కేదారవ్రతం ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ కథ గురించి తెలుసుకోవాల్సిందే

0
301

కేదారేశ్వర వ్రతం హిందువులు ఆచరించే ఉత్కృష్టమైన వ్రతము. కార్తీక మాసములో చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోని శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.

కేదారవ్రతంకేదారవ్రతం ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ కథ గురించి తెలుసుకోవాల్సిందే… ఒకనాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉన్నాడు. సిద్ధ – సాధ్య – కింపురుష – యక్ష – గంధర్వులు శివుని సేవిస్తున్నారు. దేవముని గణములు శివుని స్తుతిస్తున్నారు. ఋషులు – మునులు – అగ్ని – వాయువు – వరుణుడు – సూర్యచంద్రులు – తారలు – గ్రహాలు – ప్రమదగణాలు – కుమారస్వామి – వినాయకుడు – వీరభద్రుడు – నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు. రసాల – సాల – తమలా – వకుళ – నరికేళ – చందన – పనస – జంభూ వృక్షములతోను చంపక – పున్నాగ – పారిజాతాది పుష్పాదులతోను మణిమయ మకుట కాంతులతో చెలువొందు నదీ నదపరతములతోను చతుర్ధశ భువనాలు పులకిస్తున్నాయి.

కేదారవ్రతంఅలాంటి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడు శివభక్త శ్రేష్టుడు, ఆనంద పులకితుడై నాట్యమాడుతున్నాడు. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను, శివుడ్ని మెప్పిస్తున్నాడు. శివుడాతనిని అభినందించి అంకతలమున గల పార్వతిని వీడి సింహాసనము నుండి లేచి భృంగురిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునుగా భృంగి మొదలుగాగల వందిమాగాదులు శివునకు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతీ భర్తను చేరి నాథా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించారు. ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్నెలా వేరు పరుస్తారు అని ప్రశ్నించింది.

కేదారవ్రతంఅప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకొని దేవీ పరమార్ధ విదులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగచేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై యుండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయుటకు పార్వతి నిశ్చయించుకొన్నది. కైలాసమును వదలి శరభ శార్దూల గజములు గల నాగ గరుడ చక్ర సస్యశ్యామలమైనట్టి గౌతమాశ్రమానికి వచ్చింది.

కేదారవ్రతంఆశ్రమవాసులామెను చూసి అతిథి మర్యాదలు చేసి తల్లీ నీవెవ్వరవు? ఎవరిదానవు? ఎచటనుండి వచ్చితివి? నీరాకకు గల కారణమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వాతి మిక్కిలి ఆనందించినదై యఙ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్టాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను హిమవంతుని పుత్రికను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని. శివుని సతిగా నా నాధునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయ సంకల్పించుకొన్నాను. ఇందు కోసమే మీ ఆశ్రమానికి వచ్చానని అన్నది పార్వతి. దానికోసం తగిన వ్రతమును నాకు ఉపదేశించమని పార్వతి వారిని కోరుకున్నది.

కేదారవ్రతంఅందుకు గౌతముడు పార్వతీ ఉత్తమ వ్రతమొకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవా వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవచ్చని చెప్పాడు గౌతముడు. వ్రతవిధానమును వివరించమని పార్వతి గౌతముడ్ని కోరింది. జగజ్జననీ ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో అష్టమియందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములగు ఏకవింశతి దారముతో చేతికి తోరముని ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసముండాలి. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాలి. ఇలా వ్రతమును ఆరంభించిన నాటినుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించాలి.

కేదారవ్రతంధాన్యరాశిని పోసి అందులో పూర్ణకుంభము నుంచి ఇరవైఒక్క సార్లు సూత్రమును చుట్టి పట్టువస్త్రముతో దానిని కప్పియుంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవీ ఇరవై ఒక్కమంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య – భోజ్య, నైవేద్యాదులు కదళీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తి పరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్టసిద్ధిని కలుగచేయునని గౌతముడు పార్వతికి వివరించాడు.

కేదారవ్రతంగౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తనమేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ సంతుష్టాంగ తరంగయై భర్తతో నిజనివాసము కైలాసముకు చేరెను. కొంతకాలానికి శివభక్తుడైన చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విని మనుష్యలోకానికి దానిని తెలిసేలా చేయాలనీ భావించి ఉజ్జయినీ నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదారవ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు.

తరువాత చాల మంది ఈ వ్రతం చేసి శివానుగ్రహానికి పాత్రులయ్యారు. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేస్తారో, ఎవరైనా ఈ కథ చదివిన, విన్న అట్టివారు ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివసాన్నిధ్యము పొందుతారు.

 

SHARE