Home Health  మద్యం తాగినప్పుడు హ్యాంగోవర్ ఎందుకు వస్తుంది? 

 మద్యం తాగినప్పుడు హ్యాంగోవర్ ఎందుకు వస్తుంది? 

0
మద్యపానం సేవనం అనేది చాలామంది మానసిక ఉల్లాసం కోసం చేస్తుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది, శరీరంలో ఉత్సాహం పెరుగుతుంది. అప్పుడు శరీరంలో ఉత్పత్తయ్యే డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. అయితే ఏదైనా పరిమితికి మించకూడదు.
తినేదైనా, తాగేదైనా… ప్రతిదానికీ ఒక పరిమితి అంటూ ఉంటుంది. ముఖ్యంగా ఆల్కహాల్ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, అతిగా ఆల్కహాల్ తీసుకుంటే మెదడులో క్రియాశీలత తగ్గిపోతుంది. నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ కూడా నెమ్మదిస్తుంది. అది కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయవచ్చు.
ఆల్కహాల్ ప్రభావం వివిధ దశలుగా ఉంటుంది. ఆఖరి దశ మరణం. మద్యం ఎంత ఎక్కువగా తీసుకుంటే దుష్ప్రభావాల తీవ్రత అంతగా పెరుగుతుంది. రక్తంలో ఆల్కహాల్ మెతాదు ఒక పరిమితి వరకు చేరుకున్నాక మొదట మాటల్లో తేడా వస్తుంది. నడకలోనూ మార్పు వస్తుంది. శరీర అవయవాల మధ్య సమన్వయం తగ్గుతుంది. తను చాలా తెలివిగల వ్యక్తినని అన్న భావన కలిగిస్తుంది. ఇంకా మద్యం తీసుకుంటూ ఉంటే కొంతసేపయ్యాక సోయి లేకుండా కిందపడిపోతారు. ఆలోచించే విచక్షణ కోల్పోతారు. అంటే, మెదడులో క్రియాశీలత బాగా తగ్గిపోతుంది.
ఇక్కడ గమనించవల్సింది ఏంటంటే ఆల్కహాల్ పరిమితి అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి కిక్కు చాలా తొందరగా, కొందరికి కాస్త ఆలస్యంగా రావచ్చు.  ఆల్కహాల్ రక్తనాళాలను వెడల్పు చేస్తుంది. శరీరంలోని ప్రతి అణువుకూ వెళ్తుంది. ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలోకి వెళ్లిన మద్యం సరిగా జీర్ణం కాదు. కొంత ఆల్కహాల్ నేరుగా జీర్ణాశయం నుంచే రక్తంలో కలుస్తుంది. ఆ రక్తం ద్వారా మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికీ వెళ్తుంది.
ఆ తర్వాత ఆల్కహాల్‌ కణాలను విరిచేసేందుకు కాలేయం ప్రయత్నిస్తుంది. అందుకోసం ఎంజైములను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. ఆ ఎంజైములు ఇతర పదార్థాల అణువులను విడగొడతాయి. మద్యం ఇథెనాల్‌తో తయారవుతుంది. ఇది మన శరీరంలో ఉన్న ఎంజైములను విరిచేసి వేరే రకాల రసాయనాలుగా మార్చేస్తుంది. వీటిలో కీలకమైనది ఎసిటాల్డిహైడ్. అది దీనిని మరింత విరిచేసి ఎసిటేట్ అనే రసాయనంగా మార్చేస్తుంది.
ఈ ఎసిటేట్ కొవ్వు, నీళ్లుగా మారిపోతుంది. ఎసిటాల్డిహైడ్ వల్ల హ్యాంగోవర్ ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మద్యంలో కలిసే కొన్ని రసాయనాల వల్ల హ్యాంగోవర్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాటిని కంజెనర్స్ అంటారు. వీటిలో చాలా రకాల కణాలు ఉంటాయి. ఇవి విస్కీ తయారయ్యే సమయంలో అందులో కలుస్తాయి. మద్యం ఎక్కువగా తాగినప్పుడు మాత్రమే, అవి ఉన్నట్లు అందరికీ తెలుస్తుంది.
చిక్కటి రంగు ఉన్న మద్యంలో ఈ గుణం ఎక్కువగా ఉంటుంది. అందుకే డార్క్ బర్బన్ మద్యం తాగితే, వోడ్కా కంటే ఎక్కువ మత్తుగా ఉంటుంది. అయితే దీని ప్రభావం ఒక్కో వ్యక్తిపై వేరువేరుగా కనిపిస్తుంది. తర్వాత తాగేవారి వయసు నుంచి వారు మద్యం తాగే లిమిట్‌పై కూడా హ్యాంగోవర్ ప్రభావం ఆధారపడుతుంది.
ఆల్కహాల్ ప్రభావం శరీరం నుండి నీటిని తీసేసుకుంటుంది. మద్యం సేవించిన తర్వాత తరచుగా టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఈ విధంగా.. ఆల్కహాల్ నేరుగా శరీరాన్ని తన కంట్రోల్‌లోకి తెచ్చకుంటుంది. మన శరీరంలోని నీరు టాయిలెట్‌ ద్వారా బయటకు వెళ్లి పోవడంతో మనకు కావల్సిన నీటి శాతం లేకండా పోతుంది దీంతో ఇబ్బందులు మొదలవుతాయి. వీటితోపాటు తలనొప్పి, దాహం, విశ్రాంతి లేకపోవడం వంటి అనేక రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి.
ఆల్కహాల్ శరీరంలోకి చేరి జీర్ణవ్యవస్థలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మొత్తాన్ని పెంచుతుందని సైన్స్ చెబుతోంది. తాగిన మత్తులో చాలాసార్లు వాంతులు, విరేచనాలు రావడానికి ఇదే కారణం. ఇది కాకుండా, ఆల్కహాల్ శరీరంలోని రసాయనాల (ఎలక్ట్రోలైట్స్) సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇవి నేరుగా మెదడుతో అనుసంధానించబడి ఉంటాయి. అందువల్ల తలనొప్పి, చికాకు మొదలవుతాయి.
శరీరంలోకి చేరే విషపూరిత, హానికరమైన మూలకాలను విచ్ఛిన్నం చేసే పనిని కాలేయం మాత్రమే చేస్తుంది. ఎక్కువ కాలం మద్యం సేవించడం వల్ల కాలేయం పని చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. క్రమంగా కాలేయం బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని తర్వాత కూడా  ఎవరైనా మద్యం సేవించడం మానేయకపోతే కాలేయంలో మంటతో సహా అనేక వ్యాధులు మొదలవుతాయి. ఇలా జరిగినప్పుడు కాలేయం సరిగ్గా పనిచేయడం ఆగిపోతుంది. శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే కాలేయం శాశ్వతంగా పనిచేయడం మానేస్తుంది. అందుకే మద్యం ఆరోగ్యానికి హనికరం అంటారు.

Exit mobile version