మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ అష్టగణపతి ఆలయాలకు ఎంతో విశిష్టత అనేది ఉంది. ఈ అష్ట గణపతి క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకోవాలని నియమం కూడా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పంచారామ క్షేత్రాలను దర్శిస్తే ఎలాంటి ముక్తిదాయకమో ఈ ఆలయాలని కూడా ఆవిధంగా ఒక వరుసలో దర్శించుకోవడం ఒక నియమం. మరి ఆ అష్ట గణపతి క్షేత్రాలు ఏంటి? ఆ ఆలయాల్లో ఉన్న దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బల్లాలేశ్వర గణపతి:
పూణెకి 110 కి.మీ. దూరంలో పాలి అనే క్షేత్రంలో బల్లాలేశ్వర గణపతి కొలువై ఉన్నాడు. ఇక్కడ వెలసిన గణపతిని భక్తులు బాలగణపతిగా కొలుస్తారు. అయితే బల్లాల్ అనే భక్తుడి భక్తికి మెచ్చిన గణపతి అతడికి ప్రత్యక్షమై ఈ చోట వెలిశాడని పురాణం. అందుకే ఈ ఆలయంలో గణపతి బళ్లాలేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడని చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే తూర్పుముఖంగా వెలసిన స్వామి విగ్రహం పైన దక్షిణాయన కాలంలో సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.
వరద వినాయకుడు:
మాహాడ్ క్షేత్రంలో వెలసిన స్వామిని భక్తులు వరద వినాయకుడిగా పిలుస్తుంటారు. ఇక్కడ వెలసిన స్వామివారు ఎంతో మహిమ గల వారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఆలయంలోని గర్భగుడిలో ఉన్న అఖండ దీపం వందల ఏళ్లుగా వెలుగుతూనే ఉందని స్థానికులు చెబుతుంటారు. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు రుక్మగంధుడు. ఆ రాజు ఒక వాచకనవి అనే ఋషిని కలువడానికి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజు వైభవాన్ని చుసిన ఋషి యొక్క భార్య ముకుంద ఆ రాజు పైన మనసు పడగ దానికి అంగీకరించకుండా ఆ రాజు అక్కడి నుండి వెళ్లిపోగా, అదే సరైన సమయం అని భావించిన ఇంద్రుడు ఆ రాజు రూపంలో ముకుంద దగ్గరికి వెళ్లగా వారి కలయిక వలన ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పెరిగి పెద్దయిన తరువాత తన జన్మ రహస్యం తెలుసుకొని అందరి పాపాలు తొలగిపోవాలని వినాయకుడిని ప్రార్ధించగా అతడి భక్తికి మెచ్చిన వినాయకుడు అతడు కోరిన వరాన్ని ఇచ్చి ఇక్కడే స్వయంభువుగా వెలిసి పూజలందుకుంటున్నాడని స్థల పురాణం.
చింతామణి గణపతి:
షోలాపూర్ లోని పూణే రోడ్ మార్గంలో థేవూర్ అనే క్షేత్రంలో వినాయకుడు చింతామణి గణపతి గా పూజలను అందుకుంటున్నాడు. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం కపిల మహర్షి దగ్గర కోరిన కోరికలను క్షణంలో తీర్చే చింతామణి అనే రత్నం ఉండేది. అయితే ఈ రత్నాన్ని కపిల మహర్షి వినాయకుడిని ప్రార్ధించి పొందాడు. ఇక ఈ రాజ్యాన్ని పాలించే మహారాజు ఒకరోజు ఆ ముని ఆశ్రమానికి వచ్చాడు. ఇలా అనుకోకుండా తన ఆశ్రమానికి వచ్చిన రాజు కోసం చింతామణి సహాయంతో క్షణంలో ఆ రాజు కోసం విందుని ఏర్పాటు చేయగా, ఆ రత్నం గొప్పతనం తెలుసుకున్న ఆ మహారాజు కపిల మహర్షికి తెలియకుండా దానిని అపహరించాడు. అప్పుడు వెంటనే ఆ ముని వినాయకుడిని ప్రార్ధించగా ఆ రాజుని సంహరించి ఆ మణిని మళ్ళీ ఆ మహర్షికి అందచేసాడు. అందువల్లే ఇక్కడ వినాయకుడు చింతామణి గణపతి గా పూజలను అందుకుంటాడని స్థల పురాణం.
