Home Unknown facts ఒక కొండ మీద దాదాపుగా 900 ఆలయాలు ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది?

ఒక కొండ మీద దాదాపుగా 900 ఆలయాలు ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది?

0

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే ఒకేదగ్గర రెండుకంటే ఎక్కువ ఆలయాలు మనకి దర్శనం ఇస్తుంటాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, ఒక కొండ మీద దాదాపుగా 900 ఆలయాలు అనేవి ఒకేచోట ఉన్నాయి. మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? ఆ ఆలయాల గురించి కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గుజరాత్ రాష్ట్రం, భావనగర్ జిల్లా, పాలిటన సిద్ధక్షేత్రంలో రెండు పర్వత శిఖరాల పై తెల్లటి పాలరాతితో 873 జైనదేవాలయాలను నిర్మించారు. ఇది జైనులకు పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ ఆలయాలు వెలసిన పర్వతాన్ని శత్రూంజయ పర్వతాలు అని పిలుస్తారు. వీటి నిర్మాణానికి సుమారుగా 900 సంవత్సరాలు పట్టింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో ప్రపంచానికే ఆదర్శప్రాయంగా హిందూ దేవతలైన సరస్వతి, హనుమాన్, శివుడి ఆలయాలు, ముస్లింలకు చెందిన దర్గాని కూడా నిర్మించారు.

ఈ శత్రూంజయ పర్వతం చుట్టూ శత్రూంజయ నది ప్రవహిస్తుంది. ఇక్కడ జైన తీర్థంకరులు మోక్షం పొందారని జైనుల నమ్మకం. అందుకే దీన్ని జైనులు పరమ పవిత్రంగా భావించడమే కాకుండా సిద్ధక్షేత్రం అని వ్యహరిస్తారు. పర్వతాగ్రంపైన ప్రధాన దేవాలయాన్ని మొట్టమొదటి జైన తీర్థంకరులు రిషభ దేవుడికి అంకితమిచ్చారు. ఈయన్నే ఆదినాధుడిగా వ్యవహరిస్తారు. ఈయన శ్రీరాముడి వంశానికి చెందినవాడని ఈ పర్వతాన్ని 73 సార్లు సందర్శించాడని చెబుతారు.

ఇక ఇన్ని దేవాలయాలకు ఈ ప్రదేశం నిలయం కనుకే ఈ పట్టణాన్ని ఆలయ నగరం అని అంటారు. శత్రూంజయ నదిలో స్నానం చేస్తే వివిధ రకాల వ్యాధులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే పౌర్ణమి నాడు దేశం నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఈ నదిలో స్నానం చేసి ఆలయంలో పూజలు జరుపుతారు. అయితే శత్రూంజయ తీర్థంలోని జైన దేవాలయంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. వీరు కూడా ఇక్కడే మోక్షం పొందారని చెబుతారు.

Exit mobile version