వయసు మళ్ళిన వారు తీర్థయాత్రలకు వెళ్తుంటారు. ఎందుకంటే సాధారణంగా బ్రహ్మదేవుడు తీర్ధాలలో విహరిస్తుంటాడు. అందులో పుష్కరతీర్ధం ప్రశిద్ధమైంది. దానిలో స్నానమాచరిస్తే పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఆ పుష్కరాల్లో పది సంవత్సరాలు నివసించిన బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. జంబూ మార్గంలోని అగస్త్యవటం అనే తీర్ధంలో స్నానం చేస్తే అశ్వమేధం చేసిన ఫలితం వస్తుంది. కణ్వాశ్రమం, ధర్యారణ్యంయ యాతిపతనం అనే పుణ్యక్షేత్రం దర్శించిన వారికి అన్ని పాపాలు పోతాయి. ఇంకా మహాకాళం, కోటి తీర్ధం, భద్రపటంలో శివుని పూజించినా నర్మదా నదీ స్నానం, దక్షిణ నదీ స్నా నం, జర్మణ్వతీ నదీ స్నానం ఎంతో పుణ్యాన్నిస్తుంది.
వశిష్టాశ్రమంలో ఒకరోజు నివాసం, పింగం అనే పుణ్యతీర్ధ సేవనం, ప్రభాస తీర్ధ స్నానం, వరదాన తీర్ధ స్నా నం, సరస్వతీ నదీ సంగమ స్నానం పుణ్యఫలాన్నిస్తుంది. ద్వారావతీ పురం లోని పిండారక తీర్ధంలో శివుని పూజించినా, సాగర సింధు సంగమంలో స్నానమాచరించినా, శంకు కర్ణేశ్వరంలో శివుని పూజించినా, వసుధారా, వసు సరంలో తీర్ధమాడినా, సింధూత్తమంలో స్నానం చేసినా, బ్రహ్మతుంగ తీర్ధం సేవించినా, శక్రకుమారీ యాత్ర చేసినా, శ్రీకుండంలో బ్రహ్మదేవుని సందర్శించినా, బడబ తీర్ధంలో అగ్ని దేవుని సేవించినా ఎన్నో గోదానాలు భూదానాలు చేసిన ఫలితం వస్తుంది.
శివుడు నివసించే దేవికాక్షేత్రాన్ని , కామ క్షేత్రాన్ని, రుద్రతీర్ధాన్ని, బ్రహ్మవాలుకాన్ని, దీర్గసత్రాన్ని సేవించిన వారికి అష్ట కామ్య సిద్ధి కలుగుతుంది. వినశనంలో మాయమైన సరస్వతీ నది నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భే ద లలో స్నానం చేసిన నాగలోక ప్రాప్తి కలుగుతుంది. శశియాన తీర్ధం స్నానం సహస్ర గోదాన ఫలం వస్తుంది. రుద్ర కోటిలో శివుని అర్చించిన కైలాస ప్రాప్తి లభిస్తుంది. ధర్మజా కురుక్షేత్రం, నైమిశ తీర్ధం, పుష్కర తీర్ధం అనేవి మూడూ పవిత్ర క్షేత్రాలు.
కురుక్షేత్రం సరస్వతీ నదికి దక్షిణంలో దృషద్వతీ నదికి ఉత్తరంలో ఉన్నది. ఆ కురుక్షేత్రంలో శమంతక పంచకం నడుమ రామహ్రదం అనే సరస్సు మధ్య పితామహుడు బ్రహ్మదేవుని ఉత్తరవేది అనే క్షేత్రం దర్శించిన వారికి సర్వపాపక్షయం కలుగుతుంది.
జమదగ్ని కుమారుడైన పరశురాముడు, తన గొడ్డలితో రాజులందరిని వధించినప్పుడు వారి రక్తం ఐదు పాయలుగా పారింది. వాటిని శమంతక పంచకం అంటారు. అందులో పరశురాముడు తన తండ్రికి తర్పణం విడిచాడు. అప్పుడు పితృదేవతలు సాక్షాత్కరించి వరాలు కోరుకొమ్మని అడిగారు. పరశురాముడు తనకు రాజుల ను సంహరించిన పాపం నశించాలి అని తనకు పుణ్యలోక ప్రాప్తి కలగాలని కోరుకున్నాడు. ఈ శమంతక పంచకం పవిత్రత సంతరించుకోవాలి అని కోరాడు. అప్పటి నుండి శమంతక పంచకం పుణ్యతీర్ధాలుగా భాసిల్లుతున్నాయి. వాటిలో స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కాయసోధనం, లోకోద్ధారం, శ్రీతీర్ధం, కపిల తీర్ధం, సూర్యతీర్ధం, గోభనం, శంఖినీ తీర్ధం, యక్షేంద్రతీర్ధం, సరస్వతీ నది, మాతృ తీర్ధం, బ్రహ్మావర్తం, శరవ ణం, శ్వావిల్లోమాపహం, మానుష తీర్ధం, ఆపగ నదీ తీర్ధం, సప్తఋషికుండం, కేదారం, కపిల కేదారం, సరకం, ఇలా స్పదం, కిందానం, కింజప్యం అనే తీర్ధాలలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యాలు కలుగుతాయి .
గంగా, సరస్వతీ సంగమంలో స్నానమాచరిస్తే బ్రహ్మ హత్యాపాతకం పోతుంది.శతం, సహస్రం అనే తీర్ధాలలో తపస్సు చేస్తే అంతులేని పుణ్యం వస్తుంది. రుద్రపత్ని అనే తీర్ధంలో స్నానం చేస్తే సర్వదు॰ఖ విముక్తి కలుగుతుంది. ఇన్ని ఫలితాలు, పుణ్యాలు పొందవచ్చును గనుకనే వయసు మళ్ళిన వారు జీవితంలో చేసిన పాపాలు తొలగిపోయి, పుణ్యలోకాలు సిద్ధిన్చాలని తీర్ధ యాత్రలు చేస్తారు.