Home Unknown facts Ayyappa deekshalo paatinchalsina niyamalu enti? hariharasuthudani aayanaku yendhuku antaaru?

Ayyappa deekshalo paatinchalsina niyamalu enti? hariharasuthudani aayanaku yendhuku antaaru?

0

ప్రపంచ వ్యాప్తంగా శబరిమల పుణ్యక్షేత్రానికి మంచి ఆదరణ ఉంది. ఈ ఆలయంలో ఉన్న స్వామినే అయ్యప్ప గా కొలుస్తారు. అయ్యప్ప పేరులో అయ్యా అంటే ‘విష్ణువు’, అప్ప అంటే ‘శివుడు’ అని అర్ధం. అందుకే ఈ స్వామికి అయ్యప్ప అను పేరు వచ్చిందని చెబుతారు. ఇంకా ఈయనను హరిహరసుతుడు, మణికంఠ స్వామి అని కూడా పిలుస్తుంటారు. అయితే అసలు అయ్యప్ప దీక్ష ఎలా ఉంటుంది, దీక్షలో పాటించాల్సిన నియమాలు ఏంటి? ఆ స్వామిని హరిహరసుతుడు అని ఎందుకు పిలుస్తుంటారు? ఇంకా కన్నెస్వాములు అంటేనే ఆయనకి ఎక్కువ ఇష్టం అనడం వెనుక కారణాలు ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ayyappaకేరళ రాష్ట్రంలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో శబరిమల క్షేత్రం ఉంది. శబరిమల వెళ్లి అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి భక్తులు తప్పకుండ మాల ధరించి ఉండాలి. ఇక అయ్యప్ప దీక్ష ప్రారంభించిన భక్తులు నల్లటి వస్త్రాలు ధరించి బ్రహ్మచర్యను పాటిస్తుండాలి. అయితే కార్తీక మాసం నుండి మాలధారణ ధరించి 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్దలతో స్వామిదీక్షను పూర్తిచేసుకొని ఇరుముడిని కట్టుకొని శబరిమలకు వెళ్లాలి. ఇరుముడి అంటే, నేతితో నిండిన కొబ్బరికాయలు, పూజాద్రవ్యాలు, బియ్యం, వస్త్రాలు తదితరాలతో నిండిన ఈ మూటను గురుస్వామి భక్తుల శిరసున ఉంచుతారు. ఇక ఆ ఇరుముడి తో కాలినడకన శబరిమల చేరుకొని అయ్యప్ప భక్తులు అయ్యప్పని దర్శించుకుంటారు. అయ్యప్ప దీక్షలో స్వాములు పాటించాల్సిన నియమాలు:
అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఉదయాన్నే చల్లటి నీటితో తల స్నానం చేసి అయ్యప్పకి దీపారాధన చేసి స్తోత్రపఠం చేయాలి.
41 రోజుల పాటు నల్లటి దుస్తులు ధరిస్తూ, చెప్పులు ఉపయోగించకూడదు, ఇంకా ప్రతి రోజు దేవాలయాన్ని సందర్శించాలి. అంతేకాకుండా దీక్షలో ఉన్నన్ని రోజులు క్షవరం మరియు గోళ్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు. దీక్షని ప్రారంభించిన స్వాములు వారి మెడలో ధరించిన ముద్రమాలను ఎట్టి పరిస్థితిలో కూడా తీయకూడదు. దాంపత్యజీవితానికి దూరంగా ఉంటూ అస్కలిత బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైన నిద్రిస్తూ దిండు, పరువు వంటివి ఉపయోగించకూడదు. పెద్ద, చిన్న, అని తేడాలు లేకుండా ప్రతిఒక్కరిని వారి చివర అయ్యప్ప అని చేర్చి సంబోధిస్తుండాలి. ఆడవారిని మాత అని సంబోదించాలి. ఇంకా శవం, బహిష్టు అయిన ఆడవారిని చూడకూడదు ఒకవేళ చూస్తే పంచగవ్య శిరస్నానం చేసి, శరణుఘోష చెప్పెంతేవరకు కనీసం నీటిని కూడా ముట్టుకోకూడదు. స్వామి మాల ధరించు వారు చెడు అలవాట్లకి దూరంగా ఉంటూ ఎప్పుడు కూడా అసత్యాన్ని చెప్పకూడదు. ధీక్షలో ఉన్నప్పుడు కనీసం ఒకసారైనా స్వాములందరిని పిలిచి బిక్ష పెట్టించాలి. స్వామిని హరిహరసుతుడని అనడానికి కారణం:మహిశాసురుని