకాలు ఉన్నాయి. అలాంటి 12 రకాల సాలగ్రామాలు ఉండి పూజింపబడే ఇల్లు 108 వైష్ణవ దివ్యక్షేత్రాలతో సమానం అని అంటారు. సాలగ్రామాలను కొంచెం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. వాటికి నిత్యం అభిషేకం, నైవేద్యం చేయాలి. అలా చేయలేనివారు వాటిని వేరెవరికైనా దానమివ్వడం మంచిది. ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కొందరు వాటిని పూర్తిగా నీళ్ళల్లో మునిగేలా ఉంచుతారు. దానిని జలవాసం అంటారు. ఏదైనా ఆలయంలో దానిని ఉంచవచ్చును. సాలగ్రామాలను కొనరాదు. ఇవి వంశపారంపర్యంగా రావాల్సిందే. అందుకే సాలగ్రామ దానం మహాదానం అని పెద్దలు అన్నారు.

 

Exit mobile version