Home Unknown facts అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ స్థలపురాణం!

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ స్థలపురాణం!

0

అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి తెలియని తెలుగు వారుండరు. హిందూ ఆచారం ప్రకారం.. కొత్తగా పెళ్ళయిన జంటలు సత్యనారాయణ స్వామి వ్రతం తప్పకుండా చేసుకోవాలి. ఇళ్ళలో చేసుకునే వ్రతాలకంటే.. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు.

Annavaram Satyanarayana Swamy Templeవిశిష్టమైన ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది. ఈ ఆలయం స్థలపురాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం… పూర్వం అనరాజు అనే రాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అనరాజు అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ చివరకు రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు.

అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించాడు. రాజుకు కలలో కనిపించి ”బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది..” అని చెప్పి, సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతి ఒక కల కన్నాడు. ”రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని” ఆ కల సారాంశం.

ఆ అధికారి తనకు ఆ కల రావడంలో ఆంతర్యం ఏమిటా అనుకుని, వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్శనమిచ్చింది. ఉండూరు సంస్థాన అధికారి వెంటనే రత్నగిరి కొండమీద ఆలయం కట్టించాడు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించాడు.

అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ దర్శనానికి వెళ్లేవారికి ప్రతీ చోటు ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. రత్నగిరి సత్రం, దేవస్థానం వారి ఫలహార శాల దాటగానే ప్రవేశద్వారం కనిపిస్తుంది. అందులోంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది.

సత్యనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర గోడ మీద ”హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప” అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపంలు ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాలలు ఉన్నాయి.

అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి. అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుందనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది.

 

Exit mobile version