అభిషేకానికి అన్నింటికీ మించి శ్రేస్టమైనది కొబ్బరినీళ్లు. కొబ్బరికాయను కొట్టడం శాంతి కారకం, అరిష్టనాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయను కొట్టడానికి కొన్ని నియమాలున్నాయి. కొబ్బరి కాయను స్వామికి సమర్పించే ముందు దానిని స్వచ్ఛమైన నీటితో కడిగి, ఆ తరువాత కొబ్బరికాయను జుట్టున్న ప్రదేశంలో పట్టుకుని, భగవంతుని స్మరిస్తూ కొట్టాలి. రాయిపై కొట్టేటప్పుడు, ఆ రాయి ఆగ్నేయకోణంగా ఉండటం మంచిది.
ఒకవేళ వంకరటింకరగా పగిలినప్పటికీ, కుళ్ళిపోయినట్లు కనిపించినప్పటికీ దిగులు పడనక్కర్లేదు. అదేదో కీడు కలిగిస్తుందని దిగులు అవసరం లేదు. కొబ్బరి నీటిని అభిషేకించేటప్పుడు కొబ్బరికాయను కొట్టి, దానిని విడదీయకుండా చేతబుచ్చుకుని, అభిషేకం చేయరాదు.
అలా చేస్తే, ఆ కాయ నివేదనకు పనికిరాదు. కాయను కొట్టి, ఆ జలాన్ని ఒక పాత్రలోనికి తీసుకుని, కాయను వేరుచేసి ఉంచాలి. పాత్రలోని కొబ్బరినీటిని మాత్రమే అభిషేకించాలి. వేరుగా ఉంచిన కొబ్బరికాయ పూజ సమయంలో సమర్పించాలి.