ఇతిహాస కథలలో కొన్ని విచిత్రమైన పాత్రలు ప్రత్యేకంగా చెప్పబడేవి. అందులో కొన్ని పాత్రలు ద్వంద్వ స్వభావాన్ని కనబరిస్తే మరికొన్ని పాత్రలు ఇరువర్గాలకు నష్టాన్ని కలిగించేలా వుండేవి. అటువంటి పాత్రలలో విచిత్రమైన రూపాన్ని కలిగిన అక్రూరుడు ఒకడు. మహాభారతంలో అక్రూరుడికి సంబంధించిన ప్రస్తావన ప్రచురించబడింది.
కంసుడు తన సోదరి అయిన దేవకికి పుట్టే ఎనిమిదో సంతానం తనను సంహరిస్తాడని తెలుసుకొని దేవికి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. ముందు పుట్టిన ఏడుగురిని పురిటి లోనే చంపేస్తాడు. కానీ కృష్ణుడు పుట్టిన వెంటనే అందరిని మాయ కమ్మేస్తుంది. వసుదేవుడు చిన్ని కృష్ణుణ్ణి రేపల్లెలో ఉన్న యశోద దగ్గర విడిచి వస్తాడు.
కృష్ణుని మేనమామ, క్రూరుడైన కంసునికి తనను చంపే పిల్లవాడు ఎక్కడో పెరుగుతున్నాడని, అతడిని నాశనం చేసేందుకు తను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయని తెలిసింది. ఒకనాడు కృష్ణుడు వచ్చి తనను వధిస్తాడనే భవిష్యవాణిని తరచు చుట్టూ ఉండే జనం అతనికి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఆ బాలుడు వ్రే పల్లెలో పెరుగుతున్నాడనే విషయం తెలుసుకొన్నాడు. కనుక ఏ విధంగానైనా బలరామునితో సహా మధురకు రప్పించి అతడిని కుట్ర పన్ని చంపించాలని నిర్ణయించుకున్నాడు.
బలరామ కృష్ణులను ఆహ్వానించేందుకు ఒక సాకుగా కంసుడు ధనుర్యాగాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ కాలంలో ధనుర్యాగాన్ని చేయటం సర్వసాధారణం. ధనుర్యాగానికి రాజు ప్రత్యేకంగా ఒక ధనుస్సును నిర్మింపచేస్తాడు. అది సామాన్యులకు లేపటానికి గాని, ఎక్కుపెట్టానికి గాని సాధ్యం కాని విధంగా తయారు చేయిస్తారు. అత్యంత అనుభవశాలి, వీరుడు అయిన వాడు మాత్రమే ఆ ధనుస్సు నారిని బిగించి ఎక్కుపెట్టగలిగే విధంగా ఆ ధనుస్సు నిర్మిస్తారు. ధనస్సుకు గల నారిని సంధించి నిర్ణీతమైన గురిని కొట్టగలగిన వ్యక్తిని విజేతగా ప్రకిస్తారు. సాధారణంగా ధనువును ఎక్కుపెట్టి నారి సంధించి బాణ ప్రయోగం చేయటం అనేది స్వయంవరాలలోగాని, ఇతర శౌర్య పరీక్షలలో గాని ఏర్పాటు చేస్తారు. (సీతాస్వయం వరం, ద్రౌపది స్వయం వరం ఇటువంటి పరీక్షలే) ఈ ధనుర్యాగ సందర్భంలో కంసుడు అనేకమైన ఇతర క్రీడలను, బాహు యుద్ధం అని పిలువబడే మల్లయుద్ధాన్ని కూడా ఏర్పాటు చేసాడు.
అతని ఆహ్వానానికి ఏదైనా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పడిపోతాడు. కొద్దిసేపటి తరువాత కృష్ణుడి ఆహ్వానం కోసం తగిన వ్యక్తిని ఎంపికచేయాలని భావించి, ఆ వ్యక్తి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. ఆ క్రమంలో కంసుడు, అక్రూరుని ఎంపిక చేస్తాడు. మొదట అక్రూరుడు శ్రీకృష్ణుడికి విరోధిలాగా ప్రవర్తించినప్పటికీ తరువాత అతని మీద భయం వున్నట్లుగా వ్యవహరించేవాడు.
శ్రీకృష్ణుడిని తన నగరానికి తీసుకుని రావాల్సిందిగా ఆదేశిస్తూ అక్రూరుని రథసారథిగా కంసుడు పంపిస్తాడు. అక్రూరుడు, శ్రీకృష్ణుడు దగ్గరికి చేరుకున్న తరువాత కంసుని కపటోపాయం గురించి హెచ్చరిస్తాడు. దాంతో కోపాద్రిక్తుడైన కృష్ణ.. వెంటనే కంసుని దగ్గరకు వెళ్లి, అతని అనుచరులను హతమారుస్తాడు. చివరికి కంసుడిని కూడా చంపేస్తాడు.
శ్రీకృష్ణుడు, సత్యభామ వివాహ సందర్భంలో కూడా అక్రూరుడి పాత్ర కనబడుతుంది. పూర్వం సత్యభామ తండ్రి అయిన సత్రాజిత్తు… తన కుమార్తెను (సత్యభామ) శతధన్వుడు అనే రాజుకిచ్చి వివాహం చేస్తానని ప్రకటిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల సత్యభామ పెళ్లి శ్రీకృష్ణుడితో జరిగిపోతుంది.
అది తెలుసుకున్న శతధన్వుడు కోపాద్రిక్తుడై అక్రూరుడితో కలిసి సత్రాజిత్తుని హతమారుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు.. శతధన్వుడిపై దండెత్తి, అతడిని యుద్ధంలో మతమారుస్తాడు. ఇది చూసిన అక్రూరుడు అక్కడి నుంచి పారిపోతాడు. కొంతకాలం తరువాత శ్రీకృష్ణుడు అక్రూరుడికి అభయమిచ్చి, తన ద్వారకలో వుండటానికి ఆశ్రయం కల్పిస్తాడు. అప్పటి నుండి ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయే వరకు అక్రూరుడు అక్కడే ఉన్నాడు .