సంహారం తరువాత అయన సోదరి మహిషి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేయగా అప్పుడు బ్రహ్మ ప్రత్యేక్షమై వరం కోరుకోమని అడుగగా, శివకేశవులకు పుట్టిన సంతానం చేతిలో తప్పా ఎవరితోనూ చావులేనట్లు వరం అడుగుతుంది. అంతేకాకుండా హరిహర తనయుడు పన్నెండేళ్ళపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవా ధర్మం నిర్వర్తించాలి, అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. అయితే క్షీరసాగర మధనంలో ఉద్భవించిన అమృతం దేవతలు, రాక్షసులకు పంచేందుకు మోహినిగా అవతరించిన శ్రీమహావిష్ణువు కార్యం నిర్వహిస్తాడు. అదేరూపంలో విహరిస్తున్న మోహినిని చూసిన శివుడు ఆకర్షింపబడతాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం, 30వ రోజు శనివారం, పంచమి తిథి, ఉత్తరా నక్షత్రం వృశ్చికా లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. ఇతడు శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం. తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారం పంపా నది తీరాన మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరిస్తాడు హరిహరసుతుడు. అయ్యప్పకి కన్నె స్వాములు అంటేనే ఎందుకు ఇష్టం:మొదటిసారి అయ్యప్ప మాల వేసిన భక్తులను కన్నెస్వామి అని పిలుస్తుంటారు. అయ్యప్పకి కన్నెస్వాములు అంటే ఇష్టం కనుక దీక్ష చేస్తున్న భక్తులు వారి సన్నిధిలో ఒకరైన కన్నె స్వామి ఉండాలని కోరుకుంటారు. అయితే అయ్యప్పకి కన్నె స్వాములు అంటే ఇష్టం అనడానికి ఒక కథ ఉంది. ఇక పురాణానికి వెళితే, దత్తాత్రేయుడి భార్య లీలావతి పతి శాపంతో మహిషాసురుడి సోదరి మహిషిగా జన్మించింది. ప్రజలను పట్టిపీడిస్తోన్న మహిషాసురుని లోకమాత సంహరించడంతో పతి శాపంతో మహిషిగా పట్టిన లీలావతి రాక్షసులకు రాజుగా సింహాసనం అదిష్ఠించింది. దేవతలపై ప్రతీకారం తీసుకోవాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేసి, శక్తులు పొందిన మహిషి ప్రజలను హింసించసాగింది. దేవతల కోరిక మేరకు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడు అయ్యప్పగా అవతరించి మహిషిని సంహరించాడు. తనకు శాప విమోచనం లభించడంతో అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమ్మని కోరుతుంది. ఆమె కోరికను విన్న స్వామి తిరస్కరిస్తాడు. అయినా ఆమె పట్టువీడకపోవడంతో తన దర్శనానికి కన్నెస్వాములు రానప్పుడు నిన్ను వివాహం చేసుకుంటానని స్వామి మాటిస్తాడు. వారి రాకకు గుర్తుగా శరంగుత్తిలో బాణాలు ఉంచుతారని, అక్కడ ఎప్పుడైతే ఒక్క బాణం కూడా కనిపించదో ఆనాడు పెళ్లాడతానని అన్నారు. అంతేకాదు శబరి కొండల్లో నీవు మాలికాపురోత్తమ అనే పేరుతో పూజలందుకుంటావని తెలిపారు. కన్నెస్వాములు రాక ఆగడం ఎప్పటికీ జరగనిదని పరమార్థం. ఎందుకంటే ఇది బ్రహ్మచారి అవతారం. ఇందులో భాగంగానే శబరిగిరికి వచ్చిన కన్నె స్వాములు ఎరుమేలి నుంచి తెచ్చిన బాణాలను శరంగుత్తిలో గుచ్చుతారు.ఇలా రాక్షస సంహారం కోసం జన్మించిన అయ్యప్పస్వామి శబరిమల అరణ్యంలో వెలసి ప్రపంచం నలుమూలల ఉన్న భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

Exit mobile version