సాధారణంగా గుడికి వెళ్ళతున్నామంటే మహిళలు పూలు, నగలు ధరించి బయలుదేరుతారు. నిండు ముత్తయిదువులా భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటారు. కానీ కలియుగ వైకుంఠం గా చెప్పుకునే తిరుమలలో మాత్రం పూలు పెట్టుకుని పోవడానికి వీలు లేదు.
తిరుమలలో అడుగు పెట్టే ఏ భక్తురాలు లేదా భక్తుడు పూలు పెట్టుకోరాదనే నియమం ఉంది. ఆ విషయాన్ని పదే పదే తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతూ ఉంటుంది. పైగా ప్రతి చెకింగ్ పాయింటులోనూ తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది పూలు తీసేయమని చెబుతుంటారు. క్యూలైన్లోనైతే పెట్టుకుని పూలను తీసేయించి మరి లోనికి పంపుతారు.
రోజూ వేలాది మంది దర్శించుకునే తిరుమలలో ఎందుకు అంత కఠినంగా నిబంధనలు పెట్టారు అసలు అక్కడ పువ్వులు పెట్టుకుంటే తప్పేంటి? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం… తిరుమలలో పూలు పెట్టుకోకపోవడం వెనుక ఓ కారణం ఉంది.
శ్రీవారు పుష్పాలంకార ప్రియుడు. శ్రీరంగం భోగమండపం అయితే, కంచి త్యాగమండపం అవుతుంది. అలాగే తిరుమల పుష్పమండపం అని పురాణాలు అలా చెబుతున్నాయి. అందుకే అక్కడ పూసిన ప్రతి పువ్వు స్వామి కోసమే పూస్తుందని నమ్ముతారు.
ఆ ప్రతి పువ్వు వేంకటేశ్వరుడి కోసమే వినియోగించబడాలని, మానవమాత్రులు ధరించరాదన్నది నియమం ఉంది. అందుకే అక్కడ మహిళలకైనా, పురుషులకైనా పుష్పాలంకరణ నిషిద్దం.