ఉత్తరాంచల్ రాష్ట్రం అనగానే మనకి చార్ ధామ్ యాత్ర గుర్తుకు వస్తుంది. చార్ ధామ్ అంటే నాలుగు పుణ్యక్షేత్రాలు అని అర్ధం. అవి యమునోత్రి, గంగోత్రి, కేదార్నాద్, బదరీనాధ్. ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ భూమిని దేవభూమి అని అంటారు. ఇక చార్ ధామ్ యాత్ర అనేది యమునోత్రి తో మొదలై భారీనాధ్ తో ముగిస్తుంది. మరి యమునోత్రి వెళితే అక్కడ దర్శించాల్సిన ప్రదేశాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
యమునోత్రి అంటే యమునా నది జన్మస్థలం అని అంటారు. కానీ యమునోత్రి అంటే యమునా జన్మస్థలం కాదు, యమునా ఉత్తర అంటే యమున నేల మీదకు ఉత్తరించిన, అంటే దిగిన స్థలం అని అర్ధం. ఇక్కడ యమునాదేవి ఆలయం ఉంది. ఇది సముద్రమట్టానికి 3293 మీ. ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పైన కలదు.
ఇక్కడ సమీపంలో ఖార్సలి అనే గ్రామం ఉంది. ఇక్కడ దివ్యశిల అనబడే పవిత్ర ఫలకం యమునోత్రి ఆలయానికి సమీపంలో ఉంది. అయితే భక్తులు ఈ ఆలయానికి వెళ్లేముందు ఈ ఫలాకానికి భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇక్కడ యమునానది 20 లేక 25 అడుగుల వెడల్పు మాత్రం ఉంటుంది. ఈ ఆలయ సమీపంలో ఒక ప్రదేశంలో చల్లటి నీరు, సలసల మసిలేనిరు ప్రక్కప్రక్కనే ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా ఇక్కడ రెండు ప్రవహించడం అనేది ఇప్పటికి దైవ రహస్యంగానే ఉంది. ఇక ఇక్కడ దివ్యశిల, సూర్యకుండం అనే ప్రదేశాలను తప్పకుండ దర్శిస్తారు.
దివ్యశిల:
ఈ ప్రదేశంలో ఉన్న యమునానదిలో స్నానం చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇక్కడ సుమారు 20 నుండి 30 అడుగుల లోతు ఉండటమే కాకుండా నది ఉదృతంగా ప్రవహిస్తుంది. స్నానము చేయాలనుకునేవారు అక్కడ పక్కన ఉన్న ఉష్ణకుండం లో స్నానం చేయవచ్చు. ఇక ఇక్కడ మూడు అడుగుల ఎత్తులో ఉన్న రతి పలక మీద యమునమాత మూర్తి చెక్కి ఉంది. అయితే యమున సూర్య భగవానుని కుమార్తె. అయితే సూర్యదేవుడు తన కుమార్తె మీద ప్రేమతో తన ప్రచండ కిరణాల నుండి ఒక కిరణాన్ని ఆమెకి ప్రసాదించటాడా. ఆ ఒక్క కిరణం మాత్రమే కలిగి ఉన్న నీటిధార ఈ శిలాఫలకం అడుగు నుండి పైకి చిమ్ముతూ ఉంటుంది. ఆ నీరు తాకడానికి కూడా వీలు లేనంతగా మరుగుతూ ఉంటుంది. అందుకే ఈ శిలాఫలకాన్ని దివ్యశిల అని అంటారు. అయితే ముందుగా ఇక్కడ పూజచేసి ఆ తరువాత యమునాదేవిని దర్శనం చేసుకోవాలని చెబుతుంటారు.
సూర్యకుండం:
ఈ దివ్యశిలను అనుకోని ఒక నాలుగు అడుగుల దూరంలో మరొక చిన్న ఉష్ణకుండం ఉంది. దీనినే సూర్యకుండం అంటారు. అయితే సుమారు 25 గజాల చదరపు స్థలంలో ముందు ఒక చిన్న వరండా, దానివెనుక చిన్న గర్భగుడి, ఆ గుడిలోపల యమునానది మూర్తి నల్లరాతి శిల్పం ఉంటుంది.