శ్రీరాముడు వెలసిన ప్రతి ఆలయంలో కూడా ధనుర్బాణాలతో దర్శనమిస్తాడు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే రాముడు యోగభంగిమలో భక్తులకి దర్శనం ఇస్తుంటాడు. మరి ఇక్కడ రాముడు ఆలా దర్శనం ఇవ్వడం వెనుక పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని, అడయార్ నుంచి వండవాసికి నెడుంగుణం యోగరామాలయం ఉంది. రాముడిలా యోగభంగిమలో అగుపించే ఆలయాలు ఈ ప్రాంతంలో మూడున్నాయి. వాటిలో నెడుంగుణంలోని రామాలయమే పెద్దది, ప్రఖ్యాతి పొందినదిగా చెబుతారు. ఇక ఆలయ పురాణానికి వస్తే, రావణ సంహారానంతరం రాముడు లంకానగరానికి విభీషణుడిని రాజుగా చేసి, సీత, లక్ష్మణుడు, ఇతర పరివారంతో కలసి అయోధ్యకు తిరిగి వెళుతున్నాడు. అప్పుడే ఆయనకు తన కోసం ఎంతోకాలంగా కలియానది నది ఒడ్డున శుకమహర్షి తపస్సు చేస్తున్నట్లు తెలిసింది. నిర్ణీత సమయంలోగా అయోధ్యానగరానికి చేరుకోకపోతే భరతుడు ప్రాయోపవేశం చేసే ప్రమాదం ఉంది. అయినప్పటికీ భక్తసులభుడైన రాముడు, శుకుడికోసం తన ప్రయాణాన్ని ఆపుకుని మరీ శుకాశ్రమానికి వెళ్ళాడు.తన దర్శన భాగ్యంతో ఆయనను అనుగ్రహించి, ఆతిథ్యం స్వీకరించి, కొద్దిసేపు విశ్రమించి, మునికి ఆనందం చేకూర్చి, ఆయన అనుమతి తీసుకుని ఆనకనే అయోధ్యకు వెళ్లాడు. నేదుం అంటే వినయము లేదా సౌశీల్యం. గుణం అంటే లక్షణం అని అర్థం. అందుకే ఈ ప్రాంతానికి నేదుంగుణం అనీ, ఇక్కడి రాముడికి నేడుంగుణ రాముడనీ పేరు స్థిరపడింది. ధీరకాచలం కొండలలో పుట్టిన కలియా నది అక్కడి నుంచి చెంగల్పట్టులోగల మధురాంతక సరస్సు వరకు ప్రవహించి అంతటితో అంతమవుతుంది.ఈ ఆలయం చెంత శుకమహర్షి ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో శుకబ్రహ్మ ఆసీనుడై ఉండగా, హనుమంతుడు ధర్మశాస్త్రాలను చదివి, రామలక్ష్మణులకు, శుకునికి వినిపిస్తూ ఉన్నట్లుగా ఉన్న అరుదైన విగ్రహాలను చూడవచ్చు. సాధారణంగా రాముడి పాదాల వద్ద వినయవిధేయతలతో కూర్చుని కనిపించే హనుమంతుని చూస్తాము కానీ, ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా హనుమంతుడు ఏదో చదివి వినిపిస్తుండగా, రాముడు ఎంతో శ్రద్ధగా, సావధానంగా ఆయా శాస్త్రవిషయాలను ఆలకిస్తున్నట్లుగా ఉన్న ఈ అరుదైన దృశ్యం మనస్సును హత్తుకుంటుంది. ఆలయ విషయానికి వస్తే, పల్లవుల కాలంనాటి ఈ ఆలయం గోడలు ఎంతో పెద్దవి, ఈ ప్రాకారంలోనికి ప్రవేశించగానే ఎల్తైన, అందమైన ద్వారపాలక విగ్రహాలు కనువిందు చేస్తాయి. జీవకళ ఉట్టిపడుతూ, నల్లటి విగ్రహాలతో, నూత్న వస్త్రాలతో నిజంగానే ఎవరో దివ్యపురుషులు వచ్చి నిలబడి ఉన్నారేమో అనుకునేంత అద్భుతమైన శిల్పసౌందర్యం చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఎదురుగా గర్భాలయంలో రామచంద్రమూర్తి తన సోదరుడు లక్ష్మణుడు, ధర్మపత్ని సీతా మహాసాధ్వితో యోగభంగిమలో అభయముద్రతో దర్శనమిస్తాడు. ఆయన పాదాల చెంత హనుమంతుడు కూర్చుని ఉంటాడు. లక్ష్మణుడు మామూలుగానే ధనుర్బాణాలతో కనిపిస్తాడు.ఇక్కడ ఆలయంలో అనుసంధానంగా శుకతీర్థమనే కోనేరుంది. ఈ కోనేటిలోని నీటినే పూజాకార్యక్రమాలకు ఉపయోగిస్తారు. ఇక్కడ ఎంతోకాలంగా ఉన్న ఉత్సవ మూర్తుల విగ్రహాలు అపహరణకు గురి కావడంతో భక్తులు తామే స్వయంగా విగ్రహాలను ఏర్పాటు చేశాక, తిరిగి వెనకటి ఉత్సవ విగ్రహాలు యథావిధిగా కనిపించడంతో రెండు రకాల ఉత్సవ విగ్రహాలను ఆలయంలో అగుపిస్తాయి. ఇలా శ్రీరాముడు యోగభంగిమలో దర్శనమిచ్చే ఈ ఆలయానికి భక్తులు ఎప్పడు అధిక సంఖ్యలో వస్తుంటారు.