Home Unknown facts ఉత్తర ద్వారం నుండి మనుషులే కాదు సకల దేవతలు దర్శించుకుంటారా ?

ఉత్తర ద్వారం నుండి మనుషులే కాదు సకల దేవతలు దర్శించుకుంటారా ?

0

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. అందులో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.

ముక్కోటి ఏకాదశివిష్ణు పురాణంలో వైకుంఠ ఏకాదశి గురించి ఒక కథ ఉంది. పూర్వం ముర అనే రాక్షసుడు ప్రజలను, ఋషులను, దేవతలను హింసిస్తుండేవాడు. ముర పెట్టే బాధలకు తాళలేక, రాక్షసుని బారి నుంచి రక్షించమని దేవతలు విష్ణువును శరణు వేడుకొంటారు. మురను సంహరించాలంటే ప్రత్యేక మైన అస్త్రం కావాలని, అందుకు కొంతకాలం వేచియుండమని చెప్పి దేవతలను పంపి, బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించి విశ్రమిస్తాడు. గుహలో విశ్రాంతి తీసుకుంటున్న విష్ణువును సంహరించడానికి వచ్చిన మురను, విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి సంహరిస్తుంది. శ్రీ మహావిష్ణువు నుండి ఉద్భవించింది శ్రీ మహాలక్ష్మి అంటారు. అలా ఉద్భవించిన శక్తీకి శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేస్తాడు. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అర్చించి, ఉపవాసం, జాగారం, దాన ధర్మాలు చేసినట్లయితే వారి పాపములను హరిస్తానని ఏకాదశికి వరమిస్తాడు. అన్నీ ఏకాదశి పర్వదినాలు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పర్వదినాలు.

శ్రీమహావిష్ణువు సర్వాలంకార భూషితుడై వైకుంఠoలో ఉత్తర ద్వారం వద్దకు విచ్చేయగా అక్కడ సకల దేవతలు ఆయనను సేవించే రోజు కనుక పవిత్రమైన ఈ ఏకాదశికి ‘వైకుంఠ ఏకాదశి’ అనే పేరు వచ్చింది. అందువల్ల ఈరోజు వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. ఈ ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం.

ఈరోజు శ్రీమహావిష్ణువుతో పాటు ముప్పైమూడు కోట్ల దేవతలు భూమికి దిగివస్తారని మన పెద్దలు చెపుతారు. ఈనాడు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని దక్షిణాయనంలో చనిపోయిన పుణ్యాత్ములంతా ఈరోజు స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం. ఇక ఈరోజు భారతదేశంలోని వైష్ణవ ఆలయాలు అన్నీ అత్యంత అద్భుతంగా అలంకరించి శ్రీమహావిష్ణువును కొలుస్తూ అనేక చోట్ల ‘వైకుంఠ ఏకాదశి’ వ్రతం నిర్వహిస్తారు.

ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఉపవాశం ఉంటే వచ్చే మొత్తం ఫలితం కన్నా ‘ముక్కోటి ఏకాదశి’ రోజున ఉపవాసం ఉంటే 24 ఏకాదశిల ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది అని అంటారు.

 

Exit mobile version