మయూరేశ్వర గణపతి:
పూణే జిల్లా బారామతి తాలూకాలోని మోర్ గావ్ గ్రామంలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు మయూరేశ్వర గణపతి గా పూజలని అందుకుంటున్నాడు. ఈ ఆలయంలో వినాయకుడు తన తమ్ముడు అయినా సుబ్రహ్మణ్యస్వామి వాహనమైన మయూరాన్ని అధిష్టించి ఉన్నాడు. ఇక పురాణానికి వస్తే, పూర్వం సింధూరాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలోని ప్రజలను తీవ్రంగా హింసిస్తుండేవాడు. ఆ రాక్షసుడి బారినుండి కాపాడమని మునులు అందరు కలసి దేవతలను ప్రార్ధించగా అప్పుడు వినాయకుడు మయూర వాహనాన్ని అధిష్టించి భూమిపైకి వచ్చి ఆ రాక్షసుడిని సంహరించాడు. అందువలనే ఇక్కడ వెలసిన వినాయకుడిని భక్తులు మయూరేశ్వర గణపతి గా కొలుస్తారు.
సిద్ది వినాయకుడు:
ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం శ్రీమహావిష్ణువు మధు కైటభులనే రాక్షసుడితో యుద్ధం చేసి వినాయకుడి సహాయాన్ని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు వినాయకుడు ఆ యుద్ధ భూమిలో ప్రత్యేక్షమై విష్ణువు సహాయంతో ఆ రాక్షసుడిని సంహరించాడు. ఇలా వినాయకుడి పాద స్పర్శతో కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. ఇలా తనకి సహాయాన్ని చేయడం చూసి ఆనందించిన శ్రీమహావిష్ణువు తానే స్వయంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్టించాడని స్థల పురాణం. ఈ ఆలయం ఒక ఎత్తైన కొండపైన ఉంటుంది. స్వయంభువుగా వెలసిన ఇక్కడ ఆలయంలోని స్వామివారి విగ్రహం మిగతా ఆలయాలకు భిన్నంగా స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఈవిధంగా వెలసిన స్వామివారు చతుర్భుజ గణేశుడిగా, సిద్ధివినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు.
మహాగణపతి:
ఈ ఆలయంలో సిద్ది, బుద్ధి సమేతంగా పద్మంలో కొలువైన రంజాన్ గావ్ లో వెలసిన వినాయకుడు మహాగణపతిగా పూజలను అందుకుంటున్నాడు. ఇక పురాణానికి వస్తే, పూర్వం త్రిపురాసురుడు లోకకంటకుడిగా మారితే ఒకసారి శివుడు అతడితో తలపడి ఓడిపోయాడు. అప్పుడు నారద మహర్షి వినాయకుడే స్వయంగా ప్రసాదించిన సంకట మోచన గణపతి స్తోత్రాన్ని శివుడికి తెలిపి ఆ గణనాధుడిని పూజించి అనుగ్రహం పొందమని చెప్పాడట. అప్పుడు శివుడూ విజృభించి త్రిపురాసురుణ్ణి సంహరించాడని పురాణం. ఇక గణేశపురాణం ప్రకారం తన విజయానికి కారణమైన వినాయకుడి విగ్రహాన్ని శంకరుడే స్వయంగా ఇక్కడ ప్రతిష్టించాడని గణేశపురాణం ద్వారా తెలుస్తుంది.
విఘ్న వినాయకుడు:
ఒజుర్ ప్రాంతంలో ఒకప్పుడు విఘ్నసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు అందరిని పీడిస్తూ మునులకు జపం ఆచరించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండేవాడు. ఇక ఆ రాక్షసుడి బాధ భరించలేక మునులు వినాయకుడిని ప్రార్ధించగా, వినాయకుడు ప్రత్యేక్షమై విఘ్నసురుడి తో యుద్ధం చేస్తాడు. వినాయకుడితో యుద్ధం చేసే అంత శక్తి లేదని గ్రహించి విఘ్నసురుడు స్వామిని శరణు కోరి తన పేరుతో విఘ్నేశ్వరుడిగా ఇక్కడే కొలువై ఉండలని కోరి స్వామికి ఆలయాన్ని కట్టించారని పురాణం.
గిరిజాత్మజ వినాయకుడు:
గిరిజాత్మజూడంటే పార్వతీదేవి కుమారుడు అని అర్ధం. ఈ స్వామివారి దర్శనం చాలా కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఒక ఎత్తైన కొండ గుహలో స్వామివారు కొలువై ఉన్నారు. ఈ ప్రాంతంలో పార్వతీదేవి పుత్రుడి కోసం 12 సంవత్సరాలు తపస్సు చేసింది. అయితే పార్వతీదేవి నలుగు పిండితో చేసి రూపం పొందిన బాలగణపతి కౌమార ప్రాయం వచ్చే వరకు తల్లితో కలసి ఇక్కడే ఉన్నారని పురాణం. ఇక ఇక్కడ విశేషం ఏంటంటే, నలుగు పిండితో విగ్రహాన్ని చేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా ఈ ఆలయంలో కూడా స్వామివారి విగ్రహం అలానే ఉంటుందట.
ఈవిధంగా మహారాష్ట్రలో కొలువై ఉన్న ఈ అష్టగణపతి క్షేత్రాలను ఒక వరుసలో దర్శించుకుంటే ముక్తిదాయకం అని చెబుతారు