పరమశివుడు యొక్క 5 పుణ్యక్షేత్రాలను పంచారామాలు అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించే సమయంలో తారకాసురుని నోట్లో ఉన్న శివలింగం ముక్కలై 5 ప్రదేశాల్లో పడింది వాటినే పంచారామాలు అని పిలుస్తున్నారని పురాణం. మరి అందులో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలోని శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరాన గల అమరావతి గ్రామము నందు అమరేశ్వరుని ఆలయం కలదు. కృష్ణవేణి నదీ తీరమున త్రినేత్రుడైన స్వామివారు మూడు గొప్ప ప్రాకారములతో నిర్మించిన మహాక్షేత్రంలో కొలువుదీరి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే అమరేశ్వరుడుగా కొలువై ఉన్నాడు. ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురం కలవు.
అయితే ఈ ఆలయములో శివలింగం చాలా పొడవుగా ఉంటుంది. దీనికి ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం ఈ శివలింగం అనేది పెరుగుతూ ఉండేదంటా. అందువలన గుడిని ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగు చెందిన అర్చకులలో ఒకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అప్పటినుండి శివలింగం ఎదుగుదల అనేది ఆగిపోయింది. ఈ కథనానికి నిదర్శనంగా తెల్లని శివలింగం పై ఎర్రని చారికలను కూడా చూపిస్తారు. అవి మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలని చెప్పుతారు. ప్రస్తుతం పై అంతస్తులోని శివలింగ భాగాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోవటానికి అనుమతిస్తున్నారు.
ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం తారకుడనే రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతడు శివుడి భక్తుడు. ఆ భక్తితో అతడు శివుని మెప్పించి వరంగా ఆత్మలింగాన్ని పొందాడు. ఆ ఆత్మలింగం ధరించిన అతడు బలగర్వితుడై మానవులనేగాక, దేవతలని కూడా హింసించసాగాడు. ఆ హింసని భరించలేక వారు శివుని దగ్గరికి వెళ్లి తమని రక్షించమని కోరారు. వారి ప్రార్థలని ఆలకించి శివుడు వెంటనే తన కుమారుడైన కుమారస్వామిని నీవు వెళ్ళి తారకాసురుని వధించి,దేవతలను కాపాడమని ఆజ్ఞాపించాడు.
ఆవిధంగా తండ్రి అజ్ణానుసారం కుమారస్వామి వెళ్ళి తారకాసురుని ఎదిరించాడు. ఈ విధంగా వారిద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుండగా, కుమారస్వామి తారకాసురుని మీద ప్రయోగించిన అస్త్రాలన్నీ విఫలం అవ్వడంతో కారణం ఏంటని అలోచించి ఆత్మలింగాన్ని కలిగి ఉన్నాడు కనుక శివుని ప్రార్ధించి ఒక దివ్యాస్త్రముని సంధించి తారకాసురుని మీద ప్రయోగించాడు. ఆ అస్త్రము తారకాసురుడు ధరించిన ఆత్మలింగమును అయిదు ముక్కలుగా ఛేదించి, తరువాత వానిని వధించింది. ఆ అయిదు ముక్కలు చెదిరి శివలింగములై అయిదు చోట్ల పడినవి. ఆ శివలింగం పడినచోట్లు ఆరామాలుగా పేరు గాంచాయి. అందులోనుండి పడిన ఒక ఆరామం ఇప్పటి అమరావతి. అయితే అమరావతి ఆరామమందు పడిన శివలింగమును ఇంద్రుడు తన పాపా పరిహారార్థం పూజించి అక్కడే ఆలయం కట్టించగా దానినే అమరేశ్వర ఆలయం అంటున్నామని పురాణాలూ చెబుతున్నాయి.
శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయములో తులాభారం తూగి తన బరువుతో సరి సమానమైన బంగారాన్ని పేదలకి పంచిపెట్టారని శాసనం లో ఉంది. అందుకు గుర్తుగా శ్రీ రాయలవారు నిర్మించిన తులాభారం అనే పేరుగల మండపం,దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయంలోని 16 అడుగుల స్పటిక లింగాన్ని దర్శించడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.