లాలాజలం ఎందుకు వస్తుంది? తక్కువైతే ఎదురయ్యే సమస్యలేంటి?

మంచి ఆహరం చూసినా లేదా మనకు నచ్చిన పదార్థాలు చూసినా నోట్లో లాలాజలం ఊరిపోతుంటుంది. అసలు ఈ లాలాజలం ఎక్కడ నుండి వస్తుంది? ఎందుకు వస్తుంది? అది లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి ఈరోజు తెలుసుకుందాం… నీళ్ళలా ఉండి, జిగటగా ఉండి, రంగులేనిద్రవ పదార్ధమే లాలాజలం. వివరంగా చెప్పాలంటే మన నోరుకి ఇరువైపులా ఉండే గ్రంధులనుంచి ఉత్పత్తి అయి మన నోట్లోకి పారే ఉమ్మినీరు.  దీనికి మరొక పేరు లాలాజలం. వాడుక భాషలో ఉమ్ము అని అంటారు.
ఇది మనం తీసుకునే ఆహారం జీర్ణం కావడానికి అత్యంతవసరం. దీనిలో 98% నీరు, 2% ఎంజైములు ఉంటాయి. ఎంజైములలో కెల్లా ముఖ్యమైనది ‘టైలిన్‌’. ఇది నమిలిన ఆహారాన్ని చక్కగా మారుస్తుంది. దీన్నే ‘మాల్టోస్‌’ అంటారు. దీని మరో ఎంజైమ్‌ ‘లిసోజిమ్‌’. ఇది నోటి ద్వారా శరీరంలో ప్రవేశించే బాక్టీరియాను నాశనం చేస్తుంది. అంతేకాకుండా ఆహారాన్ని బాగా నమిలితే నోటిలో బాగా ఊరే లాలాజలం అన్ననాళం గుండా ఆహారం ఉదరంలోకి సులువుగా చేరడానికి సహాయపడుతుంది.
నోటిని తడిగానూ ఉంచుతుంది. నోటిలో లాలాజలం నిరంతరము ఊరడము వలన నోరు, నాలుక ఎండిపోకుండా ఉంటాయి. పెదవులు పగిలి పోకుండా ఉంటాయి.  మన పళ్లని శుభ్రంగా ఉంచడం, నాలిక మరియు చిగురులు ఇంకా బుగ్గలు ఎండిపోకుండా తడిగా ఉంచడం, మనం తినే ఆహారంలో కొన్ని క్రిములు కడుపులోకి వెళ్లకుండా వాటిని చంపడం, ఆహారంలోని కొవ్వును ఎంజైముల ద్వారా కరిగించడం లాంటివి చేస్తుంది. నాలుకను రక్షించేది లాలాజలమే. లాలాజలము ఉండబట్టే ఆహారము రుచులు తెలుసుకోవడము వీలవుతుంది .
ఆహారాన్ని చూడగానే నాడులు లాలాజల గ్రంధులకు సంకేతాలను ఇస్తాయి. అప్పుడు గ్రంధుల నుంచి ‘లాలాజలం’ (ఎంగిలి,ఉమ్ము) స్రవించడం మొదలవుతుంది. ప్రతిరోజూ మన నోటి నుండి దాదాపుగా 1.5 లీటర్ల లాలాజలం ఊరుతుంది. మన జీవిత కాలములో ఒక వ్యక్తి లో ఊరే లాలాజము సుమారు 2 స్విమ్మింగ్ ఫూల్స్ నిండేంతగా ఉంటుందట.
సాధారణంగా లాలాజలం నోట్లో 0.1 /జశ కింద ఉత్పత్తి అవుతుంది. తినేప్పుడు ఇది 45 /జశకి పెరుగుతుంది. కొందరిలో ఇది మామూలుకంటే అధికంగా ఉత్పత్తి అవుతుంది. నోరు అంతా ఉమ్ముతో నిండి, పెదాల పక్కనుంచి కారుతూ వుంటుంది. దీనిని ‘చొంగ కార్చడం’ అంటాం. ఈ చొంగ కార్చడం నాలుగేళ్ల వయసు వరకూ కనిపించే సాధారణ విషయం. ఆ తర్వాత కూడా అంటే అప్పుడు ఆలోచించాల్సిన విషయం.
ఇలా చొంగ కార్చడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.
పక్షవాతం దీనికి కారణం కావచ్చు. ప్రమాదాల్లో మెదడుకి గాయం కలిగినపుడు ఈ చొంగ కార్చడం కొన్ని సందర్భాలలో చూస్తాం. కొన్ని మందుల వల్ల ఈ లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ప్రమాదం వుంది. వీరిలో ఆ మందుల వాడుక ఆపడం లేక తగ్గించడం చెయ్యాలి.
కొంతమంది కూర్చొని నిద్రపోయేవాళ్లలో, మంచంమీద బోర్లాపడుకున్నప్పుడు వారి దిండ్లమీద ఈ చొంగ కారడం చూస్తాం. దీనికి కారణం వీరి తల ఒక పక్కకి, కిందకి వాలిపోవడం, చాలా సేపు అలానే వుండడంవల్ల ఉమ్మినీరు ఏటవాలుగా ఉన్న దిశలో పారి పెదాల పక్కనుంచి కారుతుంది. వీళ్లు వీరి తలని సరైన స్థానంలో ఉంచుకొనే విధంగా వ్యవహరించాలి.
చొంగ కారడంవల్ల పెదాలు, గొంతుక కొంతమందిలో బట్టలు కూడా తడిసిపోతాయి. ఇలా చొంగ కారుస్తూ సమాజంలో ఎవర్ని కలవలేక, ఉద్యోగం లేక వ్యాపారం చెయ్యలేక, ఒక గదిలో ఉండిపోయి వీరు తీవ్ర ఒత్తిడికి మరియు మాంద్యానికి (డిప్రెషన్) గురవుతారు. చొంగ కారడంవల్ల పెదాలకి ఇన్‌ఫెక్షన్, చర్మం చిట్లడం లాంటివి జరగొచ్చు.
కొంతమందిలో లాలాజలం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నోరు పొడిబారిపోవడం అనే లక్షణం డయాబెటిస్ రోగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాబట్టి ఒకసారి మీరు డయాబెటిస్‌కు సంబంధించిన వైద్య పరీక్షలు చేయించుకోండి. ఇలా నోరు పొడిబారిపోవడాన్ని వైద్యపరిభాషలో ‘జీరోస్టోమియా’ అంటారు. నోటిలో తగినంత లాలాజలం లేకపోవడం వల్ల బ్యాక్టీరియా గూడుకట్టినట్లుగా ఒకేచోట అమితంగా పెరిగిపోతాయి. దీన్నే కొలొనైజేషన్ అంటారు.
ఇటీవల మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చక్కెర లేని చూయింగ్ గమ్స్, చక్కెర లేని మింట్ వంటివి నోటిలో తగినంత లాలాజలం ఊరేలా చేస్తాయి. దాంతోపాటు తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తీసుకుని గుటక వేస్తుండటం, కరిగే ఐస్‌ను చప్పరించడం కూడా నోరు పొడిబారడాన్ని తగ్గిస్తాయి. ఇలా నోరు పొడిబారేవాళ్లు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీలాంటి డ్రింక్స్‌ను చాలా పరిమితంగా తీసుకోవడం మంచిది, ఆల్కహాల్‌ను మానితే మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,520,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR